Share News

కోలాహలంగా నామినేషన్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:21 AM

కందనవోలు గడ్డపై పసుపు సైన్యం జోరు పెంచింది. బుధవారం కోడుమూరు, పాణ్యం, పత్తికొండ నియోజకవర్గాల్లో భారీ ఊరేగింపుతో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

కోలాహలంగా నామినేషన్లు

పాణ్యం, కోడుమూరు, పత్తికొండ

టీడీపీ అభ్యర్థుల దాఖలు

ఇప్పటి వరకు 172కు చేరిన నామినేషన్‌ పత్రాలు

కర్నూలు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కందనవోలు గడ్డపై పసుపు సైన్యం జోరు పెంచింది. బుధవారం కోడుమూరు, పాణ్యం, పత్తికొండ నియోజకవర్గాల్లో భారీ ఊరేగింపుతో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వెల్లువలా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం.. కేరింతలతో నామినేషన్ల ఊరేగింపు సాగింది. 24వ తేదీ మంచి రోజు కావడంతో ఒక్కరోజే 63 నామినేషన్లు దాఖలయ్యాయి. 18వ తేదీ నుంచి ఇప్పటి దాకా కర్నూలు ఎంపీ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 172 నామినేషన్లు ఎన్నికల అధికారులకు చేరాయి. పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత నంద్యాల చెక్‌పోస్టు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆమెతో పాటు టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, జనసేన కన్వీనర్‌ చింతామోహన్‌, బీజేపీ నాయకులు నాగరాజులు వెంట రాగా ఊరేగింపు ముందుకు సాగింది. అనంతరం నిబంధనల ప్రకారం పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌరకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి సైతం భారీ ఎత్తున ఊరేగింపుగా ఆర్వో కార్యాలయం చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకులు ఎదురూరు విష్ణువర్దన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ల ఊరేగింపు ఎస్టీబీసీ కాలేజీ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. అభ్యర్థి బొగ్గుల దస్తగిరి వెంట టీడీపీ నాయకులు విష్ణువర్దన్‌ రెడ్డి, రామలింగారెడ్డి, కేఈ మల్లికార్జున గౌడు, కేఈ వేమన్నగౌడు, ఆకేపాటి జయన్నలతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ అభ్యర్థిగా దస్తగిరి ఆయన సతీమణి ముప్పసాని సుధారాణిలు ఆర్వో, ఆర్డీవో శేషిరెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

పత్తికొండలో టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు భారీ ఊరేగింపు మద్య నామినేషన్‌ వేశారు. ముందుగా తల్లిదండ్రులు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, పద్మావతమ్మల ఆశీర్వదం తీసుకున్నారు. కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, టీడీపీ సీనియర్‌ నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకట్రాముడు, నబీసాబ్‌, కేఈ హరిబాబు తదితరులతో కలిసి ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి గుత్తి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వీదుల్లో ఎటు చూసినా పసుపు జెండాలు రెపరెపలాడాయి. రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రామలక్ష్మికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అలాగే ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడు, మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి, ఆదోని బీజేపీ అభ్యర్థి పార్థసారధిలతో పాటు కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్‌ బాషా తదితరులు నామినేషన్లు వేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:21 AM