ప్రతివారం ఒక నాటకం
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:36 PM
‘చంద్రన్న వరం ప్రతివారం ఒక నాటకం’ పేరుతో రాష్ట్రంలోని రంగస్థల కళాకారులు ప్రతి శనివారం ఒక నాటకం ప్రదర్శించేలా చేసి వారిని ఆదుకుంటామని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు.

ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ
కర్నూలు కల్చరల్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘చంద్రన్న వరం ప్రతివారం ఒక నాటకం’ పేరుతో రాష్ట్రంలోని రంగస్థల కళాకారులు ప్రతి శనివారం ఒక నాటకం ప్రదర్శించేలా చేసి వారిని ఆదుకుంటామని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. నగరంలోని టీజీవీ కళా క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లా రంగస్థల కళాకారుల సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఏపీ నాటక అకాడమీలో ప్రతి రిజిస్టరు కళాసంస్థ తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వారికి దశల వారీగా ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రతి కళాకారుడికి పింఛన్, ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా కళాకారులకు ఆర్థిక సాయం అందించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కళాకారుల సంఘం అధ్యక్షుడు మహాలింగప్ప, జిల్లా రంగస్థల కళాకారుల సంఘం ఉపాధ్యక్షుడు పి.దస్తగిరి, విశ్వకళా సమితి అధ్యక్షుడు పి. హనుమంతరావు చౌదరి, హరికథ కళాకారిణి మంజుల, రంగం సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్, సీనియర్ కళాకారులు వీవీ రమణారెడ్డి, ఖాదర్ బాబు తదితరులు చైర్మన్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు.