సౌకర్యాలు లేని మార్కెట్ యార్డు
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:25 AM
ఐదేళ్ల వైసీపీ పాలన మార్కెట్ కమిటీల అభివృద్ధిని విస్మరించింది. వ్యయ ప్రయాసలకు ఓర్చి పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్ కమిటీలకు విక్రయానికి తీసుకొస్తే అక్కడ రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవు.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
ఆదాయం ఘనం.. సేవలు శూన్యం
కూటమి ప్రభుత్వంపైనే అన్నదాతల ఆశలు
ఆదోని అగ్రికల్చర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఐదేళ్ల వైసీపీ పాలన మార్కెట్ కమిటీల అభివృద్ధిని విస్మరించింది. వ్యయ ప్రయాసలకు ఓర్చి పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్ కమిటీలకు విక్రయానికి తీసుకొస్తే అక్కడ రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. ముఖ్యంగా ఆదోనిలో వర్షం వస్తే మార్కెట్ యార్డులో ప్లాట్ ఫాంపైౖకి అడుగులోతు నీరు చేరి పంట ఉత్పత్తులన్నీ కొట్టుకుపోతున్నాయి. వాన వస్తే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ కమిటీలకు రూ. కోట్ల ఆదాయమున్నా రైతులకు కల్పించాల్సిన సేవలు మాత్రం శూన్యం. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందు రాక పనులు నిలిచిపోయాయి. దీంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. అధికారంలోకి వచ్చిన కూటమి మార్కెట్ కమిటీల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
ఆదోని మార్కెట్ యార్డుకు ప్రత్యేకమైన గుర్తింపు
రాష్ట్రంలోనే ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పంట ఉత్పతుల ద్వారా ఏటా రూ.1600 కోట్ల లావాదేవీలతోపాటు పరోక్షంగా మరో రూ.400 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా మార్కెట్ కమిటీకి ఏటా రూ.16 కోట్లు సెస్సు రూపంలో ఆదాయం సమకూరుతోంది. ఇంత ఆదాయం ఉన్నా రైతులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో మార్కెటింగ్ శాఖ విఫలమవుతోంది. వర్షం వస్తే మార్కెట్ కమిటీకి విక్రయించడానికి తెచ్చిన పంట ఉత్పత్తులన్నీ తడిసిపోతున్నాయి. డ్రైనేజీలు సరిగా లేక వర్షం నీరంతా ప్లాట్‌ఫాంపై చేరి పంట ఉత్పత్తులన్నీ ఆ వర్షపు మడుగు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇటీవల రైతులు తెచ్చిన వేరుశనగ వాళ్ల కళ్ల ముందే వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు గుండెలు బాదుకున్నారు. తలకు చుట్టుకున్న తవాలు, నడుముకు కట్టుకున్న పంచెను తీసి ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రూ.లక్షల్లో తీవ్రంగా నష్టపోయారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ ఆదోని మార్కెట్ యార్డులో పర్యటించి డ్రైనేజీలు ప్లాట్ ఫాంలా ఎత్తు పెంపు షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే గత వైసీపీ పాలనలో మార్కెట్ యార్డులో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టరులు ముందుకు రావడం లేదు. ఆ బిల్లులను కూడా చెల్లిస్తామని పనులు చేపట్టాలని అధికారులు హామీ ఇస్తున్నారు.
అసంతృప్తిగా జంబో షెడ్
మార్కెట్ యార్డులో 2018-17లో అప్పటి టీడీపీ ప్రభుత్వం టీఎంసీ యార్డులో రూ.5 కోట్లతో పత్తి దిగుబడులు తడవకుండా జంబో కవర్డ్ షెడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించింది. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి పిల్లర్లు వేశారు. ప్రభుత్వం మారడంతో పైకప్పు పనులు మిగిలిపోయాయి. చేసిన పనులకు అధికారంలోకి వచ్చిన వైసీపీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. కవర్డ్ పైకప్పు వేయాలని కాంట్రాక్టరులు పలుమారులు కోరినా బిల్లు మంజూరు కాకపోవడంతో ముందుకు రాలేకపోయారు. మూడు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కూటమి అధికారంలోకి రావడంతో మరోమారు టెండర్లు పిలిచి పనులు చకచకా చేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
శిథిలావస్థలో దుకాణాలు
350పైగా దుకాణాలు ఉన్నాయి. ఇందులో వందకుపైగా దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పులన్నీ పెచ్చులు ఊడడంతో వర్షపు నీటికి గోడలన్నీ నెమ్ము చేరి బీటలు వారుతున్నాయని కమీషన్ ఏజెంట్లు వాపోతున్నారు. దుకాణాల ముందు ఉన్న రేకుల షెడ్డు నుంచి వరండాలో వర్షపు నీరు కిందికి వెళ్లేందుకు సరైన డ్రైనేజీలు లేకపోవడంతో పాట్‌ఫాంపైకి చేరుతోంది. పంట ఉత్పత్తులన్నీ తడిసిపోతున్నాయని, కూటమి ప్రభుత్వమైనా రైతులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
బడ్జెట్ కేటాయించిన వెంటనే 15 రోజుల్లో టెండర్లు
డ్రైనేజీల నిర్మాణానికి పాత యార్డులో దుకాణాల ముందు పరండాలలోకి నీరు చేరకుండా పనులు చేపడతాం. రూ.70 లక్షలు డ్రైనేజీలకు, మరో 26 లక్షలు గట్టర్ల నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాం. ఆమోదం తెలిపిన వెంటనే 15 రోజుల్లో టెండరులు పిలిచి పనులు చేపడతాం. కవర్డ్ షెడ్ పైకప్పు వేయడానికి కూడా టెండరులు పిలిచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
-సుబ్బారెడ్డి డీఈ, మార్కెటింగ్ శాఖ ఆదోని