Share News

ఇంద్రకీలాద్రిపై 9 నుంచి వసంత నవరాత్రులు

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:52 AM

: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయ పూజాధికాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చించనున్నట్టు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. మహామండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

ఇంద్రకీలాద్రిపై 9 నుంచి వసంత నవరాత్రులు
వసంత నవరాత్రి ఉత్సవాల బ్రోచర్‌ విడుదల చేస్తున్న ఈవో రామారావు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 3 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయ పూజాధికాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చించనున్నట్టు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. మహామండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఈవో రమే్‌షబాబు, ఈఈ లింగం రమాదేవి, వైదిక కమిటీ సభ్యులతో కలిసి బ్రోచర్‌ను విడుదల చే శారు. ఈనెల వసంతనవరాత్రులను పురస్కరించుకుని సంప్రదాయంగా వస్తున్న విధివిధానాల మేరకు రోజుకో రకం పూలతో అమ్మవారిని అర్చించనున్నట్టు తెలిపారు. 9న మల్లెపూలు, మరువం, 10న కనకాంబరాలు, గులాబీలు, 11న చామంతి ఇతర పూలు, 12న మందార, ఎర్రకలువలు, 13న తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువం, దవనం, 14న కాగాడ మల్లెలు, జాజులు, మరువం, 15న ఎర్రతామరలు, ఎర్రగన్నేరుపూలు, సన్నజాజులు, 16న చామంతులు, సంపెంగలు, 17న కనకాంబరాలు, గులాబీలు, 18న వివిధ రకాల పుష్పాలతో అర్చించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు భక్తుల పూలను విరాళంగా ఇవ్వవచ్చన్నారు. లక్ష్మీగణపతి స్వామి మందిరం వద్ద పుష్పార్చనలో పాల్గొనదలచిన దంపతులు రూ.2,500 రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూజ అనంతరం అంతరాలయ దర్శనం, శేషవస్త్రం, రవిక, అమ్మవారి చక్రపీఠం, పెద్దలడ్డూ ప్రసాదంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి పుష్పార్చనలు ప్రారంభమవుతాయని. 18వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని తెలిపారు. ఉగాది పర్వదినాన సాయంత్రం 5.30గంటలకు మల్లిఖార్జున మహామండపం నుంచి వెండి రథోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఉగాది రోజున అమ్మవారి సేవలు నిలుపుదల చేస్తారు. 9 నుంచి 24వ తేదీ వరకు వసంతనవరాత్రులు, చైత్రమాస బ్రహ్మోత్సవాల కారణంగా రుద్రహోమం, మృత్యుంజయ హోమాలను నిలుపుదల చేస్తారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు శాంతి కల్యాణం, పల్లకిసేవలను నిలుపుదల చేస్తారు. ప్రతి నిత్యం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఆర్జిత సేవలు ఉగాది రోజు అరగంట ఆలస్యంగా ప్రారంభిస్తామని భక్తులు వీటిని గమనించాలని కోరారు. 9వ తేదీ ఉగాది రోజున సుప్రభాత సేవ అనంతరం వేకువజామున 3గంటలకు గర్భాలయంలోని అమ్మవారికి ఉపాలయాలలో ఉన్న దేవతామూర్తులకు స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అలంకారం, అర్చన, నివేదన, హారతి అనంతరం ఉదయం 8గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 8.15 గంటలకు వసంతనవరాత్రోత్సవాలకు సంబంధించి కలశస్థాపన అనంతరం ప్రత్యేక పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపదం వేదికపై పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. 4 గంటలకు మండపపూజ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం కార్యక్రమాలను యాగశాలలో నిర్వహిస్తారు. 16వ తేదీన చైత్రశుద్ధ అష్టమినాడు క్షేత్రపాలక ఆంజనేయస్వామివారికి అభిషేకం, ఆకుపూజ కార్యక్రమాలు జరుగుతాయి. 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణోత్సవాన్ని ధర్మపదం కళావేదికపై నిర్వహిస్తారు. 18వ తేదీన వసంతనవరాత్రోత్సవాలకు సంబంధించి పూర్ణాహుతి నిర్వహిస్తారు. అదేరోజు 11 గంటలకు శ్రీరాముల వారి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 24వ తేదీ ఉదయం పూర్ణాహుతి, ధాన్య కొట్నోత్సవం వసంతోత్సవం అవభృత స్నానం, మూకబలి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి అవుతాయి. సాయంత్రం గంగ, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులకు పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 19వ తేదీన వెండిపల్లకి, 20 వతేదీ రావణవాహనం, 21 వతేదీ వెండి రథోత్సవం, 22 వతేదీ నంది వాహనం, 23 వతేదీ సింహవాహన సేవలు ఉంటాయి.

Updated Date - Apr 04 , 2024 | 12:52 AM