Share News

రేసులో 9 మంది

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:31 AM

రాష్ట్రంలో అధికార వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రజల్లో జగన్‌ గ్రాఫ్‌ దారుణంగా పడిపోయింది. గెలుస్తామో?

రేసులో 9 మంది

టీడీపీ ఎంపీ టికెట్‌పై ఉత్కంఠ!

ఆశావహులందరూ ఉన్నత విద్యావంతులే

భానుశంకర్‌, బస్తిపాడు నాగరాజుపై టీడీపీ ఫోకస్‌

నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

రాష్ట్రంలో అధికార వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రజల్లో జగన్‌ గ్రాఫ్‌ దారుణంగా పడిపోయింది. గెలుస్తామో? ఓడిపోతామోనన్న భయం, టెన్షన్‌ ఆ పార్టీని వెంటాడుతోంది. ఇదే సమయంలో టీడీపీ- జనసేన కూటమికి ప్రజాదరణ అమాంతంగా పెరిగింది. ఈ క్రమంలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు జంకుతుండగా టీడీపీ నుంచి ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి గుమ్మనూరు జయరాం వెనకడుగు వేశారు. వైసీపీ నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయం అని ఆయన భావించారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. దీంతో డోలాయమానంలో పడ్డ వైసీపీ కర్నూలు ఎంపీ స్థానానికి మరొకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇక ఊపు మీదున్న టీడీపీ విషయానికొస్తే కర్నూలు ఎంపీ టికెట్‌కు డిమాండ్‌ ఏర్పడింది. ఈ స్థానానికి ఏకంగా 9 మంది టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకత్వం ఎంపీ టికెట్‌పై తుది కసరత్తు పూర్తి చేసింది.

కర్నూలు, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. రేసులో పలువురు అశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ బీసీలకు ఇవ్వాలని టీడీపీ భావించడంతో ఆ సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. నాలుగైదు రోజుల్లో రెండో జాబితాతో పాటు కర్నూలు ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో టికెట్‌ కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల గురించి వివిధ అంశాలపై రెండు మూడు దఫాలుగా సర్వేలు చేసింది. చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి ఎవరు..? అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

తొమ్మిది మంది ఆశావహులు

కర్నూలు టీడీపీ ఎంపీ టికెట్‌ రేసులో తొమ్మిది ఆశావహులు ఉన్నారు. వారంతా డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌.. వంటి ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. కర్నూలు మండలం పంచలింగాల ఎంపీటీసీ సభ్యుడు, టీడీపీ బీసీ సాధికారిత రాష్ట్ర కమిటీ సభ్యుడు బస్తిపాడు నాగరాజు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా హర్యాణా రాష్ట్ర గవర్నర్‌ వద్ద ఓఎస్‌డీగా పని చేస్తున్న ఐటీ నిపుణుడు బీఏ భానుశంకర్‌ తాజాగా టికెట్‌ రేసులోకి వచ్చారు. దీంతో ఈ ఇద్దరిపై టీడీపీ అధిష్టానం ఫోకస్‌ పెట్టింది. వారి వివరాలు, వారి బలాబలాలు, గెలుపు అంశాలపై ఇప్పటికే టీడీపీ అంతర్గత సర్వే కూడా చేపట్టింది. వీరి తర్వాత టీడీపీ సీనియర్‌ నాయకులు లక్కీటూ బ్రదర్స్‌లో ఒకరైన రాంపుల్లయ్య యాదవ్‌, ఆదోనికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బత్తిన లక్ష్మీనారాయణ, టికెట్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా టీడీపీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌, అమిలీయో ఆస్పత్రి అధినేత డాక్టర్‌ ప్రసాద్‌, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లాకు చెందిన సత్యం వెంచర్స్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజరు ఎంకే రాజశేఖర్‌, డిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పత్తికొండ కురువ పరమేశ్‌ ఎవరికివారుగా ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ టీడీపీ నుంచి స్పష్టమైన హామీ వస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

సర్వేల ఆధారంగా అభ్యర్థి ఎంపిక

ఎంపీ టికెట్‌ ఆశిస్తూ ఆశావహులు నుంచి తొమ్మిది దరఖాస్తులను వివిధ దశల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపు అవకాశాలు, రాజకీయ, సామాజిక సమీకరణాలు, జిల్లాలో వారికి ఉన్న సంబంధాలు, బంధువర్గం.. వంటి అంశాలపై మూడు నాలుగు సెగ్మెంట్లలో సర్వేలు చేయించినట్లు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి వరకు పలువురు నాయకులు, ముఖ్యకార్యకర్తలు అభిప్రాయాలను సేకరించారు. ఇటీవల భానుశంకర్‌ చంద్రబాబును కలిశారు. అదేవిధంగా రెండు రోజుల క్రిత పంచలింగాలకు చెందిన బస్తిపాడు నాగరాజు కూడా చంద్రబాబును అమరావతిలో కలిశారు. పంచలింగాలకు చెందిన బస్తిపాడు నాగరాజు, భానుశంకర్‌ పేర్లు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో టీడీపీ ఎంపీ టికెట్‌ ఎవరికి దక్కనుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Mar 01 , 2024 | 12:32 AM