Share News

బీజేపీని ఓడించేందుకు ఐక్యంగా కలిసి రావాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:50 AM

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు పూనుకుందని, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాసంపదను కార్పొరేట్లకు కారుచౌకగా దోచిపెడుతూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోందని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, రాష్ట్రకమిటీ కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు.

బీజేపీని ఓడించేందుకు ఐక్యంగా కలిసి రావాలి
మాట్లాడుతున్న వడ్డే, రైతుసంఘం ప్రతినిధులు

ఉంగుటూరు, జనవరి 10 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు పూనుకుందని, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాసంపదను కార్పొరేట్లకు కారుచౌకగా దోచిపెడుతూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోందని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, రాష్ట్రకమిటీ కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీని, దానికి మద్దతిస్తున్న రాష్ట్రంలోని పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు. బుధవారం మండలంలోని మానికొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. విభజన హామీలు ఒక్కటికూడా అమలుచేయకుండా, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. హక్కులను హరిస్తూ, సామాన్య ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న మతోన్మాద బీజేపీని, దానికి మద్దతిచ్చే పార్టీలను ఓడించాలని పిలుపు నిస్తూ ఈనెల 12 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో భారీ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సదస్సులో సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు(ఎ్‌సకేఎం)రాకేశ్‌ తికాయత్‌, సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత, ఏఐటీయూసీ జాతీయనాయకురాలు వహిదా నిజాం, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు నారాయణమూర్తి, ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ జేడీ శీలం, సీపీఎం అగ్ర నేత బీవీ రాఘవులు, సీపీఐ జాతీయకార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా, సీపీఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి.రామకృష్ణ, ఏపీ కాంగ్రె్‌సకమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే రైతులు, కార్మికులు, ఉద్యోగులు, యువజన, విద్యార్థిసంఘాలు, మేధావులు, ప్రజాసమస్యలపై స్పందించే నాయకులందరూ పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వడ్డే విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కృష్ణాజిల్లా రైతుసంఘం గౌరవాధ్యక్షుడు వెలగపూడి అజాద్‌, భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, రాష్ట్రకమిటీ సభ్యులు అన్నే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:50 AM