Share News

వైసీపీ మునుగుతున్న నావ!

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:29 AM

వైసీపీ పడవ మునిగిపోతోంది.. కృష్ణాజిల్లాలో ఉమ్మడి అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు.. అని మాజీ ఎంపీ, కృష్ణాజిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. మచిలీపట్నం 8వ డివిజన్‌ లక్ష్మణరావుపురంలో వైసీపీకి చెందిన సంకుల శ్రీనివాస్‌ బృందం ఆదివారం పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.

వైసీపీ మునుగుతున్న నావ!
సంకుల నాని బృందంతో ప్రతిఙ్ఞ చేయిస్తున్న కొనకళ్ల, రవీంద్ర, రామకృష్ణ

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 29 : వైసీపీ పడవ మునిగిపోతోంది.. కృష్ణాజిల్లాలో ఉమ్మడి అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు.. అని మాజీ ఎంపీ, కృష్ణాజిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. మచిలీపట్నం 8వ డివిజన్‌ లక్ష్మణరావుపురంలో వైసీపీకి చెందిన సంకుల శ్రీనివాస్‌ బృందం ఆదివారం పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. తొలుత గజమాలలతో కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, బండి రామకృష్ణలకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే పేర్ని నానిపై సంకుల శ్రీనివాస్‌ బృందం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కార్యకర్తలను టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలతో కొల్లు రవీంద్ర ప్రతిఙ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, కృష్ణాజిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు కూటమి అభ్యర్థులను ఆదరిస్తున్నారన్నారని, స్వచ్ఛందంగా ర్యాలీలో ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొంటున్నారని చెప్పారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఎమ్మెల్యే పేర్ని నాని వేధింపులకు విసిగి పోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ, జనసేనలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో బండి రామకృష్ణ, బూరగడ్డ వేదవ్యాస్‌, కొనకళ్ల బుల్లయ్య, గోపు సత్యనారాయణ, గొర్రెపాటి గోపీచంద్‌, మోటమర్రి బాబా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శనగర్‌లో, గాయిత్రీ కళ్యాణ మంటపంలో రోల్డుగోల్డు కార్మికులు పెద్ద సంఖ్యలో ఉమ్మడి అఽభ్యర్థులకు మద్దతు తెలిపి టీడీపీలో చేరారు.

అభివృద్ధిని నాశనం చేసిన వ్యక్తి జగన్‌

ఓటు ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలి : వసంత కృష్ణ ప్రసాద్‌

ఇబ్రహీంపట్నం/జి.కొండూరు : ఏపీ సీఎం జగన్‌కు ఓట్ల యావ తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనే లేదని, ఆయన రివర్స్‌ పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని బీజేపీ, జనసేన బలపర్చిన మైలవరం టీడీపీ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం, గుంటుపల్లి, ఈలప్రోలు, కేతనకొండ, మూలపాడు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, ఇక్కడ అన్యాయం చేసింది చాలక గెలిస్తే వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తానంటున్న జగన్ను ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ ఉచిత ఇసుక పథకాన్ని రద్దు చేసి ఇసుకను పెచ్చు ధరలకు అమ్ముకుందన్నారు. రూ.80ల మద్యం బాటిల్‌ రూ.300లు పెంచడంతో పాటు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌ చేశాడన్నారు. 15 ఏళ్ల పాటు మద్యం బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం బ్యాంకుల్లో తనఖా పెట్టారన్నారు. 2019-24లో జగన్‌ తొమ్మిది సార్లు విద్యుత్‌ చార్జిలు పెంచడం వల్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడన్నారు. అమర్‌రాజా లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రం విడిచి పోవాల్సి వచ్చిందన్నారు. కొత్తగా ఒక్క పరిశ్రమ రాకపోవడంతో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ, ఉపాధి కల్పన లేక రాష్ట్రం నుంచి నిరుద్యోగులు వలస పోయారన్నారు. చింతలపూడికి టీడీపీ ప్రభుత్వం రూ.4,100 కోట్లు ఖర్చుచేస్తే ఐదేళ్లలో వైసీపీ పైసా ఖర్చు చేయకుండా ప్రాజెక్టును తుప్పు పట్టించిందన్నారు. ఓట్ల కోసం అప్పులు చేసి మీట నొక్కితే ప్రగతి ఆగిపోతుందన్నారు. జగన్‌కు ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ నేత నూతలపాటి బాలకోటేశ్వరరావు, జనసేన నేత అక్కల రామ్మోహన్‌రావు, జంపాల సీతారామయ్య, కూటమి నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

వెల్లటూరులో వైసీపీ ఖాళీ

జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ సమక్షంలో సర్పంచ్‌ వేల్పూరి సుజానమ్మ, ఆమె భర్త వేల్పూరి మరియన్నలతో పాటు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు 20 మందికి పైగా టీడీపీలో చేరారు. వైసీపీ నాయకుడు మలరాజు నారాయణ సైతం టీడీపీలో చేశారు. సోమవారం మైలవరం మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌, ప్రముఖ న్యాయవాది, మాదు ఆంజనేయులుతో పాటు మరో పది మంది వైసీపీని వీడి వసంత సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:29 AM