Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వైసీపీ నేత కబ్జాకాండ!

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:35 AM

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆయన పేరుమోసిన వైసీపీ నేత. రాష్ట్రస్థాయిలో ఓ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో తనకు దగ్గర బంధుత్వం ఉందని అందరికీ చెప్పుకుంటుంటారు. ఆయన కుమార్తె మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవితం మొదలు పెట్టి ఇప్పుడు వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు.

వైసీపీ నేత కబ్జాకాండ!

రూ.5 కోట్ల విలువైన స్థలం కబ్జా

పక్కా స్కెచ్‌తో దొంగ డాక్యుమెంట్లు సృష్టి

వాటి ఆధారంగా ఆస్తి పన్ను నంబరు

అసలు యజమానుల ఫిర్యాదుతో కళ్లు తెరిచిన వీఎంసీ

ఆస్తి పన్ను రద్దు చేసి అసలు యజమాని పేరుపైనే కొనసాగింపు

ఇప్పుడు అదే స్థలాన్ని భార్య పేరుపై రాసి ఇంటి నిర్మాణం

అసలు యజమానులు గగ్గోలు పెడుతున్నా స్పందించిన అధికారులు

కేసులు పెడతామని అసలు యజమానులకే అధికారుల బెదిరింపులు

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆయన పేరుమోసిన వైసీపీ నేత. రాష్ట్రస్థాయిలో ఓ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో తనకు దగ్గర బంధుత్వం ఉందని అందరికీ చెప్పుకుంటుంటారు. ఆయన కుమార్తె మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవితం మొదలు పెట్టి ఇప్పుడు వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన కన్ను విజయవాడ సత్యనారాయ ణపురంలోని కోట్లాది రూపాయల విలువ చేసే ఓ స్థలంపై పడింది. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు పక్కాగా స్కెచ్‌ వేశారు. 2014లో మొదలు పెట్టిన ఈ కబ్జాకాండకు ఇప్పుడు ఇంటి నిర్మాణంతో ముగింపు పలకాలని ఆగమేఘాలపై ఆ కబ్జా స్థలంలో భారీ ఇంటిని నిర్మించేస్తు న్నారు. ఒకప్పుడు ఈ ఆక్రమణను తప్పు అన్న వీఎంసీ అధికారులు ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో అసలు స్థల యజమానులనే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. కబ్జా చేసిన ఆ స్థలం విలువ అక్షరాలా రూ.5 కోట్లు..!

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన స్వాతంత్ర సమ రయోధుడు గండూరి ఉమమాహేశ్వరరావుకి సత్యనారాయణపురం లక్ష్మీనగర్‌లో కెనరాబ్యాంకు ఎదురుగా సర్వే నంబరు 126/1లో 325 గజాల స్థలం ఉంది. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు నడమ జరిగిన ఆస్తి పంపకాల్లో ఆయన నాలుగో కుమారుడు, కృష్ణా బ్యారేజీ ఆర్కిటెక్ట్‌ అయిన గండూరి రాధాకృష్ణమూర్తికి ఈ స్థలం వారసత్వ ఆస్తిగా సంక్రమించింది. రాధాకృష్ణమూర్తి 1981లో చనిపోగా ఆయన సతీమణి విజయలక్ష్మి సదరు స్థలానికి యజమానురాలిగా కొనసాగుతూ పన్నులు చెల్లించుకుంటూ ఆస్తిని సంరక్షించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న వైసీపీ నేత 2014లో వేరే ఆస్తి కాగితాలను విజయలక్ష్మి స్థలం కాగితాలుగా చూపి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను పక్కదారి పట్టించి ఆ స్థలానికి ఫేక్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ను సృష్టించారు. దీంతో ఒకే స్థలానికి విజయలక్ష్మి పేరుతో ఒక ప్రాపర్టీ ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌ నంబరు, సదరు వైసీపీ నేత పేరుతో మరో ప్రాపర్టీ ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌ నంబరు ఏర్పడింది. ఈ విషయాన్ని విజయలక్ష్మి, ఆమె కుమారుడు గండూరి ఉమామహేశ్వరరావు అప్పటి వీఎంసీ కమిషనర్‌ జె.నివాస్‌ దృష్టికి తీసుకెళ్లగా సుదీర్ఘ విచారణ తర్వాత 2018లో గౌతంరెడ్డి పేరుతో ఉన్న తప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌ నంబరును రద్దు చేయడంతోపాటు ఆ స్థలంలో గౌతంరెడ్డి చేసిన నిర్మాణాన్ని డిమాలిష్‌ చేయాల్సిందిగా ఆర్‌సీ నం. ఏ9-101477/2018 ఉత్తర్వుల జారీ చేశారు. అదే ఉత్తర్వుల్లో మున్ముందు ఆ స్థలంలో ఎలాంటి ఇంటి నిర్మాణాలకు సదరు వైసీపీ నేత పేరు మీద అనుమతి ఇవ్వొద్దని పేర్కొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో డిమాలిషన్‌ జరగలేదు. ఈ కబ్జా స్థలంలోనే చాలాకాలం గౌతంరెడ్డి వైసీపీ కార్యాలయాన్ని నిర్వహించారు.

భార్య పేరుపైకి మార్చి... వీఎంసీని ఏమార్చి..!

కబ్జా చేసిన స్థలంపై మరింత పట్టు బిగించేందుకు సదరు వైసీపీ నేత 2017లో ఆ స్థలంలో 225 గజాలను తన భార్యకి గిఫ్ట్‌ డీడ్‌గా రాసేశారు. తాను కబ్జా చేసిన.. తనకు అధికారం లేని స్థలాన్ని తన భార్యకు గిఫ్ట్‌ డీడ్‌గా రాసి ఆమె పేరుతో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు ప్లాన్‌కు అనుమతి ఇవ్వాలంటూ వీఎంసీకి మరోసారి దరఖాస్తు చేశారు. అయితే అప్పటికే ఈ వివాదం హైకోర్టుకు వెళ్లడం అక్కడ స్టేటస్‌కో పాటించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం వైసీపీ నేత భార్య దరఖాస్తు చేశారు.

వీఎంసీ స్టాండింగ్‌ కమిటీ అత్యుత్సాహం

సదరు వైసీపీ నేత రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకొచ్చి వీఎంసీ మేయర్‌ ద్వారా స్టాండింగ్‌ కౌన్సిల్‌లో ఇంటి ప్లానుకు ఆమోదం పొందారు. గత ఏడాది నవంబరు 14న స్టాండింగ్‌ కౌన్సిల్‌లో సత్యనారాయణపురంలో వైసీపీ నేత కబ్జా చేసిన స్థలంలో హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులను బేఖాతర్‌ చేస్తూ వీఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఇంటి ప్లానుకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి అక్రమ నిర్మాణాన్ని ఆపేందుకు స్థల యజమాని ఉమామహేశ్వరరావు చేసిన ప్రయత్నాలు అరణ్యరోదనగా మిగిలిపోయాయు. తన అధికార పరిధిని దాటి మరీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఇంటి ప్లానుకు ఆమోదం తెలపడం గమనార్హం.

న్యాయం చేయకుంటే ఆమరణదీక్ష చేస్తా

నా తండ్రికి వారసత్వంగా వచ్చిన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసిన స్థలంలో వీఎంసీ అధికారులు కుట్రపూరితంగా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయం తెలియజేసి, ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరితే వీఎంసీ అధికారులు నాపైనే పోలీసు కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. వైసీపీ నేత మా ఆస్తులను కబ్జా చేయడంతో మానసిక క్షోభతో నా కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులను కోల్పోయాను. నాకు న్యాయం జరగని పక్షంలో కబ్జా చేసిన స్థలం ఎదుట ఆమరణ దీక్ష చేస్తా.

- గండూరి ఉమామహేశ్వరరావు, స్థలం వాస్తవ యజమాని

Updated Date - Mar 04 , 2024 | 10:33 AM