Share News

వైసీపీ నెత్తిన బండరాయి

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:13 AM

గులకరాయి సానుభూతి అస్త్రం వైసీపీ నెత్తిన బండరాయిగా మారింది. కేవలం వడ్డెర కులాన్ని టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల్లో సానుభూతి పొందాలన్న పన్నాగం చివరికి వైసీపీ మెడకే చుట్టుకుంది. ఒక కులానికి చెందిన మైనర్లయిన బాలురును అదుపులోకి తీసుకోవడం, పోలీసులు ఏ2గా చెబుతున్న వేముల దుర్గారావును ఇంతవరకు కుటుంబ సభ్యులకు చూపించకపోవడంతో వడ్డెర కులస్తులు పిడికిలి బిగించారు. ఎన్నికల ముందు మైలేజ్‌ కోసం తమ కులాన్ని దోషిగా చిత్రీకరించారని ఆగ్రహిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.

వైసీపీ నెత్తిన బండరాయి

గులకరాయి ఘటనలో వైసీపీపై వడ్డెర కులస్తుల ఆగ్రహం

రాష్ట్రవ్యాప్తంగా ఏకతాటిపైకి వస్తున్న సంఘ నేతలు

రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం

డీజీపీని, ఈసీని కలవడానికి సన్నాహాలు

తగిన మూల్యం ఉంటుందని హెచ్చరిక

గులకరాయి సానుభూతి అస్త్రం వైసీపీ నెత్తిన బండరాయిగా మారింది. కేవలం వడ్డెర కులాన్ని టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల్లో సానుభూతి పొందాలన్న పన్నాగం చివరికి వైసీపీ మెడకే చుట్టుకుంది. ఒక కులానికి చెందిన మైనర్లయిన బాలురును అదుపులోకి తీసుకోవడం, పోలీసులు ఏ2గా చెబుతున్న వేముల దుర్గారావును ఇంతవరకు కుటుంబ సభ్యులకు చూపించకపోవడంతో వడ్డెర కులస్తులు పిడికిలి బిగించారు. ఎన్నికల ముందు మైలేజ్‌ కోసం తమ కులాన్ని దోషిగా చిత్రీకరించారని ఆగ్రహిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.

అజిత్‌సింగ్‌నగర్‌, ఏప్రిల్‌ 19 : సీఎం జగన్‌పై గులకరాయి దాడి ఘటనలో తమ కులస్తులను ఇరికించడంపై వడ్డెర కులస్తులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించనున్నారు. ముందుగా పార్టీలకు అతీతంగా వడ్డెర సంఘాల నేతలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు నగరంలోని నేతలతో పాటు రెండు జిల్లాల నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈ సమావేశం అనంతరం కార్యచరణ రూపొందించే అవకాశాలు ఉన్నాయి.

వేముల సతీష్‌తో ములాఖత్‌కు ఏర్పాట్లు

ఈ కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొన్న వేముల సతీష్‌ ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌తో నగరంలోని సబ్‌జైల్లో ఉన్నాడు. కోడికత్తి కేసు న్యాయవాది అబ్దుల్‌ సలీం, సతీష్‌ తల్లిదండ్రులు శనివారం సతీష్‌తో ములాఖత్‌ అయ్యేందుకు సమాయత్తమయ్యారు. అయితే, సతీష్‌ను నగరంలోని సబ్‌జైలు నుంచి శుక్రవారం రాత్రే నెల్లూరులోని సబ్‌జైలుకు తరలించిన్నట్లు తెలిసింది. దీంతో నెల్లూరు సబ్‌ జైలులో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. జరిగిన ఘటనపై సతీష్‌తో మాట్లాడి, అసలు విషయాన్ని అడిగి తెలుసుకుని తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

దుర్గారావును చూపించరెందుకు..?

మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును కుటుంబ సభ్యులకు చూపించకపోవడంపై వడ్డెర సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు కోర్టుకు హాజరు పరచకపో వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెర్చ్‌ వారెంట్‌లో కూడా అతని ఆచూకీ తెలియకపోవడంపై ఇటు కుటుంబ సభ్యుల్లో, అటు వడ్డెర సంఘం నేతల్లో ఆందోళన పెరిగింది.

డీజీపీ, ఈసీని కలవనున్న నేతలు

ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయి దాడి జరగటం, రెండు రోజుల వ్యవధిలోనే ఒకే కులానికి చెందిన 11 మందిని అదుపులోకి తీసుకోవడం, ఆపై ఇద్దరిని నిందితులుగా నిర్ధారించడం, ఒకరికి రిమాండ్‌ విధించడం, మరో వ్యక్తి ఆచూకీ చెప్పకపోవడంపై వడ్డెర సంఘం నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ, ఈసీని కలిసేందుకు వడ్డెర సంఘం నేతలు సిద్ధమయ్యారు. రెండు బృందాలుగా వెళ్లి డీజీపీని, ఈసీని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని సంఘం నేతలు తెలిపారు.

నిందలు మోపారు..

జగన్‌పై జరిగిన దాడి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపకుండానే ఏకపక్షంగా వడ్డెర కులస్తులపై నిందలు వేశారు. వైసీపీకి సానుభూతి కోసం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వడ్డెరలను వాడుకోవడం అన్యాయం. వైసీపీ నాయకులు, పోలీసులు వడ్డెర కులస్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం.

- కుంచం వాసుకుమార్‌, వడ్డెర సంక్షేమ సంఘం ఉమ్మడి కృష్ణాజిల్లా యువజన కార్యనిర్వాహక కార్యదర్శి

కక్ష కట్టినట్టుగా..

గత ఎన్నికల్లో వేముల దుర్గారావు వైసీపీకి పనిచేశాడు. పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వకపోడంతో టీడీపీ నాయకులతో సఖ్యతగా ఉంటున్నాడు. టీడీపీ బీసీలకు తగిన గుర్తింపు ఇస్తుందని భావించాడు. అతన్ని వెనుక వడ్డెరల బలం పెరుగుతూ వచ్చింది. ఇంతలో జగన్‌పై గులకరాయి దాడి జరగటం, దుర్గారావును అదుపులోకి తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం వడ్డెరల బలం కూడగట్టుకుంటున్నాడనే కారణంతోనే కక్షకట్టి నింద మోపారు.

- వేముల బాజీ, రాష్ట్ర వడ్డెర సంఘం నగర యువజన ఉపాధ్యక్షుడు

బలహీన వర్గమనే..

రాష్ట్రంలో కూలీనాలి చేసుకుని ఏ పూటకాపూట పొట్ట పోసుకునే కుటుంబాలు వడ్డెరలవి. ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి బలం లేని బలహీన వర్గం కావడం వల్లే మా కులస్తులపై నిందలు వేశారు. నిందలు వేసి సానుభూతి సంపాదించి ఆపై గెలవాలన్న వైసీపీ ఎత్తుగడ స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని మేము కచ్చితంగా తిప్పి కొడతాం.

- బండారు రాజు, రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ఉమ్మడి కృష్ణాజిల్లా యువజన ప్రధాన కార్యదర్శి

Updated Date - Apr 20 , 2024 | 01:13 AM