Share News

వీడుతున్న గుట్టు

ABN , Publish Date - May 21 , 2024 | 12:03 AM

తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గార్గేయపురం చెరువులో లభ్యమైన ముగ్గురు మహిళల అనుమానాస్పద మృతి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 24 గంటల వ్యవధిలోనే పోలీసులు మిస్టరీని ఛేదించగలిగారు.

వీడుతున్న గుట్టు

ముగ్గురు మహిళల్లో ఇద్దరు హత్య..!

పోలీసు అదుపులో ఆటో డ్రైవర్‌

కర్నూలు, మే 20: తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గార్గేయపురం చెరువులో లభ్యమైన ముగ్గురు మహిళల అనుమానాస్పద మృతి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 24 గంటల వ్యవధిలోనే పోలీసులు మిస్టరీని ఛేదించగలిగారు. గార్గేయపురం చెరువులో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళల మృతదేహాలు, చెరువు పక్కన గట్టు మీద మరో మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఆ ఇద్దరు మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులే..

మృతి చెందిన ముగ్గురు మహిళల్లో ఇద్దరు మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులుగా గుర్తించారు. ఓ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళ సాయంతో ఆ ఇద్దరి వివరాలను తెలుసుకున్నారు. మృతి చెందిన వారిలో ఒకరు జానకి కాగా ఆమెది మహబూబ్‌నగర్‌ జిల్లా అబంగపట్నంగా గుర్తించారు. మరో మహిళ అరుణది కూడా ఇదే జిల్లానే. కానీ స్వస్థలం తెలియరాలేదు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న ఓ ఆటోను గుర్తించారు. ఆటో నెంబరు ఆధారంగా డ్రైవర్‌ షేక్‌ మహబూబ్‌బాషాను అదుపులోకి తీసుకున్నారు. షేక్‌ మహబూబ్‌బాషాతో అరుణకు గొడవలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే అరుణను జానకిని తన ఆటోలో ఎక్కించుకుని గార్గేయపురం చెరువు వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడే వీరికి పూర్తిగా కల్లు తాపించి మద్యం మత్తులో ఉన్న వీరిని చెరువులోకి తోసేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరో మహిళను మాత్రం మతిస్థిమితం లేకుండా గుర్తించారు. స్థానికంగానే ఆ మహిళ తిరుగుతుండేదని, హోటళ్లలో నీరు ఇప్పించుకొని తాగుతుండేదని స్థానికులు చెబుతున్నారు. పూర్తి విషయాలు మంగళవారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Updated Date - May 21 , 2024 | 12:03 AM