Share News

వైసీపీ వీరంగం

ABN , Publish Date - May 14 , 2024 | 01:20 AM

ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్‌ను రణరంగంలా మార్చారు. కయ్యానికి కాలు దువ్వి ఒకరినొకరు కొట్టుకునేలా చేశారు. అటు పోరంకిలో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్‌ కుమారులు సృష్టించిన బీభత్సం.. ఇటు గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ కవ్వింపు చర్యల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

వైసీపీ వీరంగం

ప్రశాంతమైన పోలింగ్‌కు విఘాతం

పెనమలూరులో జోగి రమేశ్‌ కుమారుల బీభత్సం

టీడీపీ కార్యకర్తలపై దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఓటమి భయంతో గన్నవరంలో వంశీ పిల్ల చేష్టలు

యార్లగడ్డ కారుకు అడ్డు.. దాడికి విఫలయత్నం

ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్‌ను రణరంగంలా మార్చారు. కయ్యానికి కాలు దువ్వి ఒకరినొకరు కొట్టుకునేలా చేశారు. అటు పోరంకిలో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్‌ కుమారులు సృష్టించిన బీభత్సం.. ఇటు గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ కవ్వింపు చర్యల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

పోరంకిలో జోగి కుమారుల తెగింపు

పోరంకి ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి జోగి రమేశ్‌, ఆయన కుమారులు.. మైలవరం, పెడన నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చిన వారితో పోలింగ్‌ కేంద్రం వద్ద వీరవిహారం చేశారు. టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ సోదరుడు సురేశ్‌, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బోడె మనోజ్‌పై దాడి చేశారు. దాడిలో టీడీపీ కార్యకర్తలు వీర్ల రాజేశ్‌, షరీఫ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీర్ల రాజేశ్‌కు తలపై బలమైన గాయాలయ్యాయి. ఈ వివాదం సద్దుమణిగిన కొద్దిసేపటికే జోగి రమేశ్‌ పెద్ద ఎత్తున తన అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడ్డారు. కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ చక్రవర్తితో కలిసి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేయడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ పెరిగి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదే సమయంలో జోగి తనయుడు రాజీవ్‌ పోలింగ్‌ సమయం ముగిసిందంటూ కుర్చీలు ఎత్తేసి హడావిడి చేయడంతో అతన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తాడిగడప పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా టీడీపీ, వైసీపీ నాయకుల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. ఉప్పులూరు పోలింగ్‌ స్టేషన్‌లోకి రాజీవ్‌ తన అనుచరులతో వెళ్లి హడావిడి చేయడంతో టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు.

గన్నవరంలో వంశీ కవ్వింపు

గన్నవరం నియోజకవర్గంలోనూ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థి వంశీ అసహనంతో ఊగిపోయారు. అనుచరులను రెచ్చగొట్టి ప్రత్యర్థులపైకి ఉసిగొల్పారు. పలుచోట్ల పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. విజయవాడ రూరల్‌ మండలం నున్న హైస్కూల్‌, గ్రామ సచివాలయాల వద్ద యార్లగడ్డ వెంకట్రావుపై వంశీ అనుచరులు దాడికి విఫలయత్నం చేశారు. వైసీపీకి చెందిన బొంతు సాంబిరెడ్డి ఏజెంట్‌గా వెళ్లి పోలింగ్‌ బూత్‌లోనే ఫ్యాన్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తుండటంతో టీడీపీ ఏజెంట్లు యార్లగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. యార్లగడ్డ అక్కడికి చేరుకుని పోలింగ్‌ బూత్‌లో ఉండి ప్రచారం చేయటం సరికాదని హెచ్చరించారు. దీంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా యార్లగడ్డపైకి వచ్చారు. అదే పోలింగ్‌ కేంద్రం వద్ద బయట కారులో ఉన్న వంశీ తన అనుచరులను రెచ్చగొట్టేలా డైరెక్షన్‌ ఇచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సమాచారం అందుకున్న సీపీ రామకృష్ణ అక్కడికి చేరుకుని వంశీ, యార్లగడ్డను పంపేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన వంశీ.. యార్లగడ్డను కవ్విస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. యార్లగడ్డ ముస్తాబాద -సూరంపల్లి గ్రామాల మధ్యకు రాగానే వంశీ తన కాన్వాయ్‌ను ఆయన కారుకు అడ్డం పెట్టారు. అప్పటికే అక్కడికి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వంశీ కారులోనే ఉండి వారిని రెచ్చగొట్టారు. పోలీసులను సైతం లెక్క చేయలేదు. యార్లగడ్డ వెంకట్రావును, టీడీపీ శ్రేణులను బూతులు తిడుతూ.. ‘రండి చూసుకుందాం’ అంటూ రెచ్చిపోయారు. టీడీపీ నాయకులపైకి చెప్పులు, రాళ్లు విసిరారు.

గన్నవరం మండలం కేసరపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్‌ పొట్లూరి బసవరావు ఇంటి వద్ద కూడా వంశీ హడావిడి చేశారు. ఆయన ఇంటి ముందుకు వెళ్లి కారు ఆపి, హారన్‌ కొట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. గ్రంథాలయం వద్ద ఉన్న పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన వంశీ.. అక్కడ బసవరావును చూడగానే కారును రివర్స్‌లో స్పీడ్‌తో పోనిచ్చారు. నేరుగా బసవరావు ఇంటి ముందుకెళ్లి హారన్‌ మోగించారు. అక్కడికి వైసీపీ శ్రేణులు వచ్చారు. ఈ విషమం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు కూడా రావటంతో వంశీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓటమి భయంతోనే తన మీదకు దాడి చేసేందుకు వంశీ వచ్చారని పొట్లూరి బసవరావు తెలిపారు.

ఉంగుటూరు మండలం తేలప్రోలులో యార్లగడ్డ వెంకట్రావు కారుపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి తెగబడ్డారు. తేలప్రోలు హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద యార్లగడ్డ కారుకు అడ్డంగా నిలబడి వంశీ కవ్వింపు చర్యలకు దిగారు. యార్లగడ్డ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆయన వర్గీయులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది.

చెదురుమదురు ఘటనలు

తిరువూరు రూరల్‌ మండలం కోకిలంపాడులో వైసీపీ సర్పంచ్‌ భర్త గంగధారి కోటేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడిపై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు ఆయన్ను వెంబడించారు.

మైలవరంలో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ టోపీలు పెట్టుకుని కొందరు ప్రచారం చేశారు. వలంటీర్లు పోలింగ్‌ కేంద్రాల సమీపానికి చేరుకుని మరీ ప్రచారం చేయడం గమనార్హం.

భవానీపురం 23 నుంచి 33 పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు.

Updated Date - May 14 , 2024 | 01:20 AM