Share News

గౌతంరెడ్డి ఎక్కడ?

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:36 AM

హత్యాయత్నం కేసులో వైసీపీ నేత పూనూరు గౌతంరెడ్డి మరోమారు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే ఒకసారి పోలీసులను తప్పించుకు తిరిగిన ఆయన బెయిల్‌ పిటిషన్‌ పేరుతో బయటకు వచ్చారు. తాజాగా కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేయడంతో మరోమారు పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన గౌతంరెడ్డి కోసం వేట మొదలైంది.

గౌతంరెడ్డి ఎక్కడ?

మరోసారి వైసీపీ నేత గౌతంరెడ్డి జంప్‌

ఇప్పటికే ఒకసారి పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతం

బెయిల్‌ పిటిషన్‌ పేరుతో బయటకు వచ్చి హడావిడి

తాజాగా కోర్టు పిటిషన్‌ను రద్దు చేయడంతో షాక్‌

తీర్పు రాకముందే పోలీసుల కళ్లుగప్పి పలాయనం

ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన ఖాకీలు

రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సత్యనారాయణపురంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై సుపారీ గ్యాంగ్‌తో హత్యాయత్నం చేయించిన వైసీపీ నేత పూనూరు గౌతంరెడ్డి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన ఆశలకు న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని గౌతంరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను కోర్టు రెండు రోజుల క్రితం డిస్మిస్‌ చేసింది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన గౌతంరెడ్డి రాత్రికి రాత్రి నగరం నుంచి పారిపోయాడు. గతనెల 6వ తేదీన ఉమామహేశ్వరశాస్ర్తిపై సుపారీ గ్యాంగ్‌ హత్యాయత్నం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. తొమ్మిది మంది నిందితుల్లో మరో ఇద్దరు పోలీసులకు చిక్కాల్సి ఉంది. వారిలో గౌతంరెడ్డి ఒకరు కాగా, ఆయన అనుచరుడు పురుషోత్తం రెండో నిందితుడు. ఇందులో సనతనగర్‌కు చెందిన పురుషోత్తం లా చదువుతున్నాడు. అతడికి పరీక్షలు ఉండటంతో హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాస్తున్నాడు. దీంతో హైకోర్టు ఈనెల 16 వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. పురుషోత్తం నగరంలోనే ఉన్నాడు. గౌతంరెడ్డి మాత్రం కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ కాగానే, ఇంటి నుంచి పరారయ్యాడు. పిటిషన్‌ కోర్టు విచారణలో ఉండగా, సత్యనారాయణపురం పోలీసుల ముందు హాజరయ్యాడు. పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించినా మౌనవ్రతం చేసి తప్పించుకున్నాడు. హైకోర్టు తనకు కచ్చితంగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తుందన్న ధీమాతో పోలీసు విచారణకు హాజరయ్యాడు. తర్వాత సీన్‌ రివర్స్‌ కావడంతో నగరం విడిచి పారిపోయాడు. ఘటన జరిగాక పోలీసులు కేసు నమోదు చేయగానే, హైదరాబాద్‌కు పారిపోయాడు. ఇప్పుడూ అక్కడికే వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

తీర్పు రాకముందే జంప్‌

గౌతంరెడ్డి విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులపై ఆరోపణలు చేస్తూ అతడు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. మరోపక్క పోలీసులపైకి న్యాయవాదులను ఉసిగొల్పే ప్రయత్నాలు చేశాడు. గౌతంరెడ్డి పాత నేరచరిత్రను పైకి తీసిన పోలీసులు అతడికి సంకెళ్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు హైకోర్టు ఆదేశాలతో ముందుకు అడుగులు వేయకుండా ఉన్న పోలీసులు బుధవారం నుంచి దూకుడు పెంచారు. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్లలో తీవ్రంగా నిఘా పెట్టారు. మరోపక్క సత్యనారాయణపురంలోని ఇంటి చుట్టూ వేగులను ఏర్పాటు చేశారు. అయినా గౌతంరెడ్డి తప్పించుకున్నాడు. తీర్పు రావడానికి ముందే అతడు ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

నాలుగు బృందాల గాలింపు

గౌతంరెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. ఇందులో రెండు టాస్క్‌ఫోర్స్‌ నుంచి, మరో రెండు లా అండ్‌ ఆర్డర్‌ నుంచి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం గౌతంరెడ్డి సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉంది. వేర్వేరు నెంబర్లతో అనుచరులు, న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. ఎక్కువగా వాట్సాప్‌ కాల్స్‌లో మాట్లాడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ నుంచి కడపకు కానీ, బెంగళూరుకు కానీ వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గౌతంరెడ్డి చేతులకు సంకెళ్లు వేస్తామని పోలీసులు చెబుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ బృందాలు మామూలుగా గాలింపు చర్యలు చేపడుతుండగా, కొన్ని బృందాలు సాంకేతికంగా విశ్లేషణలు చేస్తున్నాయి. గౌతంరెడ్డి తన సామాజికవర్గం అధికంగా ఉండే జిల్లాల్లో తలదాచుకునే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం వ్యక్తమవుతోంది.

Updated Date - Dec 13 , 2024 | 12:36 AM