దిగువ ప్రాంతాలకు నీటి కష్టాలు!
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:46 AM
అదను దాటేవరకూ ఇరిగేషన్ శాఖలో పనులు నిర్వహించని తీరు దశాబ్దాలుగా మారడంలేదు. కాల్వల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు పనులు వేసవిలో మొదలు పెట్టారు. వర్షాలు మొదలై, కాల్వలు వచ్చే సమయంలో టెండర్లు పిలవడం మమ అనిపించడం పరిపాటిగా మారింది.

మరమ్మతులకు నోచని కాల్వలు
దట్టంగా తూడు, గుర్రపు డెక్క.. తీరుమారని అధికారులు
గుడ్లవల్లేరు, జూలై 4 : అదను దాటేవరకూ ఇరిగేషన్ శాఖలో పనులు నిర్వహించని తీరు దశాబ్దాలుగా మారడంలేదు. కాల్వల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు పనులు వేసవిలో మొదలు పెట్టారు. వర్షాలు మొదలై, కాల్వలు వచ్చే సమయంలో టెండర్లు పిలవడం మమ అనిపించడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా తీరు మార్చుకుని ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని గుర్తెరగాల్సిన అవసరం ఉంది. పుల్లేరు నుంచి గుడ్లవల్లేరులో క్యాంబెల్, పోలరాజు, బంటుమిల్లి కెనాళ్ల ద్వారా దిగువకు తాగు, సాగునీరు చేరాల్సి ఉంది. అయితే పుల్లేరులో గుడ్లవల్లేరు రైల్వే బ్రిడ్జి నుంచి ఎగువకు దాదాపు మామిడి కోళ్ల వరకూ మూడు కిలోమీటర్ల మేర గుర్రపు డెక్క దట్టంగా పెరిగింది. ఏప్రిల్‌లో తాగునీరు విడుదల సమయంలో రైల్వే బ్రిడ్జి వద్ద కొంత డెక్కను తీసి గట్టున వేశారు. నీరు కిందికి దిగిన తర్వాత డెక్కను మందు పిచికారీ చేస్తే ఎండలకు మాడిపోయి ఉండేది. కానీ ఆపని చేయలేదు. రోజురోజుకు గుర్రపుడెక్క పెరిగిపోయింది. మున్ముందు ప్రకాశం బ్యారేజి నుంచి నీరు విడుదల చేస్తే మరికొంత కొట్టుకురావడంతో నీటి ప్రవాహం మందకొడిగా సాగే ప్రమాదం ఉంది. దిగువ ప్రాంతాల్లో తాగు, సాగునీటి కోసం ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మూడు కాల్వల కింద గుడివాడ, కైకలూరు, పెడన నియోజకవర్గాల పరిథిలో వందల గ్రామాలకు తాగునీరు, లక్ష ఎకరాలకు పైగా సాగునీరు ఇక్కడి నుండే వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వల్ల టెండర్లు ఆలస్యం అయిందనే సాకును అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా టెండర్లు పిలిచి తూడు తొలగింపు పనులు చేపట్టి సాగు, తాగు నీరు సక్రమంగా దిగువ ప్రాంతాలకు చేరేలా చేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.