ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:30 AM
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంపై ఎన్నికల ప్రక్రియ, ఈసీఐ మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలు పూర్తి అవగాహన కలిగి వుండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు.
కృష్ణలంక, మార్చి 7 : నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంపై ఎన్నికల ప్రక్రియ, ఈసీఐ మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలు పూర్తి అవగాహన కలిగి వుండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల పేర్ల మార్పు తదితర అంశాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పు సంబంధించి ప్రతిపాదనలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించి వారి ఆమోదంతో ఎన్నికల సంఘానికి పంపడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న పోలింగ్ స్టేషన్లలో 39 పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పు, 286 పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పు (నామెన్ క్లేచర్), 11 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపించడం జరుగుతుందన్నారు.
నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించిన నాటినుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో వుంటుందన్నారు. రాజకీయ పార్టీలు పాటించవలసిన విధివిధానాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పార్లమెంట్‌కు పోటిచేసే అభ్యర్థి రూ.95 లక్షలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి రూ.40 లక్షలు వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్ విధించిందన్నారు. పోటీలో వున్న అభ్యర్థులు ప్రతిరోజు వ్యయానికి సంబంధించిన నివేదికలను సమర్పించవలసి వుంటుందన్నారు. ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాల్సి వుంటుందన్నారు. ప్రచారం, నామినేషన్లు దాఖలు చేసేందుకు వాహనాల వినియోగంపై పరిమితి వుందన్నారు. సోషల్ మీడియా, ఎలక్ర్టానిక్ మీడియాలో అభ్యర్థుల ప్రచారానికి ఎంసీఎంసీ నుంచి అనుమతి పత్రం తప్పనిసరన్నారు. రాజకీయ పార్టీలు నేరచరిత్ర లేని అభ్యర్థులను మాత్రమే ఎలక్షన్, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అవగాహన కల్పించుకొని నిష్పక్షపాత, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, బ్యాలెట్ పేపర్ నోడల్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు, శిక్షణ కార్యక్రమాల నోడల్ ఆఫీసర్ ఎన్.వి.శివప్రసాద్ యాదవ్, ఎం.వినోద్‌కుమార్, కె.పి.దాస్ (బీఎ్‌సపీ), డీవీ కృష్ణ, ఎస్.రమేష్ బాబు (సీపీఎం), వై.రామయ్య, బి.అనిల్ (తెదేపా), షేక్ కరీం (బీజేపీ), కె.పరమేశ్వరరావు (ఆప్), బుర్రా కిరణ్, అశోక్ శరన్ (ఐఎన్‌సీ), వై.ఆంజనేయరెడ్డి, అప్సర్ మహ్మద్, వి.యశోధర్ (వైసీపీ), ఎన్నికల సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.