9 రోజులే..!
ABN , Publish Date - May 26 , 2024 | 11:38 PM
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తపై రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉంది.
అందరిలోనూ ఒకే ఉత్కంఠ
జూన్ 4న ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి
తొలి ఫలితం మంత్రాలయం.. చివరి ఫలితం పాణ్యం
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
కర్నూలు, మే 26 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తపై రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉంది. ఓటరన్న తీర్పుకు నేటితో 15 రోజులు గడిపోయింది. విజేత ఎవరు..? పరాజితులు ఎవరు..? ఓటరు నాడి తెలియక అంతుచిక్కని అంచనాలతో అభ్యర్థులు, ముఖ్యమైన రాజకీయ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజా తీర్పునకు గడువు దగ్గర పడుతుంది. సరిగ్గా పదో రోజు అంటే.. జూన్ 4న మధ్యాహ్నం 12 గంటలకు ఓటరు తీర్పు ఎవరి పక్షమో తెలిపోతుంది. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టరు డాక్టర్ జి.సృజన పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అదే క్రమంలో గెలుపు అంచనాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొందరు.. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మరికొందరు పందేలు వేసుకుంటున్నారు. ఓటర్ల తీర్పు రావడానికి కౌంట్‌డౌన్ మొదలు కావడంతో ప్రధాన పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠకు తెరలేచింది. కౌటింగ్ కేంద్రాల్లో పక్కాగా పని చేసేలా ఏజెంట్ల నియామకాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు కుస్తి పడుతున్నారు.
జిల్లాలో కర్నూలు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 20,54,563 మంది ఓటర్లు ఉండగా.. 15,70,007 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో సగటున 76.42 శాతం పోలింగ్ నమోదైంది. రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో ఈవీఎం యంత్రాలను మూడంచెల భద్రత నడుమ భద్రపరిచారు. అలాగే జిల్లాలో పోలింగ్ విధుల్లో పాల్గోనే ఉద్యోగులు 22,615 మంది ఉంటే.. వారిలో 20,733 మంది తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.81 శాతం నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ బాక్సులు కూడా జిల్లా ట్రెజరరీ ఆఫీసులో భద్రపరిచారు. జూన 14న ఓట్ల లెక్కింపునకు కలెక్టరు జి.సృజన పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి టేబుల్ వద్ద పర్యవేక్షకుడు, సహాయ పర్యవేక్షకుడు, మైక్రో అబ్జర్వర్ ఒకరు ఉంటారు. వీరి పర్యవేక్షణలో అభ్యర్థులు, వారు నియమించిన ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియను పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు పరిశీలకులను నియమించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూంల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించి ఓట్లను లెక్కిస్తారు.
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే 1,174 సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 7 గంటలకే సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధుల్లో ఉండాలి. ఉదయం 5 గంటలకు కలెక్టరేట్ వద్ద కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మొదటగా పార్లమెంట్ అభ్యర్థులకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. గతంలో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం పెరిగింది. మొత్తం 20,733 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే 9 గంటల్లోపే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఈవీఎం యంత్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి రౌండ్‌కు దాదాపు 20-30 నిమిషాలు పడుతుంది. లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అభ్యంతరాలు, అవంతరాలు లేకుండా సవ్యంగా సాగితే మొదటగా మంత్రాలయం నియోజకవర్గం తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటలోపు వస్తుంది. చివరిగా పాణ్యం నియోజకవర్గం ఫలితం వస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోలింగ్ స్టేషన్లను బట్టి రౌండ్లుగా విభజించారు. ప్రతి రౌండ్‌లో 14 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలోని ఓట్లను సమాంతరంగా లెక్కిస్తారు. నియోజకవర్గాల వారీగా ఉండే పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి మంత్రాలయం-17 రౌండ్లు, కర్నూలు, పత్తికొండ, ఆదోని-19 రౌండ్లు, ఎమ్మిగనూరు, కోడుమూరు-20 రౌండ్లు, ఆలూరు-21 రౌండ్లు, పాణ్యం-26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగుతుంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇలా..
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పార్లమెంట్ స్థానానికి పోలైన ఓట్లను ప్రత్యేకంగా, అసెంబ్లీ స్థానాలకు పోలైన ఓట్లను అసెంబ్లీల వారీగా లెక్కిస్తారు. పార్లమెంట్ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అర్హత ఉన్నవాటిని 500 ఓట్లు చొప్పున ఒక కట్టగా కడతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి పార్లమెంట్ స్థానం అభ్యర్థులకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తరువాతే ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్‌లో అసెంబ్లీకి 14, పార్లమెంట్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి నియోజకవర్గం కౌంటింగ్ సెంటరులో మైక్రో అబ్జర్వరు ఒకరు, రిటర్నింగ్ ఆఫీసరు (ఆర్‌ఓ) ఒకరు, ఏఆర్‌వో ఒకరు, అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 28 మంది సూపర్‌వైజర్లు, 28 మంది సహాయకులు, 28 మంది మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తరుపున ఏజెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఎన్నికల ఫలితాన్ని ఎన్నికల ఆర్‌ఓ పరిశీలించి సంతకం చేశాక.. ఆ కాపీని అబ్జర్వరు పరిశీలించి ఆ కాపీపై సంతకం చేసిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారు.