Share News

ఘనంగా రాయబారాది మహోత్సవం

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:29 AM

ప్రముఖ శక్తి క్షేత్రమైన నందవరం చౌడేశ్వరీదేవి ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు గురువారం అమ్మవారి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది.

ఘనంగా రాయబారాది మహోత్సవం

నందవరంలో కొనసాగుతున్న అమ్మవారి ఉత్సవాలు

బనగానపల్లె రూరల్‌, ఏప్రిల్‌ 11: ప్రముఖ శక్తి క్షేత్రమైన నందవరం చౌడేశ్వరీదేవి ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు గురువారం అమ్మవారి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి జి.కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఉదయం చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సాయంత్రంలో గ్రామంలోని ఊరివాకిలి వద్ద ప్రత్యేకంగా అలంకరించి తేరుబండికి గ్రామంలోని రైతుల ఎద్దులను కట్టి గ్రామ శివార్లలో ఉన్న పొలిమేర వద్దకు అమ్మవారి రాయబారాది మహోత్సవాన్ని నిర్వహించారు. సంప్రదాయబద్దంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోకి తిరిగి రావడంతో రాయబారాది మహోత్సవం ముగిసింది.

కన్నుల పండువగా చెన్నకేశ్వస్వామి కల్యాణోత్సవం

ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నందవరం గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఆలయ అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేవవస్వామి ఉత్సవ విగ్రహాలకు రాత్రి 10 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించారు.

నేడు జ్యోతి మహోత్సవం : చౌడేశ్వరిదేవి ఉగాది బ్రహోత్మవాల్లో భాగంగా నాలుగోరోజు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జ్యోతి మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు అలంకరణ, సాయంత్రం 5 గంటలకు అభయహస్త సేవా సమితి ధర్మవరం బృందంచే అన్నమయ్య సంకీర్తన నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు భాస్కరయ్యాచారితో అమ్మవారికి దిష్టిచుక్క పెట్టే కార్యక్రమం, ఒంటి గంట నుంచి జ్యోతి మహోత్సవం ప్రారంభమవుతుంది.

Updated Date - Apr 12 , 2024 | 12:29 AM