టీడీపీ అంటేనే ఆత్మగౌరవం
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:51 PM
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు దేశం పార్టీ పని చేస్తుందని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.
ఎన్టీఆర్‌కు టీడీపీ ఘన నివాళి
కర్నూలు(అర్బన్), జనవరి 18: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు దేశం పార్టీ పని చేస్తుందని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. గురువారం జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయం ఎదుట ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కేంద్ర మాజీ మంత్రి జయసూర్య ప్రకాష్‌రెడ్డి, టీజీ భరత్, సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి అక్షయ బ్లడ్ బ్యాంక్‌లో లెజండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం బీటీ నాయుడు మాట్లాడుతూ 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో రాష్ట్రం మొత్తం తిరిగి 1983 జనవరి 9న దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి గిన్నిస్ బుక్ రికార్డు కెక్కారని అన్నారు. ప్రజలే దేవుళ్లుగా భావించి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్లు, చీర, దోవతి, వంటి వాటిని అందజేసి జనహృదయాల్లో దైవంగా నిలిచారన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి రాజకీయ, ఆర్థిక ఎదుగుదల కోసం 20 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎంతో మంది బీసీలకు రాజకీయ, ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశారని, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని, పాలనా సౌలభ్యం కోసం మాండలిక వ్యవస్థను తీసుకొచ్చారని గుర్తు చేశారు. టీజీ భరత్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పఽఽథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పనైపోయిందని అంతా అనుకున్నారని, ప్రజల కోసం తెలుగు దేశం పార్టీ ఎప్పటికీ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు మెరుగైన భవిష్యత్ ఉంటుందని తెలిపారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో తాము ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పరమేష్, మన్సుర్ ఆలీఖాన్, పద్మాలతారెడ్డి, టీడీపీ నేతలు నాగరాజు యాదవ్, లక్కీటూ గోపి, పోతురాజు రవీ, సోమిశేట్టి నవీన్, గున్నా మార్కు, ముంతాజ్, విజయలక్ష్మి, జనసేన నేత పవన్, సురేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆదోనిలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాలు అర్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సేవలను కొనియాడారు. పత్తికొండ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు నివాళులర్పించారు. కల్లూరు మండలం కురవగేరిలో పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు చరితారెడ్డి, టీడీపీ నాయకుడు గౌరు వెంకటరెడ్డిలు నివాళులర్పించారు.