నీరసంగా నిరసనలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:44 AM
విద్యుత చార్జీల బాదుడంటూ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా జరిగిన నిరసనలు తుస్సు..మన్నాయి.

ఉమ్మడి కృష్ణాలో పేలవంగా వైసీపీ విద్యుత పోరుబాట
కనిపించని పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ
మిగిలిన చోట్లా నామమాత్రంగానే..
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : విద్యుత చార్జీల బాదుడంటూ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా జరిగిన నిరసనలు తుస్సు..మన్నాయి. పామర్రు నియోజకవర్గం మినహా మిగిలిన చోట్ల నిరసన కార్యక్రమానికి సొంత పార్టీ నాయకులతో పాటు ప్రజల నుంచి స్పందన రాలేదు. ఇక విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ మినహా మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి.
ముఖ్య నాయకులు ఎక్కడ?
మచిలీపట్నం నియోజకవర్గంలో పేరున్న నాయకులెవరూ నిరసనలో కనిపించలేదు. బియ్యం స్వాహా కేసులో ఆ పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టూ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో వారు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ వైసీపీకి చెందినవారే అయినా.. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆమె తరఫున ఆమె భర్త పాల్గొన్నారు. పేర్ని నానీపై ఉన్న అసంతృప్తితో చాలామంది నాయకులు కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. గుడివాడ నియోజకవర్గంలోనూ పెద్ద నాయకులు కనిపించలేదు. కొడాలి నాని అసలు ఊర్లోనే లేరు. గన్నవరం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు ఏ పార్టీ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన ఉప్పాల రాము ఆధ్వర్యంలో నిరసన జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి, వైసీపీ సీనియర్ నాయకుడు అన్నే చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్, పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో నిరసన జరగ్గా, మైలవరంలో జోగి రమేశ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నందిగామలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో, జగ్గయ్యపేటలో నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తిరువూరులో చోటా నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి 10 నిమిషాల్లోనే ముగించేశారు.