Share News

గుడివాడలో తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే కొడాలి నానీయే బాధ్యుడు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:52 AM

గుడివాడలో తాగునీటి కష్టాలకు ఎమ్మెల్యే కొడాలి నాని బాధ్యుడని, మూడేళ్ల క్రితం పాత చెరువుకు గండిపడితే కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆరోపించారు.

  గుడివాడలో తాగునీటి సమస్యకు   ఎమ్మెల్యే కొడాలి నానీయే బాధ్యుడు

గుడివాడ : గుడివాడలో తాగునీటి కష్టాలకు ఎమ్మెల్యే కొడాలి నాని బాధ్యుడని, మూడేళ్ల క్రితం పాత చెరువుకు గండిపడితే కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆరోపించారు. శనివారం 25వ వార్డులోని పంపుల చెరువును మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి వెనిగండ్ల పరిశీలించారు. రాము మాట్లాడుతూ, పాలకుల నిర్లక్ష్యం, అధికారులు బాధ్యతారాహిత్యం కారణంగా గుడివాడ ప్రజలకు తాగునీటి కష్టాలు వచ్చాయన్నారు. ఏ వార్డుకు వెళ్లినా మంచినీరు రావడం లేదని మహిళలు వాపోతున్నారన్నారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును పరిశీలిస్తే పాలకుల నిర్లక్ష్యం స్పష్టమైందన్నారు. మూడేళ్ల క్రితం పాత చెరువుకు గండిపడితే పూడ్చకుండా నిర్లక్ష్యం చేయడంతో 36 ఎకరాల చెరువు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. రిజర్వాయర్లు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు అందుబాటులో ఉన్నా తాగునీరు ఇవ్వడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారన్నారు. తాము అధికారంలోకి రాగానే పాత చెరువు గండిని పూడ్చి అందుబాటులోకి తీసుకువస్తామని వెనిగండ్ల హామి ఇచ్చారు.

Updated Date - Apr 07 , 2024 | 12:52 AM