విజయవాడ టు తిరుపతి ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:24 AM
విజయవాడ ప్రాంత వాసులతో పాటు అమరావతి రాజధాని ప్రాంత ప్రజలకు అందుబాటు ధరలో తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేందుకు విజయవాడ నుంచి తిరుపతికి డైలీ ప్రత్యేక ప్యాకేజీని కల్పిస్తూ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అడుగులు వేసింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ ప్రాంత వాసులతో పాటు అమరావతి రాజధాని ప్రాంత ప్రజలకు అందుబాటు ధరలో తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేందుకు విజయవాడ నుంచి తిరుపతికి డైలీ ప్రత్యేక ప్యాకేజీని కల్పిస్తూ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అడుగులు వేసింది. ఏసీ స్లీపర్ బస్సులో ప్రయాణం.. వసతి, భోజనాలు, దర్శనం వంటివన్నీ ఏపీటీడీసీ సమకూరుస్తుంది. రెండు రోజుల టూర్‌లో భాగంగా విశాఖపట్నం నుంచి బయలుదేరే ఏసీ స్లీపర్ బస్సులకు విజయవాడలో పాయింట్ ఇవ్వటంతో ప్రత్యేక ప్యాకేజీ అమల్లోకి వచ్చింది. ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి యాత్ర ప్రారంభమౌతుంది. బెంజిసర్కిల్ వద్ద ఫ్లైవోవర్ పిల్లర్ నెంబర్ 4 దగ్గర ఏపీటీడీసీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సు హాల్ట్ ఉంటుంది. యాత్రికులు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. తెల్లవారుఝామున 6 గంటలకు బస్సు తిరుమల చేరుతుంది. అక్కడ స్థానికంగా వసతి కల్పిస్తారు. తర్వాత.. బ్రేక్‌ఫాస్ట్, 10 గంటలకు స్వామివారి దర్శనం చేయిస్తారు. అనంతరం భోజన ఏర్పాట్లు చూస్తారు. తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ద ర్శనం, రాత్రి 7 గంటలకు డిన్నర్ ఉంటుంది. తిరిగి అర్ధరాత్రి తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుంది.
ఫ ప్యాకేజీ ధరలు పెద్దలకు రూ. 3,970, పిల్లలకు రూ.3,670 చొప్పున నిర్ణయించారు. ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందని ఏపీటీడీసీ చెబుతోంది. విజయవాడ నుంచి తిరుపతికి ఆసక్తి కలవారు 9848007025, 9440251775, 0866-2571393 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.