Share News

విస్తరిస్తారా..?

ABN , Publish Date - Jun 10 , 2024 | 01:18 AM

తూర్పున ఒకపక్క ఉయ్యూరు. మరోపక్క గన్నవరం. పశ్చిమలో ఇబ్రహీంపట్నం. ఒకప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ సరిహద్దులు ఇవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల విభజన ప్రతిపాదనతో ఈ సరిహద్దులు చెరిగిపోయాయి. ఈ విభజన ప్రభావం విజయవాడ పోలీసు కమిషనరేట్‌పై పడింది. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న పెనమలూరు, కంకిపాడు జిల్లా ఎస్పీ పరిధిలోకి వెళ్లిపోయాయి. విజయవాడ విమానాశ్రయం ఉన్న గన్నవరం పరిస్థితి అంతే. తూర్పున ఉన్న ముక్కలు తెగిపోయి, పశ్చిమాన ఉన్న గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలు వచ్చి కలవడంతో కమిషనరేట్‌ రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఏడీజీ స్థాయి అధికారి కమిషనర్‌గా ఉండేవారు. ఆ హోదాను ఐజీ స్థాయికి కుదించేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుండడంతో పోలీసు కమిషనరేట్‌ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మళ్లీ పోలీసు కమిషనరేట్‌ రూపురేఖలు మారే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విస్తరిస్తారా..?

కమిషనరేట్‌ పరిధి పెంపుపై ఊహాగానాలు

వైసీపీ పాలనలో తగ్గిన హోదా

కూటమి అధికారంలోకి రావడంతో పరిధిపై చర్చ

గన్నవరం కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే అవకాశం

తూర్పున ఒకపక్క ఉయ్యూరు. మరోపక్క గన్నవరం. పశ్చిమలో ఇబ్రహీంపట్నం. ఒకప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ సరిహద్దులు ఇవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల విభజన ప్రతిపాదనతో ఈ సరిహద్దులు చెరిగిపోయాయి. ఈ విభజన ప్రభావం విజయవాడ పోలీసు కమిషనరేట్‌పై పడింది. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న పెనమలూరు, కంకిపాడు జిల్లా ఎస్పీ పరిధిలోకి వెళ్లిపోయాయి. విజయవాడ విమానాశ్రయం ఉన్న గన్నవరం పరిస్థితి అంతే. తూర్పున ఉన్న ముక్కలు తెగిపోయి, పశ్చిమాన ఉన్న గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలు వచ్చి కలవడంతో కమిషనరేట్‌ రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఏడీజీ స్థాయి అధికారి కమిషనర్‌గా ఉండేవారు. ఆ హోదాను ఐజీ స్థాయికి కుదించేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుండడంతో పోలీసు కమిషనరేట్‌ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మళ్లీ పోలీసు కమిషనరేట్‌ రూపురేఖలు మారే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : విజయవాడ నగరంలో కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలో ఉండేది. 1983లో విజయవాడ కేంద్రంగా కృష్ణా అర్బన్‌ జిల్లా ఏర్పాటు చేశారు. 1989లో అర్బన్‌ జిల్లాను అప్‌గ్రేడ్‌ చేసి కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధాని చేశారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న విజయవాడ రాజధానికి చెంతనే ఉండడంతో విజయవాడ పోలీసు కమిషనర్‌ హోదాను అప్‌గ్రేడ్‌ చేశారు. అదనపు డీజీ స్థాయి అధికారిని పోలీసు కమిషనర్‌గా నియమించారు. ఏబీ వెంకటేశ్వరరావు, గౌతమ్‌సవాంగ్‌, సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు వంటి అధికారులు ఏడీజీ స్థాయి హోదాలో కమిషనర్లుగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిని పరిగణనలోకి తీసుకుని జిల్లాల విభజన చేసింది. అప్పటి వరకు పోలీసు కమిషనరేట్‌కు ఐదు జోన్లు ఉండేవి. గన్నవరం, ఆత్కూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిముక్కల తూర్పు జోన్‌ పరిధిలో ఉండేవి. పెనమలూరు, కంకిపాడు సెంట్రల్‌ జోన్‌ పరిధిలో ఉండేవి. జిల్లాల విభజన చేసిన తర్వాత తూర్పుజోన్‌ పూర్తిగా కమిషనరేట్‌ నుంచి కృష్ణాజిల్లా ఎస్పీ పరిధిలోకి వెళ్లిపోయింది. సెంట్రల్‌ జోన్‌ ఉన్న పెనమలూరు, కంకిపాడు పీఎస్‌లను జిల్లాకు ఇచ్చేయాల్సి వచ్చింది. పశ్చిమ జోన్‌లో ఇబ్రహీంపట్నం వరకు కమిషనరేట్‌ పరిధి ఉండేది. మైలవరం నుంచి జగ్గయ్యపేట వరకు ఉన్న ప్రాంతమంతా జిల్లా ఎస్పీ పరిధిలో ఉండేది. తూర్పులో సగభాగాన్ని కోల్పోయిన కమిషనరేట్‌లోకి ఈ ప్రాంతమంతా వచ్చి కలిసింది. దీన్ని ఇప్పుడు రూరల్‌ డీసీపీగా పరిధిగా వ్యవహరిస్తున్నారు.

పరిధి ఒకరిది... బందోబస్తు మరొకరిది...

వైసీపీ చేసిన జిల్లాల పునర్విభజనలో శాంతిభద్రతల అంశాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ విజయవాడ పోలీసు కమిషనరేట్‌ విభజన. విజయవాడ విమానాశ్రయం గన్నవరంలో ఉంది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు కమిషనరేట్‌ పరిధిలో ఉండేది. విభజనతో జిల్లా పరిధిలోకి వెళ్లింది. ఈ విమానాశ్రయంలో భద్రతను సీఆర్పీఎఫ్‌ పర్యవేక్షిస్తోంది. బయట ప్రాంతమంతా స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోడ్డుమార్గాన విమానాశ్రయానికి చేరుకునేవారు. కమిషనరేట్‌తోపాటు జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్న ప్రాంతంలోనూ విజయవాడ పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి వచ్చేది. ఇతర వీఐపీలు విజయవాడకు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి. ప్రముఖుల రాకపోకల సమయంలో బందోబస్తును పర్యవేక్షించడానికి మచిలీపట్నం నుంచి జిల్లా ఎస్పీ సుమారుగా 60 కిలోమీటర్లు ప్రయాణించి గన్నవరం చేరుకోవాల్సి ఉంటుంది. ప్రముఖుల రాకపోకల సమయంలో రహదారులకు ఇరువైపులా ఉండే పోలీసులను, తనిఖీలు నిర్వహించే బాంబు స్క్వాడ్‌ను మచిలీపట్నం నుంచి పంపాల్సిన పరిస్థితి ఉంది. విజయవాడ పోలీసులు నగర బహిష్కరణ చేసిన రౌడీషీటర్లు అటు గన్నవరం, ఇటు పెనమలూరులో తలదాచుకుంటున్నారు. విభజన జరిగిన సమయంలో కమిషనరేట్‌ను యథాతథంగా ఉంచాలని ప్రతిపాదనలు చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుండటంతో కమిషనరేట్‌ రూపురేఖల్లో మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Jun 10 , 2024 | 01:18 AM