లంక భూముల్లో అనధికార బట్టీలు!
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:38 AM
అధికారం, అండదండలు ఉండటంతో వైసీపీ నేతలు కనిపించిన ఏ వనరుని వదల్లేదు. కొండలను కొల్లగొట్టారు. మట్టిని మోసేశారు. ఇసుకను ఇష్టానుసారం తవ్వేశారు. ఐదేళ్లలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మూలపాడులో వైసీపీ నేతల అనధికార ఇటుక బట్టీల బాగోతం రెవెన్యూ, భూగర్భ గనులశాఖలోని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది.

అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ
నిర్వాహకుల్లో వైసీపీ ప్రజాప్రతినిధుల భర్తలు
బట్టీల వద్ద రెవెన్యూ, విజిలెన్స్ అధికారుల తనిఖీలు
వెలుగులోకి వస్తున్న అనధికార బాగోతం
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
అధికారం, అండదండలు ఉండటంతో వైసీపీ నేతలు కనిపించిన ఏ వనరుని వదల్లేదు. కొండలను కొల్లగొట్టారు. మట్టిని మోసేశారు. ఇసుకను ఇష్టానుసారం తవ్వేశారు. ఐదేళ్లలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మూలపాడులో వైసీపీ నేతల అనధికార ఇటుక బట్టీల బాగోతం రెవెన్యూ, భూగర్భ గనులశాఖలోని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనధికార ఇటుక బట్టీల నిర్వాహణ వెనుక వైసీపీ నేతల పాత్ర ఉన్నట్టు స్పష్టంగా తేలింది.
లెక్కలేనితనం..
మూలపాడు గ్రామంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆనుకుని లంక భూములు ఉన్నాయి. సాధారణంగా ఇటుక బట్టీలకు రెవెన్యూ, జలవనరుల, భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. వైసీపీ అధికారంలో గ్రామానికి చెందిన నేతలు ఈ భూముల్లో రాత్రికి రాత్రి ఇటుక బట్టీలను ఏర్పాటు చేసుకున్నారు. వాటి ద్వారా లక్షలాది రూపాయలు వెనుకేసుకున్నారు. విషయం తెలిసినా అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడలేదు. వాస్తవానికి ఇబ్రహీంపట్నం ఇప్పటికే కాలుష్య కోరల్లో కూరుకుపోయింది. వీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నాన్ని కాలుష్యం చుట్టేస్తుండగా వైసీపీ నేతలు దానికి ఆద్యం పోశారు. జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ భర్త గరికపాటి రాంబాబు, మూలపాడు ఎంపీటీసీ భర్త గొట్టిముక్కల పోతురాజు ఇక్కడ ఇటుక బట్టీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన కొంతమంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో బట్టీల డొంక కదిలింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. భూగర్భ గనుల శాఖలోని విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులతో విచారణ చేయించారు. గరికపాటి రాంబాబుకు గడచిన నెల 29వ తేదీన ఇబ్రహీపట్నం తహసీల్దార్ నోటీసు జారీచేశారు. ఆయన ఈనెల ఒకటో తేదీన నోటీసు తీసుకున్నారు. రెండు రోజుల్లో బట్టీలను ఖాళీచేయాలని నోటీసుల్లో ఆదేశించారు. అయినా లెక్కచేయకుండా యధావిధిగా బట్టీలను నిర్వహిస్తున్నాడు. మొత్తం పది అనధికార బట్టీలు ఉన్నట్టు గుర్తించారు. వాటిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు.
3 లక్షల ఇటుకలు సీజ్
ఇబ్రహీంపట్నం : లంక భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. జెట్టి శ్రీను అనే లంక భూముల సభ్యుడి ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగి చర్యలకు పూనుకున్నారు. తమ భూముల్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తూ ఖాళీ చేయకుండా ఐదేళ్లుగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు. మూలపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేత జడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి భర్త గరికపాటి రాంబాబుకు చెందిన సుమారు 3 లక్షల ఇటుకలను సీజ్ చేసినట్టు ఆర్‌ఐ వి.గోపి తెలిపారు.