Share News

అరాచక రాజ్యంలో అద్భుత ఫలితం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:45 PM

కబ్జాల ఇలాకాలో కష్టాల సుడిగండం..

అరాచక రాజ్యంలో అద్భుత ఫలితం

ప్రతి పల్లె పసుపుమయమే..!

77 గ్రామాల్లో 68 గ్రామాల్లో టీడీపీకి మెజారిటీ

కల్లూరు 16 వార్డుల్లోనూ హవా

కాటసాని అక్రమాలపై విసిగెత్తిన ప్రజలు

గౌరు చరితకు జైకొట్టిన జనం

కబ్జాల ఇలాకాలో కష్టాల సుడిగండం.. ఎటు చూసినా అల్లరి మూకల అరాచకాల పర్వం.. ఎప్పుడు ఎవరు దౌర్జన్యానికి దిగుతారో తెలియని దైన్యం. అటువంటి నియోజకవర్గంలో అద్భుత ఫలితం.. బలమైన క్యాడర్‌ లేకున్నా మంచితనమే ఆమె ఆయుధమైంది. అనేక ఇబ్బందుల్లోనూ ప్రజలను అంటిపెట్టుకొని ఉండడమే తన విజయానికి సోపానమైంది. బలమైన వర్గం తమకు ఉందంటూ జబ్బలు చరుచుకున్న ప్రత్యర్థిని ఆమె మంచితనమే మట్టి కరిపించింది. సార్వత్రిక ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ విజయ ఢంకా మోగించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలతోపాటు కల్లూరు 16 వార్డుల్లో సైతం టీడీపీ సత్తా చాటింది. పసుపు జెండా ఎగురవేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక గౌరు చరిత ఆధ్వర్యంలో నెరవేరింది. 40,500 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించింది.

కర్నూలు, జూన్‌ 8: పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలతో 16 అర్బన్‌ వార్డులు ఉన్నాయి. పాణ్యం మండలంలో 18 గ్రామాలు, గడివేములలో 17 గ్రామాలు, ఓర్వకల్లులో 22 గ్రామాలు, కల్లూరులో 20 గ్రామాలతోపాటు 16 వార్డులు ఉన్నాయి. ప్రతి మండలంలో మూడు గ్రామాలు మినహాయించి 68 గ్రామాల్లో టీడీపీ విజయబాట ఎగురవేసింది. పాణ్యం మండలంలో పిన్నాపురం, తొగర్చేడు, అనుకూరు, గడివేములలో ఒండుట్ల, బిలకలగూడూరు, ఆళ్లగడ్డ, ఓర్వకల్లులో మీదివేముల, కొంతలపాడు, చింతలపల్లె, కల్లూరులో గోకులపాడు, పుసులూరు, కొంగనపాడు మినహాయించి అన్ని గ్రామాల్లోనూ అత్యధికంగా మెజారిటీ సాధించింది. కల్లూరు మండలం ఉలిందకొండలో, ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో, గడివేముల మండలం గని గ్రామంలో, పాణ్యం మండలం పాణ్యం గ్రామాల్లో వైసీపీ కంటే టీడీపీ అత్యధిక శాతం మెజారిటీ సాధించింది.

బలమైన క్యాడర్‌ ఉన్నా...

పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా వైసీపీ, కాంగ్రెస్‌లు ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్‌ ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడంతో కొంత వెనుకబడాల్సిన పరిస్థితి ఉండింది. పునర్విభజనకు ముందు 1983, 1999లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా టీడీపీ గెలుపొందలేదు. 1999లో టీడీపీ తరపున బిజ్జం పార్థసారథిరెడ్డి పోటీ చేసి అత్యధిక మెజారిటీ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీకి దూరం కావడం, పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం వంటి కారణాలతో టీడీపీకి కొంత లోటు కనిపించింది. 2009లో బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి పాణ్యం తరపున బరిలో నిలిచిన ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికి కూడా దూరమయ్యారు. 2014లో ఏరాసు ప్రతాప్‌రెడ్డి పాణ్యం టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవి చూసి ఆయన కూడా నియోజకవర్గానికి దూరమయ్యారు. 2019లో గౌరు చరిత వైసీపీ నుంచి టీడీపీలో చేరి పాణ్యం నుంచి పోటీ చేశారు. ఆమె కూడా ఓడిపోయారు.

ఓడిపోయినా కూడా

2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవి చూసిన గౌరు చరిత ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. రాష్ట్రంలో వైసీపీకి అత్యధిక ప్రాబల్యం ఉన్నా.. టీడీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నా, వేధింపులకు గురి చేస్తున్నా కూడా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది టీడీపీ నాయకులు వైసీపీ అరాచకాలను ప్రశ్నించేందుకు ముందుకు రావడానికి భయపడిన తరుణంలో గౌరు చరిత మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా ముందుండి వారికి అండగా నిలిచారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి అరాచకాలను సైతం ఎదురొడ్డి పోరాడారు. ఆయన అరాచకాలను ప్రశ్నించడంలో ముందు నిలబడ్డారు. నిత్యం కార్యకర్తలకు ధైర్యం చెబుతూ అండగా ఉండటంతోనే ఈ రోజు ఆమెను విజయం వరించింది. టీడీపీ వస్తే తాను ఏం చేసేదీ పల్లె పల్లెలో హామీ ఇచ్చారు. దీంతో పాటు సౌమ్యురాలు, మృధు స్వభావి కావడంతో పాణ్యం నియోజకవర్గ ప్రజలను ఇట్టే ఆకర్షించారు. వైసీపీలో ఉన్న సమయంలో కూడా ఏనాడూ అరాచకాల జోలికి వెళ్లలేదు.

అర్బన్‌ వార్డుల్లో సైతం

కల్లూరు అర్బన్‌ వార్డుల్లో సైతం టీడీపీ మెజారిటీ సాధించింది. 16 వార్డుల్లో 23,017 ఓట్ల మెజారిటీ కైవసం చేసుకుంది. ప్రతి వార్డులో వేయికి పైగా మెజారిటీ దక్కింది. అత్యధికంగా 33వ వార్డులో వైసీపీకి కంటే 36.20 శాతం అత్యధిక మెజారిటీ సాధించింది. ఖాళీ స్థలాల్లో కాటసాని కబ్జాలు, అరాచకాలే వార్డు ప్రజల్ని టీడీపీ వైపు మళ్లించాయి. దీంతోపాటు అర్బన్‌ వార్డులకు ప్రతి రోజూ తాగునీరు అందిస్తామని గౌరు చరిత హామీ ఇవ్వడంతో వార్డు ప్రజలు కూడా టీడీపీ వైపే మొగ్గు చూపారు.

టీడీపీ మెజారిటీ వివరాలు ఇలా..

పాణ్యం మండలం: పర్ల-882, ఎ.గోకులపాడు- (-1), నెరవాడ -83, సల్కాపురం-344, కె.మార్కాపురం-32, పెద్దకొట్టాల-79, బస్తిపాడు-292, పుసులూరు-(-100), రేమడూరు-180, నాయకల్లు-78, కొంగనపాడు-(-18), చెట్ల మల్లాపురం-01, ఉలిందకొండ-1333, చిన్నటేకూరు-515, యాపర్లపాడు-133, తడకనపల్లె-425, పెద్దటేకూరు- 240, బొల్లవరం-118, దూపాడు-162, దొడ్డిపాడు-30 (మొత్తం -4808 ఓట్ల మెజారిటీ వచ్చింది)

కల్లూరు అర్బన్‌ వార్డులో: వార్డు-19లో 1370, వార్డు 19-20లో 1227, వార్డు-20లో 569 వార్డు-21లో 673, వార్డు 26లో 841, వార్డు 27లో 950, వార్డు 28లో 2126, వార్డు 29లో 1332, వార్డు 30లో 1089, వార్డు-31లో 1068, వార్డు-32లో 2112, వార్డు 33లో 2621, వార్డు-34లో 2381, వార్డు-35లో 1757, వార్డు-36లో 1436, వార్డు-37లో 487, వార్డు 41లో 978 మెజారిటీ వచ్చింది. మొత్తం 23,017 ఓట్లు మెజారిటీ వచ్చింది.

ఓర్వకల్లు మండలంలో: నన్నూరు-323, బైరాపురం-55, లొద్దిపల్లె-240, ఉయ్యాలవాడ-807, మీదివేముల-(-326), పూడిచెర్ల-151, కేతవరం-53, కన్నమడకల-518, ఓర్వకల్లు-346, గుట్టపాడు-123, కొంతలపాడు-(114), ఉప్పలపాడు-118, పాలకొల్లు-65, చింతలపల్లి- (-33), కొమరోలు-60, సోమయాజులపల్లె-474, కాల్వ -(-71), గుడుంబాయితాండా-(-38), హుశేనాపురం-1168, తిప్పాయపల్లె-22, శకునాల-27 బ్రాహ్మణపల్లె-17లో మొత్తం మెజారిటీ 3641 వచ్చింది.

గడివేములలో: మంచాలకట్ట-105, గని-574, ఎల్‌కే తండా-71, ఒండుట్ల-(58), కె.బొల్లవరం-111, గడిగరేవుల-294, చిందుకూరు-257, బూజనూరు-15, గడివేముల-1090, కొర్రపోలూరు-69, బిలకల్‌ గూడూరు-(-54), ఆళ్లగడ్డ-(-43), పెసరవాయి-444, కర్రిమిద్దెల-492, తిరుపాడు-40, కొరటమద్ది-95, దుర్వేసి-299 ఓట్లతో మొత్తం 3801 మెజారిటీ వచ్చింది.

పాణ్యంలో: పిన్నాపురం-(-37), తమ్మరాజుపల్లె-282, పాణ్యం టౌన్‌-1662, సుగాలిమెట్ట-98, కొండవీడు-164, కందికాయపల్లె-31, ఆలమూరు-34, గోనవరం-175, భూపనపాడు-261, నెరవాడ-38, కౌలూరు-119, గోరుకల్లు-325, కొండజూటూరు-118, బలపనూరు-210, తొగర్చేడు-(-31), మద్దూరు-38, అనుపూర్‌-(-256), కొత్తూరు-129 ఓట్లతో మొత్తం 3360 మెజారిటీ వచ్చింది.

పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ మెజారిటీ

మండలం మెజారిటీ

పాణ్యం 3,360

గడివేముల 3,801

ఓర్వకల్లు 3,641

కల్లూరు 4,808

అర్బన్‌ 16 వార్డులు 23,010

కబ్జాలే కొంపముంచాయి..

కాటసాని రాంభూపాల్‌రెడ్డి భూ సెటిల్‌మెంట్లు, అరాచకాలు, కబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి మాఫియాతో ఓడిపోయినట్లు తెలుస్తోంది. పాణ్యంలో ప్రతి టెండరులో ఈయనే. కాంట్రాక్టర్లను ఎవరినీ ముందుకు రానివ్వలేదన్న అపవాదు మూట గట్టుకున్నారు. పిన్నాపురం, కందికాయపల్లె సోలార్‌ పనుల్లో కూడా వీరి వాటా ఉందని తెలుస్తోంది. గనిలోని సోలార్‌ క్లీనింగ్‌ పనులను వేరే వాళ్ల నుంచి బలవంతంగా లాక్కున్నట్టు సమాచారం. ఇలా చెప్పుకుంటూపోతే కాటసాని అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఇలా ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత చివరకు కాటసాని ఓటమికి కారణమైందని తెలుస్తోంది.

Updated Date - Jun 08 , 2024 | 11:45 PM