విధివిధానాలేమిటో..?
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:19 AM
ఉచిత ఇసుక పథకం నేటి నుంచి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అమలౌతుంది. ఈ పథకం సాఫీగా సాగాలంటే జిల్లా యంత్రాంగం స్పష్టమైన విధివిధానాలతో ముందుకు వెళ్లాలి. అయితే ఇప్పటివరకు ఇసుక ఎవరికి ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు.

నేటి నుంచి ఉచిత ఇసుక - విధానంపై స్పష్టత ఇవ్వని అధికారులు
పేద ప్రజలు, భవన నిర్మాణ రంగ కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఉచిత ఇసుక పథకం
గత ప్రభుత్వంలో ఇసుక సిండికేట్‌దే రాజ్యం...
ఎన్టీఆర్ జిల్లా నుంచి తెలంగాణాకు భారీగా రవాణా
దీన్ని నియంత్రించకపోతే సామాన్యులకు ఇసుక కష్టం
సరిహద్దు ప్రాంతాలు, రాచమార్గాలు, దొడ్డిదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే మేలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కంచికచర్ల) : ఉచిత ఇసుక పథకం నేటి నుంచి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అమలౌతుంది. ఈ పథకం సాఫీగా సాగాలంటే జిల్లా యంత్రాంగం స్పష్టమైన విధివిధానాలతో ముందుకు వెళ్లాలి. అయితే ఇప్పటివరకు ఇసుక ఎవరికి ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. జిల్లా యంత్రాంగం కూడా ఆ మేరకు స్పష్టత ఇవ్వలేదు. పొరుగున ఉన్న తెలంగాణా రాష్ట్రంలో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడ భారీగా పెరిగిపోతున్న నిర్మాణరంగంతో ఎన్టీఆర్ జిల్లా నుంచి వైసీపీ హయాంలో అక్రమంగా ఇసుక తరలిపోయింది. రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన శనివారం నాటి సమావేశంలో అధికారులతో చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాధాన్యతలు నిర్ణయించుకోకపోతే మాత్రం శాండ్ సిండ్‌కేట్ కూడా ఇసుక కోసం వాలిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రాధాన్యతలను నిర్ణయించటంలో జిల్లా యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రాధాన్యత ఇలా ఉంటే మేలు
మొదటి ప్రాధాన్యత సొంతంగా ఇళ్లు, కాంక్రీటు నిర్మాణాలు చేసేవారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థలు నిర్మించే భవనాలు, అపార్ట్‌మెంట్స్, గ్రూప్ హౌస్‌లు, బహుళ అంతస్థుల భవనాలు, హై రైజ్ భవనాలు, ప్రభుత్వ డెవలప్‌మెంట్ వర్క్స్ చేపట్టే కాంట్రాక్టర్లకు ఇలా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.
స్పష్టతలేని అంశాలివే..
సామాన్య ప్రజలు ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేసుకునే వారికి ఏ ప్రాతిపదికన ఇసుక ఇస్తారన్నది ముఖ్యం. ఇల్లు కడుతు న్నారో లేదో తెలుసుకోవటానికి క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది ద్వారా తెలుసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారా? గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ధ్రువీకరించిన తర్వాతే ఇసుకను ఇస్తారా? మరేదైనా విధానం ఉందా అన్న దానిపై స్పష్టత లేదు.
వినియోగదారుడే వాహనాన్ని మాట్లాడుకుని తీసుకురావాల్సి ఉంటుందని జిల్లా యంత్రాంగం నిర్దేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టాక్‌యార్డుల్లోనే రవాణా వాహనాల సిండికేట్ రాజ్యమేలింది. రవాణా చార్జీలను అడ్డగోలుగా వసూలు చేశాయి. స్టాక్ యార్డులలో ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఉండవా? ఉంటే .. జిల్లా యంత్రాంగ పర్యవేక్షణలోనే ఉంటాయా? అనే స్పష్టత లేదు.
చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి
ఎన్టీఆర్ జిల్లా.. పొరుగున ఉన్న తెలంగాణా రాష్ర్టానికి సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఖమ్మం, హైదరాబాద్‌లలో విపరీతంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న ఇసుక డిమాండ్ రీత్యా ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు అక్రమంగా వివిధ మార్గాల్లో తరలివెళ్లింది. జాతీయ రహదారి - 65తో పాటు, ఎన్‌హెచ్ - 30ల మీదుగానూ అక్రమంగా ఇసుక రవాణా జరిగింది. ఇవి కాకుండా కంచికచర్ల - మధిర, నందిగామ - మధిర ఆర్‌అండ్‌బీ రోడ్ల మీదుగా కూడా అడ్డదారిలో తెలంగాణా ప్రాంతానికి అక్రమంగా ఇసుక తరలివెళ్లేది. వీరులపాడు, నందిగామ, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట రూరల్, వత్సవాయి గ్రామాల నుంచి మొత్తం 15 డొంక రోడ్లు ఉన్నాయి. తెలంగాణా ప్రాంతానికి ఈ డొంక మార్గాల్లోనూ అక్రమంగా ఇసుక తరలివెళ్లేది. ఈ మార్గాల్లో చెక్‌పోస్టులు పెడితే తప్ప ఇసుక అక్రమ వ్యాపారాన్ని నిలువరించే పరిస్థితి ఉండదు.
నామినల్ ధరలు నిర్ణయం
జిల్లా స్థాయి ఇసుక కమిటీలో కలెక్టర్ నిర్ణయం
స్టాక్ యార్డులు, డిపోలలో ఇసుక ధరలను ఎన్టీఆర్ జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఖరారు చేసింది. నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ఫీజులను మాత్రమే స్థానిక సంస్థల కోసం వసూలు చేయనున్నారు. నామినల్ ఫీజు, సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ర్యాంపులలో తవ్వకం, యార్డులు, డిపోలకు రవాణా ఛార్జీలు వంటివి కలిపి టన్నుకు నామినల్ ధరను న్ణియించారు. ఎన్టీఆర్ జిల్లాలో నిర్ణయించిన ధరలను జిల్లా కలెక్టర్ జీ సృజన ఆదివారం రాత్రి ప్రకటించారు.
నిర్ణయించిన నామమాత్రపు ధరలు ఇలా :
క్ర.సం స్టాక్‌యార్డు / డిపో ధర (టన్నుకు)
1. కంచల రూ. 313
2. మాగల్లు రూ. 228
3. కొడవటికల్లు రూ.252
4. అల్లూరుపాడు రూ. 234
5. అనుమంచిపల్లి రూ. 313
6. పోలంపల్లి రూ. 210
7. కీసర రూ. 325
8. మొగలూరు రూ. 240