విజయ భేరి
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:30 AM
స్థానిక పాల డెయిరీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తట్టుకుని ‘విజయ’ భేరి నిరంతరాయంగా మోగుతూనే ఉంది. ప్రభుత్వ సహకారంతో సాగుతున్న అమూల్ వంటి స్థానికేతర డెయిరీలతో పోటీ పడుతూ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది. నిన్నటివరకు చిట్టినగర్‌లోని పాలఫ్యాక్టరీ ద్వారా విశేష ఖ్యాతిని ఆర్జించిన ‘విజయా’.. వీరవల్లిలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆటోమేషన్ టెక్నాలజీతో కూడిన మిల్క్ ప్లాంట్ ద్వారా మరింత ఎత్తుకు ఎదిగింది. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.180 కోట్లతో ఈ నవ స్వయంచాలక (ఆటోమేషన్) మిల్క్‌ప్లాంట్ నిర్మాణం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డెయిరీల చూపు ‘విజయా’పై పడింది. అత్యాధునికంగా కంప్యూటర్ ఆధారిత సాంకేతిక, యాంత్రీకరణతో పనిచేసే ఈ ప్లాంట్‌ను శనివారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. ఆ వివరాలు..
వీరవల్లిలో విజయా డెయిరీ సరికొత్త ఆటోమేషన్ మిల్క్ ప్లాంట్
22 ఎకరాల్లో రూ.180 కోట్లతో అత్యాధునికంగా నిర్మాణం
పూర్తిగా సాంకేతిక, యాంత్రీకరణతో ఏర్పాటు
పాలతో పాటు పాల ఆధారిత ఉత్పత్తులెన్నో..
అమూల్ పోటీకి నిలబడి పైచేయి సాధించిన సంస్థ
ప్రభుత్వ ప్రతిబంధకాలను తట్టుకుని ముందుకు..
ప్రస్తుతం 10.01 కోట్ల లీటర్ల పాలసేకరణ.. రూ.1,106 కోట్ల టర్నోవర్
రూ.180 కోట్ల లాభంతో అంచెలంచెలుగా అభివృద్ధి
స్థానిక పాల డెయిరీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తట్టుకుని ‘విజయ’ భేరి నిరంతరాయంగా మోగుతూనే ఉంది. ప్రభుత్వ సహకారంతో సాగుతున్న అమూల్ వంటి స్థానికేతర డెయిరీలతో పోటీ పడుతూ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది. నిన్నటివరకు చిట్టినగర్‌లోని పాలఫ్యాక్టరీ ద్వారా విశేష ఖ్యాతిని ఆర్జించిన ‘విజయా’.. వీరవల్లిలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆటోమేషన్ టెక్నాలజీతో కూడిన మిల్క్ ప్లాంట్ ద్వారా మరింత ఎత్తుకు ఎదిగింది. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.180 కోట్లతో ఈ నవ స్వయంచాలక (ఆటోమేషన్) మిల్క్‌ప్లాంట్ నిర్మాణం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డెయిరీల చూపు ‘విజయా’పై పడింది. అత్యాధునికంగా కంప్యూటర్ ఆధారిత సాంకేతిక, యాంత్రీకరణతో పనిచేసే ఈ ప్లాంట్‌ను శనివారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. ఆ వివరాలు..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆటోమేషన్ మిల్క్‌ప్లాంట్ ఏర్పాటు ద్వారా విజయా డెయిరీ దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించింది. అమూల్ వంటి స్థానికేతర డెయిరీలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల పరంపరలో కూడా విజయా చెక్కు చెదరకుండా ముందుకు సాగుతోంది. అమూల్ కోసం గ్రామగ్రామాన బలవంతంగా పాలసేకరణ జరిపిస్తున్న ప్రభుత్వ నిర్బంధాలను దాటుకుని అభివృద్ధి చెందటం కృష్ణామిల్క్ యూనియన్‌కే సాధ్యమైంది. కృష్ణాజిల్లా వీరవల్లిలో 16వ నెంబరు జాతీయ రహదారికి అత్యంత సమీపాన 22.2 ఎకరాల్లో ఈ ఆటోమేషన్ మిల్క్‌ప్లాంట్‌ను విజయా డెయిరీ ఏర్పాటు చేసింది. దేశంలోనే అత్యంత అడ్వాన్సుడు టెక్నాలజీతో కూడిన ఈ ప్లాంట్‌ను రూ.181 కోట్లతో ఏర్పాటు చేశారు. దీనిద్వారా విజయా డెయిరీ తన నెట్‌వర్క్‌ను మరింత వేగంగా పెంచుకోవటానికి దోహదపడుతుంది. గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా చాలా వేగంగా పాల సేకరణ, ఉత్పత్తులు పంపిణీ చేసే ఆస్కారం ఏర్పడుతుంది.
మిల్క్‌ప్లాంట్ ప్రత్యేకతలివీ..
ఆటోమేషన్ మిల్క్‌ప్లాంట్ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆధునిక సాంకేతిక, యాంత్రీకరణ ద్వారా పనిచేస్తుంది. ఇది రెండు డివిజన్లుగా ఉంటుంది. మొదటిది యుటిలిటీ డివిజన్. రెండోది ప్రొడ్యూస్ డివిజన్. ఆటోమేషన్ ప్లాంట్‌కు అవసరమైన పవర్, ఎలక్ర్టిక్, బాయిలర్ తదితర విభాగాలు యుటిలిటీలో ఉంటాయి. ప్రధానమైన ప్రొడ్యూస్ డివిజన్‌లోనే ఆటోమేషన్ ప్లాంట్ ఉంటుంది. ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్ల పాలను సంగ్రహిస్తుంది. మూడు లక్షల లీటర్ల లిక్విడిటీ ప్రాడక్ట్స్ (లస్సీ, బటర్‌మిల్క్), లక్ష లీటర్ల పెరుగు ఉత్పత్తులను నిర్వహిస్తోంది. ఈ ఉత్పాదకతలను ఆరు లక్షల లీటర్ల వరకు కూడా తీసుకెళ్లవచ్చు. ఈ ప్లాంట్ అంతా కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. స్కాడా వ్యవస్థ ద్వారా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విధానంలో పాలను ఫిల్లింగ్, పంపింగ్ వంటివి చేస్తుంటారు. ఏ ఉత్పాదకత జరగాలన్నా కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు రావాల్సిందే. వాహనాల నుంచి పాలను డాక్ యూనిట్ ద్వారా సంగ్రహించి వాటిని ఫ్యాక్టరీ దక్షిణ దిశలో ఉన్న మిల్క్ స్టోరేజ్‌డ్ ట్యాంకర్లలోకి పంపిస్తారు. లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లు మూడు, అరలక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లు ఏడు ఉన్నాయి. పాల ఉత్పత్తులు తయారుచేసే ముందు ట్యాంకర్లలోని పాలలో ఉన్న వైరస్‌ను చ ంపటానికి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. ఆ తర్వాత నిరే ్దశిత ఫ్యాట్ కంటే ఎక్కువ ఉంటే తొలగిస్తారు. ఇలా చేసిన పాలను పాల ప్యాకెట్లు, పెరుగు, మజ్జిగ, లస్సీలు చేయటానికి పంపిస్తారు. పాల ప్యాకెట్లను తయారు చేయటం కోసం మిల్క్ పౌచ్ ఫిల్లింగ్ స్టేషన్‌లోకి పంపిస్తారు. ఇక్కడ కంప్యూటర్ ఆధారిత విధానంలో పనిచేసే 150 ఎంఎల్, 160 ఎంఎల్, 500 ఎంఎల్ వంటి ప్యాకింగ్ యంత్రాలు ఉంటాయి. కప్ కర్డ్ ఫిల్లింగ్ స్టేషన్‌లోకి పాలను పంపించి బాగా వేడి చే స్తారు. అక్కడి నుంచి అవి తోడుకోవటానికి వీలుగా బ్లాస్ట్ రూమ్‌ల్లోకి పంపించి మరింత వేడి చేస్తారు. ఆ తర్వాత వాటిని కోల్డ్ చాంబర్లలోకి తీసుకెళ్తారు. అక్కడ పెరుగు గడ్డకట్టుకుపోతుంది. పాల నాణ్యతను పరీక్షించటానికి రెండు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియాను కోల్డ్ బాక్సుల్లో నిల్వచేస్తారు. పాల నుంచి, ఫ్యాట్ నుంచి తయారు చేసిన పౌడర్‌ను కూడా కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేస్తారు. పాల ప్యాకెట్లను ఉంచే ట్రేలను శుభ్రం చేయ టానికి ప్రత్యేకమైన విభాగం ఉంది. ఆటోమేషన్ ప్లాంట్‌కు పాలు సరఫరా అయ్యే పైపులు, మెషినరీని శుభ్రపరిచే విధానాన్ని ఆటోమేషన్‌లోనే చేపట్టడం విశేషం. దీనికోసం సిప్ విధానం పనిచేస్తుంది. సురక్షితమైన పాలు, పాల ఉత్పత్తులను ఆటోమేషన్ విధానంలో ఉత్పత్తి చేయడమే ఇక్కడి ప్రత్యేకత.
ఆది నుంచీ విజయపథమే..
యూనిసెఫ్ ఆర్థిక సహకారంతో 1964లో కృష్ణా డిస్ర్టిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (కృష్ణామిల్క్ యూనియన్) ఏర్పడింది. ఈ యూనియన్ నేతృత్వంలో విజయవాడలోని చిట్టినగర్ సమీ పంలో మిల్క్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా మాన్యువల్ విధానంలో పనిచేస్తుంది. వీరవల్లిలో ఏర్పాటు చేసిన మిల్క్‌ప్లాంట్ మాత్రం పూర్తి ఆటోమేషన్ విధానంలో పనిచేస్తుంది.
ఆరు దశాబ్దాల్లో అభివృద్ధిబాట
ప్రముఖులు కాకాని వెంకటరత్నం, ముక్త్యాల రాజా, వల్లభనేని రంగయ్య చౌదరి, పర్వతనేని వెంకటరత్నం, ఎర్నేని వెంకటేశ్వరరావులు కృష్ణామిల్క్ యూనియన్‌ను స్థాపించారు. సుదీర్ఘకాలం చైర్మన్‌గా సాగిన మండవ జానకీరా మయ్య విజయా డెయిరీని ముందుకు నడిపించారు. స్థానికేతర డెయిరీల ప్రాబల్యం పెరుగుతున్న దశలో చైర్మన్‌గా వచ్చిన చలసాని ఆంజనేయులు విజయా డెయిరీని పూర్తిగా మార్చేశారు. స్థానిక ముద్రను తొలగించి రాష్ర్టీ యంగా, దేశీయంగా పాలసేకరణ, పాల ఉత్పత్తులు తయారు చేయించే సంస్థగా తీర్చిదిద్దారు.
కృష్ణామిల్క్ యూనియన్ బలోపేతం
విజయా డెయిరీ అభివృద్ధి పథాన సాగడానికి కృష్ణామిల్క్ యూనియన్ ప్రధాన కారణం. పాడి రైతులకు జీవనోపాధిని కల్పించటంతో పాటు పాడి ఉత్పాదకతను పెంచటానికి యూనియన్ పనిచేస్తోంది. ఇది ప్రస్తుతం 1,000 గ్రామీణ పాలసేకరణ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇవన్నీ ఆయా సొసైటీలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కమిటీల పర్యవేక్షణలో పనిచేస్తాయి. డైరెక్టర్లతో కూడిన సెంట్రల్ బోర్డు విజయా డెయిరీని ఆజమాయిషీ చేస్తుంది.
భారీగా పెరిగిన పాల సేకరణ
విజయా డెయిరీ భారీగా పాలసేకరణ చేపడుతోంది. 2012-13లో 5.81 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తే, 2016-17 నాటికి 5.98 కోట్ల లీటర్లకు చేరింది. అలాగే, 2018-19లో 6.04 కోట్ల లీటర్లు, 2019-20లో 7.07 కోట్ల లీటర్లు, 2020-21లో 8.94 కోట్ల లీటర్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10.1 కోట్ల లీటర్ల పాలను సేకరించింది. ఆరున్నరేళ్లలో విజయా ఎదుగుదలను ఇది ప్రతిబింబిస్తుంది. విస్తరణతో పాటే వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2017-18లో రూ.662 కోట్ల టర్నోవర్‌గా ఉన్న విజయా డెయిరీ 2018-19లో రూ.712 కోట్లు, 2019-20లో రూ.794 కోట్లు, 2020-21లో రూ.915 కోట్లు, 2021-22లో రూ.1,007 కోట్లు, 2022-23లో 1,106 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.
లాభాలపాలు
విజయా డెయిరీ పాలసేకరణతో ప్రారంభించి పాల ఉత్పత్తులతో మంచి లాభాలనే సాధిస్తోంది. 2014-15లో రూ.72 కోట్ల లాభంలో ఉన్న డెయిరీ అంచెలంచెలుగా ఎదిగింది. 2015-16లో రూ.76 కోట్ల లాభం, 2016-17లో రూ.63 కోట్లు, 2017-18లో రూ.78 కోట్లు, 2018-19లో రూ.84 కోట్లు, 2019-20లో రూ.102 కోట్లు, 2020-21లో రూ.127 కోట్లు, 2021-22లో రూ.159 కోట్ల లాభాన్ని సాధిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్ల లాభం వచ్చింది.
రకరకాల పాల ఉత్పత్తులు
విజయా డెయిరీ పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీనే కాకుండా దూద్‌పెడ, మలాయి లడ్డు, ఫెస్టివల్ స్వీట్స్, మిల్క్ కేక్, బటర్ బర్ఫీ, చాక్లెట్ బర్ఫీ, ఖర్జూర కోవా, కళాకానీ, మిక్స్‌డ్ లడ్డు, బాదం మిల్క్ పౌడర్, మిల్క్ పౌడర్, నెయ్యి, కౌ మిల్క్ వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని లాభాపేక్ష కోసం కాకుండా ఏజెంట్ల వ్యాపారం కోసం మార్జినల్ రేట్లకు అందిస్తోంది.
పాడి రైతుల కోసం...
సంస్థకు మూలాధారమైన పాడిరైతుల సంక్షేమం కోసం కృష్ణామిల్క్ యూనియన్ చాలా చేస్తోంది. ఇటీవల కాలంలో ‘పల్లెకు పోదాం.. పాడిని పెం చుకుందాం’, ‘పల్లెకు పోదాం.. పాడిరైతుల లాభాలను పెంచుదాం’ అనే నినా దంతో ముందుకు సాగుతోంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాభాల్లో 10 శాతం బోనస్‌గా ఇస్తోంది. ఎక్కువ పాలనిచ్చే గేదెలను అందిం చటం, పౌష్టికరమైన పశుదాణా ఇవ్వడం, సుశిక్షుతులైన వెటర్నరీ డాక్టర్లతో క్యాంపులు నిర్వహించటం, సబ్సిడీపై పశువుల కొనుగోలుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం చేపడుతోంది. పాలరైతు చనిపోతే రూ.50 వేల సహాయం, పాడిరైతు ఇంట పెళ్లిళ్లు జరిగితే కల్యాణమస్తు పథకం కింద బంగారు కాయిన్ ఇవ్వటం, ప్రతిభ స్కీమ్ కింద రైతుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ చేపడుతోంది.
రైతులకు రూ.200 కోట్ల ఆస్తి
నూతన ప్లాంట్ కృష్ణాజిల్లా పాడి రైతులకు 200 కోట్ల రూపాయల ఆస్తి. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో విజయా డెయిరీ ఈ విజయాన్ని సాధించింది. ఇది రైతుల విజయంగా భావిస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించేందుకు ఇది సోపానంగా నిలుస్తుందని నమ్ముతున్నాం.
- చలసాని ఆంజనేయులు, డెయిరీ చైర్మన్