రెచ్చగొట్టి రణరంగం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:41 AM
కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడటం.. రెచ్చగొట్టి తమాషా చూడటం.. చివరికి ఎదురెళ్లి దాడులు చేయడం.. గన్నవరంలో టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేస్తున్న అరాచకాలివి. తమపై దాడులను నిరసిస్తూ గురువారం టీడీపీ-జనసేన శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలోనూ వంశీ, ఆయన అనుచరుల వింత వైఖరి.. వారికి వంత పాడుతూ పోలీసులు చేసిన హడావిడితో శాంతియుత దీక్షా ప్రాంగణం రణరంగంలా మారింది.
వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ-జనసేన దీక్ష
యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో శాంతియుత నిరసన
దీక్షా శిబిరం వద్దకు వచ్చి మాజీ ఎమ్మెల్యే వంశీ కవ్వింపు
ఒక్కసారిగా బయటకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు
అడ్డుకున్న పోలీసులు.. తిరగబడిన కార్యకర్తలు..
వంశీ వెనక్కి వెళ్లిపోవడంతో శాంతించిన వాతావరణం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ/గుణదల) : గన్నవరంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చర్యలను నిరసిస్తూ గురువారం ఎనికేపాడులో పార్టీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొనగా, ఎమ్మెల్యే వంశీ, ఆయన అనుచరులతో పాటు పోలీసులు ప్రవర్తించిన తీరు ఘర్షణకు దారితీసింది. శిబిరంలో నాయకుల ప్రసంగాలు కొనసాగుతుండగా, ఆకస్మికంగా పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. భద్రతా దళాలు శిబిరం వద్దకు చేరుకోవడం రోప్ పార్టీ సైతం చకచకా ఏర్పాట్లు చేస్తుండటంతో కార్యకర్తలు, నాయకులు ఏదో జరుగుతోందని, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. పోలీసులు శిబిరం వద్ద హడావిడి చేసిన కొద్దిసేపటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ, తన అనుచరులతో ఐదు కార్లలో శిబిరం వద్దకు చేరుకున్నారు. శిబిరం ముందు నుంచి వెళ్లిన ఆయన తన కారును యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చారు. రోడ్డుకు అవతల పక్కన కార్లను ఆపి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వంశీని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదు. వంశీ కవ్వింపు చర్యలతో ఆగ్రహానికి గురైన శిబిరంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు టీడీపీ, జనసేన కార్యకర్తలను శిబిరం నుంచి బయకు రాకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కవ్వింపు చర్యలకు పాల్పడ్డ వంశీకి మద్దతుగా వస్తారా.. అంటూ కార్యకర్తలు పోలీసులకు ఎదురుతిరిగారు. యార్లగడ్డ వెంకట్రావు జోక్యం చేసుకుని టీడీపీ, జనసేన శ్రేణులను శాంతపరిచి దీక్ష కొనసాగించారు. వంశీ, ఆయన అనుచరులను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. నిరసన దీక్ష శాంతియుతంగా జరుగుతుండగా, పోలీసుల సహకారంతో వంశీ కవ్వింపు చర్యలకు పాల్పడటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోందంటూ కార్యకర్తలు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
దాడులు కొనసాగితే ఆత్మరక్షణకు దిగుతాం : యార్లగడ్డ వెంకట్రావు
టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్న వైసీపీ నాయకులను వదిలేసి బాధితులపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు అండగా ఉంటూ దాడులను ప్రోత్సహిస్తున్న పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. పాము కన్నా ఎక్కువ విషం ఉన్న వ్యక్తి వంశీ అని, తాము దీక్ష చేసే చోట ఆయనకేం పని అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే దాడులు, కవ్వింపు చర్యలకు తెగబడుతున్నారని ఆరోపించారు. ‘నేను జగన్‌తో కలిసి నడిచా. అన్యాయం చేశారనే బయటికి వచ్చా. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ విజయం ఖాయం. మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టిన వారి లెక్కలు సరిచేస్తాం’ అని హెచ్చరించారు. ఎన్నికల్లో పోలీసులు మాపై దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే మాపైకి వచ్చిన వారిపై ఆత్మరక్షణ కోసం తామే ప్రతి దాడులు చేస్తామన్నారు. ఈ నిరసన దీక్షలో టీడీపీ నాయకులు గొడ్డళ్ల చినరామారావు, గూడవల్లి నరసయ్య, కొల్లా ఆనంద్, సర్నాల బాలాజీ, కోనేరు శివరామకృష్ణ, కోనేరు సందీప్, గుజ్జర్లపూడి బాబూరావు, చాగంటిపాటి వెంకటకృష్ణ, ఆళ్ల గోపాలకృష్ణ, చలమలశెట్టి రమేష్, పొదిలి లలిత, చిక్కవరపు నాగమణి, తుపాకుల శివలీల, జూపల్లి సురేష్, దండు సుబ్రమ్మణ్యరాజు, అద్దేపల్లి సాంబు, బోడపాటి రవికుమార్, పరుచూరి నరేష్, మూల్పూరి సాయికల్యాణి, మండవ లక్ష్మి, మండవ రమ్య, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.