Share News

విజయవాడ-హైదరాబాద్‌ ఎయిరిండియా కొత్త సర్వీస్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:58 AM

విజయవాడ-హైదరాబాద్‌ నడుమ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నూతన బోయింగ్‌ విమాన సర్వీసును ప్రవేశపెట్టింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 186 సీట్లతో కూడిన ఈ భారీ బోయింగ్‌ సర్వీసు మంగళవారం ప్రారంభమైంది.

విజయవాడ-హైదరాబాద్‌ ఎయిరిండియా కొత్త సర్వీస్‌
హైదరాబాద్‌కు నూతన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసు

హైదరాబాద్‌ రూట్‌లో ఇండిగోకు గట్టిపోటీ

రోజూ ఉదయం 8.55 గంటలకు అందుబాటులో..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) : విజయవాడ-హైదరాబాద్‌ నడుమ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నూతన బోయింగ్‌ విమాన సర్వీసును ప్రవేశపెట్టింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 186 సీట్లతో కూడిన ఈ భారీ బోయింగ్‌ సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. ఈ విమాన సర్వీసును ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకును కట్‌ చేశారు. ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌ను అందించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోజూ ఉదయం 8.55 గంటలకు ఈ విమానం బయల్దేరుతుంది. 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. బోయింగ్‌ విమానంలో 8 బిజినెస్‌ క్లాస్‌, 178 ఎకానమీ క్లాస్‌ సీటింగ్‌ ఉంది.

ఇండిగో హవా తగ్గినట్టేనా..?

హైదరాబాద్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నూతన సర్వీసుతో ఈ మార్గంలో ఇతర విమానయాన సంస్థలతో పోటీ ప్రారంభమైంది. హైదరాబాద్‌ రూట్‌లో ఇప్పటి వరకు దేశీయ దిగ్గజ ప్రైవేట్‌ విమానయాన సంస్థ ఇండిగో ఏకచత్రాధిపత్యంతో నడిచింది. విజయవాడ నుంచి ప్రస్తుతం హైదరాబాద్‌కు 8 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో ఏడు సర్వీసులు ఇండిగో ఎయిర్‌లైన్స్‌వే. ఒక సర్వీసు మాత్రం ఎయిరిండియాకు చెందినది. ప్రస్తుత నూతన సర్వీసుతో హైదరాబాద్‌ రూటులో 9వ విమాన సర్వీసు మొదలైనట్టే. చార్మినార్‌-ఉండవల్లి కేవ్స్‌ పేరుతో ఈ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుంది. కాగా, ఈ కొత్త సర్వీసు ఇండిగోకు గట్టి పోటీ ఇవ్వనుంది. ధరలు తగ్గించే పరిస్థితి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇండిగో విమానాలన్నీ చిన్నవి కావటం, ఎయిరిండియాది భారీ బోయింగ్‌ కావడంతో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ నూతన సర్వీసు ప్రారంభోత్సవంలో ఎయిరిండియా స్టేషన్‌ మేనేజర్‌ ఎం.పార్థసారథి, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యేశ్వర్‌ త దితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:58 AM