Share News

మద్యేమార్గం

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:04 AM

మద్యం ఆదాయాన్ని రుచిమరిగిన వ్యాపారులు షాపుల ఏర్పాటులోనూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం షాపును ప్రైవేట్‌ భవనంలో ఏర్పాటు చేసి.. దానికి దారి నిమిత్తం ఏకంగా చేపల దుకాణం గోడను పగలగొట్టేశారు. ఆ షాపు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండికొట్టారు. ఇప్పుడు అదే బాటలో కొత్త మద్యం వ్యాపారి నడవడం పటమటలంకలోని చేపల మార్కెట్‌లో చర్చనీయాంశమైంది.

మద్యేమార్గం

దారి లేనివైపు మద్యం షాపులు కట్టిన ప్రైవేట్‌ వ్యక్తి

వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహణ

దారికోసం చేపల మార్కెట్‌ దుకాణం గోడలు కూల్చివేత

ఇప్పుడు అదే షాపులో కొత్త మద్యం దుకాణం

పటమటలంకలో పడవలరేవు వద్ద వ్యాపారి ధనకార్యం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పటమటలంకలోని పడవలరేవు వంతెన వద్ద వీఎంసీకి చెందిన చేపల మార్కెట్‌ ఉంది. ఈ మార్కెట్‌ మొత్తం బందరు కాల్వను ఆనుకుని ఉంటుంది. చేపల మార్కెట్‌లో రెండు వైపులా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా షెడ్లు ఉన్నాయి. లోపలకు వెళ్లడానికి మధ్యలో సీసీ రోడ్డు ఉంది. ఇక్కడ మత్స్యకారులు చేపలు, రొయ్యలు విక్రయిస్తుంటారు. మార్కెట్‌ రోడ్డుకు ప్రారంభంలో కుడివైపున రెండు షాపులు ఉండేలా ఒక షెడ్‌ను నిర్మించారు. ఇందులో ఒక షాపులో మాత్రమే వ్యాపారం జరుగుతోంది. దీనికి పక్కన ఉన్న షాపు మాత్రం వెనుక ఉన్న మద్యం దుకాణానికి దారిగా ఉపయోగపడుతోంది.

వీఎంసీ ఆదాయానికి గండి..

మార్కెట్‌ రోడ్డు ప్రారంభంలో కుడివైపు ఉన్న షెడ్‌కు వెనుక భాగంలో ప్రైవేట్‌ భవనం ఉంది. ఈ భవనానికి ముందు భాగంలో రెండు షాపులున్నాయి. ఇదికాకుండా షాపు యజమాని చేపల మార్కెట్‌ వైపున రెండు షాపులను నిర్మించారు. వాస్తవానికి ఈ భవన యజమానికి మార్కెట్‌ వైపున ఎలాంటి స్థలం లేదు. అటువైపు మార్గం కూడా లేదు. అయినా షాపులను ఏర్పాటు చేసి షెట్టర్లు అమర్చాడు. అయితే, వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఒకటి ఈ షాపులో పెట్టారు. దీనికి దారి కోసం చేపల మార్కెట్‌ షెడ్‌లో ఒక దుకాణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణానికి ఉన్న గోడలను తొలగించి దారి ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి షెడ్‌లో రెండు షాపులను అద్దెకిస్తే వీఎంసీకి ఆదాయం వచ్చేది. అటువంటిది వెనుక వైపు ఉన్న భవనంలోని మద్యం షాపు కోసం మార్కెట్‌లో ఉన్న షాపును దారిగా మార్చేశారు. వైసీపీకి చెందిన ఓ నాయకుడు ఈ కథంతా నడిపించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ షాపు నుంచి అన్యాయంగా దారి ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మద్యం షాపునకు సంబంధించి నాడు బేవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి నెలకు వేలాది రూపాయలను అద్దె రూపంలో వసూలు చేసుకున్నాడన్న విమర్శలున్నాయి.

చేపల మార్కెట్‌ పర్యవేక్షణ ఎవరిది?

వాస్తవానికి చేపల మార్కెట్లు వీఎంసీ పరిధిలో ఉంటాయి. కొన్ని మార్కెట్‌ యార్డు పరిధిలో ఉంటాయి. కొన్ని చేపల మార్కెట్లలో మత్స్యశాఖ మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. పటమటలంకలోని చేపల మార్కెట్‌ ఎవరి పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆ శాఖలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ వచ్చాక మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచిన షాపుల్లోనే కొత్త మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. చాలా షాపులను ఇలాగే ఏర్పాటు చేశారు. అలాగే, పటమటలంకలో మద్యం షాపును ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో ఇక్కడ ఐదేళ్లపాటు మద్యం దుకాణం నడిచిందన్న విషయం స్థానికులకు తెలియకపోవడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం మద్యం షాపులకు జరిగిన లాటరీల్లో ఈ షాపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు చేపల మార్కెట్‌కు చెందిన షాపును ప్రైవేట్‌ భవనంలోని మద్యం దుకాణానికి దారిగా ఎలా ఉపయోగిస్తారన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు. మార్కెట్లో మద్యం షాపు ఉందన్న విషయం కూడా తమకు తెలియదని పలువురు అధికారులు చెబుతుండడం విశేషం.

Updated Date - Oct 25 , 2024 | 01:04 AM