భూభక్షకులు
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:54 AM
ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన సుంకర సత్యనారాయణ కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ మండలంలోని పొణుకుమాడలో వారికి చెందిన 30 సెంట్ల భూమిలోనే అంత్యక్రియలు పూర్తిచేస్తారు. అక్కడే సమాధులు నిర్మిస్తారు. ఈ 30 సెంట్ల భూమి సత్యనారాయణ పేరుతోనే ఉంది. డాక్యుమెంట్లు కూడా ఆయన పేరుతోనే ఉన్నాయి. కానీ, అడంగల్‌లో మాత్రం అదే ఊరిలో ఎక్కడో ఉన్న వారి బంధువుల పేరుతో ఆ భూమిని మార్చేశారు. పొణుకుమాడలోనే సుంకర సత్యనారాయణ కుమారుడు సుంకర రాజ్‌కుమార్ పేరుతో ఉన్న సుమారు 2 ఎకరాలను వేరే వ్యక్తులకు విక్రయించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న భూరక్ష సర్వేలో భాగంగా అడంగల్‌లో ఆ భూమి సుంకర రాజ్‌కుమార్ పేరుతోనే మార్పు చేశారు. ఇదేమిటని భూమిని కొన్నవారు ప్రశ్నించగా, ‘ఎకరా రూ.30 లక్షలపైనే పలుకుతుంది. లక్ష రూపాయలు ఖర్చు చేసుకోండి. అడంగల్‌లో సరిచేసి ఇస్తాం.’ అని చెప్పారు. ఒక్క పొణుకుమాడ గ్రామంలోనే ఇలాంటి చిత్రాలు జరగలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా జగనన్న భూరక్ష సర్వేను ఆసరాగా చేసుకుని గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో)లు చెలరేగిపోయారు. అడంగల్‌లో ఇష్టారాజ్యంగా పేర్లు మార్చేసి, వాటిని సరిచేసేందుకు రూ.లక్షలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. భూ యజమానులకు తెలియకుండా, వారికి నోటీసులు జారీ చేయకుండా జగనన్న భూరక్ష పేరుతో సర్వే నిర్వహించారు. ఈ ప్రక్రియలో వీఆర్వోలు మొదలు.. తహసీల్దార్ల వరకు డబ్బు కోసం తమ పనితనం చూపించారు. ఈ నేపథ్యంలో వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్న రెవెన్యూ సదస్సుల్లో జగనన్న భూరక్ష సర్వే అక్రమాలే ప్రధాన అంశం కానున్నాయి.
ఒకరి భూమి మరొకరి ఖాతాలో మార్పులు చేర్పులు
సరి చేయడానికి రూ.లక్షల్లో లంచం
ఉంగుటూరులో వీఆర్వోకు అడంగల్ స్పెషలిస్ట్‌గా పేరు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన సమస్త సమాచారం వీఆర్వోల వద్ద ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని అప్పట్లో వైసీపీ నాయకులు వీఆర్వోలను చెప్పుచేతల్లో పెట్టుకుని భూరికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారు. పత్రాలు ఒకరి పేరు మీద ఉంటే అడంగల్‌లో మరొకరి పేరు ఉండేలా చేశారు. దాన్ని మార్పు చేయాలంటే వీఆర్వో, తహసీల్దార్లకు రూ.లక్షల్లో ముడుపు సమర్పించుకోవాల్సిన పరిస్థితి. మచిలీపట్నానికి చెందిన వైసీపీ కార్పొరేటర్‌కు పొట్లపాలెంలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో 15 సెంట్లు తగ్గించేశారు. ఇదేమని వీఆర్వోను ప్రశ్నిస్తే.. స్థానిక వైసీపీ నాయకుడిని అడగమన్నారు. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారి అప్పటి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని వద్దకు చేరింది. ఆయన కూడా తానేం చేయలేనంటూ చేతులెత్తేయడంతో చేసేది లేక సదరు కార్పొరేటర్ కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ 15 సెంట్లు ఆయన ఖాతాలోకి చేరలేదు.
గన్నవరం నియోజకవర్గంలో ఇష్టారాజ్యం
గన్నవరం నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే వంశీ జగనన్న భూరక్షను ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుకున్నారు. టీడీపీ నాయకులు, సానుభూతిపరుల భూముల రికార్డులను తప్పులతడకగా మార్చేశారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.
ఆ వీఆర్వో పేరు చెబితే హడల్
ఉంగుటూరు మండలంలో తహసీల్దార్‌గా ముత్యాల శ్రీనివాస్ పనిచేసే కాలంలో వెబ్‌ల్యాండ్ వ్యవహారాలను అడ్డగోలుగా చక్కబెట్టే వారిని దగ్గరకు చేర్చుకున్నారు. ఈ క్రమంలో అప్పట్లో వీఆర్‌ఏలుగా పనిచేసే వినోద్, మూర్తి అనేవారికి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించి మరీ చేరదీశారు. ఆ తర్వాత కొంతకాలానికి తహసీల్దార్‌గా వచ్చిన వనజాక్షి కూడా వీఆర్వో వినోద్‌కు ప్రాధాన్యతనిచ్చారు. ప్రమోటీ వీఆర్వోగా గన్నవరం వచ్చిన వినోద్ ఆ తర్వాత డిప్యుటేషన్‌పై ఉంగుటూరు మండలానికి చేరారు. ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో కింగ్ మేకర్‌గా ఎదిగారు. తహసీల్దార్‌గా పనిచేసిన వనజాక్షికి కుడిభుజంగా వ్యవహరించేవారు. మండలంలో వినోద్‌ను అడంగల్ స్పెషలిస్ట్ అని పిలుస్తారు. అడంగల్‌లో అడ్డగోలుగా పేర్లు మార్చేస్తాడన్న ఆరోపణలు ఉన్నాయి. తన పేరుతో మూడు ఎకరాలను కూడా ఈ విధంగానే వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ భాగం ఉంగుటూరు మండలంలోనే పనిచేశారు. రైతులెవరైనా పాస్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇక అంతే సంగతులు. పాస్‌బుక్ దరఖాస్తులను తన దగ్గరే తొక్కి పట్టేస్తారన్న పేరుంది. అడంగల్‌లో పట్టా నెంబరు ఉన్న కేసులకు పాస్‌బుక్‌లు ఇచ్చే సందర్భంలో రైతులకు చుక్కలు చూపిస్తాడు. పోరంబోకు భూములని మెలిక పెడతాడని, మళ్లీ వాటిని సరిచేయటానికి రూ.లక్షల్లో లంచం అడుగుతాడని స్థానిక రైతులు వాపోతున్నారు. అడంగల్‌లో పట్టా ఉన్నప్పుడు పాస్‌బుక్ ఇవ్వటానికి పోరంబోకు ఎలా అవుతుందో అర్థం కావట్లేదని లబోదిబోమంటున్నారు. గతంలో ఇష్టానుసారంగా డబ్బు తీసుకుని అడంగల్‌లో పేర్లను కూడా మార్చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వీఆర్వో అవినీతి వ్యవహారాలపై గతంలో స్థానికుడైన వి.రామకృష్ణప్రసాద్ అప్పటి తహసీల్దార్ వనజాక్షి దృష్టికి పదేపదే తీసుకెళ్లినా విచారణ జరపలేదు. అతనిపై చర్యలు కూడా తీసుకోలేదు. లంచాలు తీసుకునే విషయంలో వీఆర్వో చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. నేరుగా లంచం ఎప్పుడూ తీసుకోడు. డీల్ కుదిరాక ఫలానా వ్యక్తులకు డబ్బు ఇవ్వాలని తెలియచేస్తాడు. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారితో చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతాడన్న ఆరోపణలు ఉన్నాయి.