Share News

వంశీ దారెటు..?

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:16 AM

కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉంటున్న గన్నవరం ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రచారానికీ దూరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డకు పెరుగుతున్న ప్రజాదరణ వంశీ వెనకడుగు వేస్తున్నారంటూ ఊహాగానాలు నియోజకవర్గ మార్పు, నిధులలేమిపైనా చర్చ కొడాలి నానీతో కలిసి సీఎంతో వంశీ భేటీ గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ స్తబ్దుగా ఉండటానికి కారణమేంటి..? సిటింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఎందుకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు..? ఈ ఎన్నికల్లో అసలు ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తారా..? లేక టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు లభిస్తున్న ప్రజాదరణను చూసి వెనక్కి జంకుతున్నారా..? గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీతో కలిసి సోమవారం సీఎం జగన్‌ను కలిసిన వంశీ సీటు మార్పు, నిధుల సమస్యపై చర్చించారా? అంటే.. అవుననే సమాధానాలు వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి.

వంశీ దారెటు..?

కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉంటున్న గన్నవరం ఎమ్మెల్యే

నియోజకవర్గంలో ప్రచారానికీ దూరం

టీడీపీ అభ్యర్థి యార్లగడ్డకు పెరుగుతున్న ప్రజాదరణ

వంశీ వెనకడుగు వేస్తున్నారంటూ ఊహాగానాలు

నియోజకవర్గ మార్పు, నిధులలేమిపైనా చర్చ

కొడాలి నానీతో కలిసి సీఎంతో వంశీ భేటీ

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ స్తబ్దుగా ఉండటానికి కారణమేంటి..? సిటింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఎందుకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు..? ఈ ఎన్నికల్లో అసలు ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తారా..? లేక టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు లభిస్తున్న ప్రజాదరణను చూసి వెనక్కి జంకుతున్నారా..? గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీతో కలిసి సోమవారం సీఎం జగన్‌ను కలిసిన వంశీ సీటు మార్పు, నిధుల సమస్యపై చర్చించారా? అంటే.. అవుననే సమాధానాలు వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి.

(విజయవాడ- ఆంధ్రజ్యోతి) : గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే, 6 సార్లు గెలిపించిన చరిత్ర గన్నవరం నియోజకవర్గ ప్రజలది. మరో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. 1983 నుంచి ఎన్నికలను పరిశీలిస్తే, కాంగ్రెస్‌ కేవలం ఒక్కసారే విజయం సాధించింది. అలాంటి నియోజకవర్గంలో వంశీ టీడీపీ అభ్యర్థిగా గెలుపు సాధించడం పెద్ద విశేషమేమీ కాదు. 2019లో వంశీ టీడీపీ టికెట్‌పై గెలిచి వైసీపీ పంచన చేరాక ఆయన గ్రాఫ్‌ క్రమేణా తగ్గుతూ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసభ్యంగా దూషించాక గ్రాఫ్‌ శరవేగంగా పడిపోవడం మొదలైంది. మరోవైపు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషించుకున్న వంశీ ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలుమార్లు వైసీపీ పెద్దలకు చెబుతూ వచ్చారు. మరోవైపు వంశీ సుమారు రెండు నెలలకుపైగా నియోజకవర్గంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గన్నవరం వచ్చినా కార్యాలయానికి లేదా పరామర్శలకు పరిమితమవుతున్నారు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేస్తారని అంతా భావిస్తున్న తరుణంలో వంశీ ధోరణి మాత్రం వేరుగా ఉంది. అసలు ఆయన పోటీ చేస్తారా, చేయరా అనే సందేహం వైసీపీ శ్రేణుల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎంతో సోమవారం జరిగిన భేటీలో వంశీ సీటుపైనే ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం.

డబ్బు కోసమా.. భయపడుతున్నారా..?

ప్రతిసారీ ఎన్నికల ముందు నిధుల కోసం వంశీ ‘పోటీ నుంచి విత్‌డ్రా’ డ్రామా ఆడుతుంటారనేది నిజం. గత ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి పోటీకి విముఖత చూపిన వంశీ తాజాగా మళ్లీ అదే డ్రామా నడిపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. అయితే, టీడీపీ అధిష్ఠానంలా తాడేపల్లి పెద్దలు కరిగిపోరని, ఎదురు వంశీ నుంచే వసూలు చేస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. గన్నవరంలో వంశీ రాకతో వైసీపీలో ఇద్దరు బలమైన నాయకులుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావును పార్టీ దూరం చేసుకోవాల్సి వచ్చిందని, అలాంటిది ఎన్నికల సమయంలో వంశీ ఇలాంటి డ్రామాలు ఆడటమేమిటని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. నిధుల కోసం కాకపోతే నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావును చూసి వంశీ భయపడి పోటీకి వెనుకాడుతున్నారా అనే చర్చ కూడా వైసీపీ శ్రేణుల్లో నడుస్తోంది. 2014, 2019లో రెండుసార్లు టీడీపీ టికెట్‌పై వంశీ గెలుపొందారు. వరుస విజయాలతో ఆయన గన్నవరంపై పట్టు బిగించారు. ఈ పదేళ్లలో నియోజకవర్గంలో ఆయన అనుచరులు సాగించిన అవినీతికి అంతే లేదు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వెంకట్రావుపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత.. వంశీ అనుచరుల అవినీతి.. వెరసి ఈసారి ఓటమి తప్పదనే భయంలో వంశీ ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే ఆయన గన్నవరం నుంచి పోటీకి వెనుకాడుతున్నారని చెబుతున్నారు.

గన్నవరం కాకపోతే ఎక్కడ?

గన్నవరం నుంచి వంశీ పోటీచేయని పక్షంలో ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది చర్చనీయాంశంగా మారింది. సోమవారం నాటి భేటీలో వంశీకి రెండు ఆప్షన్లు సూచించినట్లు తెలిసింది. ఒకటి పెనమలూరు నుంచి పోటీ చేయడం, రెండోది మైలవరం నియోజకవర్గానికి వెళ్లడం. ఈ రెంటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిందిగా వైసీపీ పెద్దలు వంశీకి సూచించినట్లు తెలిసింది. దీనిపై వంశీ కూడా సానుకూలత చూపినట్లు తెలిసింది. ఏదేమైనా వారం, పది రోజుల్లో వంశీ పోటీచేసే స్థానంపై స్పష్టత రానుంది.

Updated Date - Feb 13 , 2024 | 01:16 AM