Share News

చెత్త కష్టాలు

ABN , Publish Date - May 23 , 2024 | 01:03 AM

చెత్తపన్నును బలవంతంగా వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ చెత్తను సేకరించే వాహన డ్రైవర్లకు జీతాలు చెల్లించడంలో మాత్రం పాలకులు చూపట్లేదు. డ్రైవర్లకు జీతాలు నిలిపివేయడంతో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో నగరంలో 700 టన్నుల చెత్త పేరుకుపోయింది.

చెత్త కష్టాలు
వన్‌టౌన్‌లోని టైలర్‌పేట జోడుబొమ్మల సెంటర్‌లో పేరుకుపోయిన చెత్త

విధులకు రాకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే..

వారం రోజులుగా చెత్త సేకరణ నిలిపివేత

నగరంలో పేరుకుపోయిన 700 టన్నుల చెత్త

(విజయవాడ-ఆంధ్రజ్యోతి/చిట్టినగర్‌) : రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం సీఎన్‌జీ వాహనాలను కేటాయించింది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 225, మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 42, గుడివాడ మున్సిపాలిటీకి 31, వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీకి 42 వాహనాలు కేటాయించారు. వీటిద్వారా ఇంటింటి చెత్త సేకరణ నెపంతో చెత్తపన్ను వసూలు చేయడం ప్రారంభించారు. అయితే, పన్ను వసూలు చేయడంపై ఉన్న దృష్టి క్లాప్‌ వాహన డ్రైవర్లకు జీతాల చెల్లింపుపై చూపట్లేదు. దీంతో విజయవాడ కార్పొరేషన్‌లో 225 వాహనాల నిర్వహణ, జీతాలకు అవసరమయ్యే రూ.1.28 కోట్లు చెల్లించలేదు. ఈ మొత్తాన్ని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) చెల్లించాల్సి ఉంది. విజయవాడ కార్పొరేషన్‌తో పాటు వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీలోనూ నిర్వహణ, జీతాల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో వాహన డ్రైవర్లు విధులు బహిష్కరించారు. విజయవాడ నగరంలో 225 వాహనాల ద్వారా రోజూ సుమారు 300 టన్నుల చెత్తను సేకరించి తరలిస్తారు. వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీలో 30 టన్నుల వరకు సేకరిస్తారు. వారం రోజులుగా క్లాప్‌ వాహనాల డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో నగరంలో సుమారు 700 టన్నుల చెత్త పేరుకుపోయింది. వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. క్లాప్‌ వాహనాలను స్వయంభు ఏజెన్సీ నిర్వహిస్తోంది. ప్రతినెలా సీడీఎంఏ ద్వారా ఏజెన్సీకి చెల్లింపులు జరగాలి. అయితే, గతనెల నిర్వహణ, వేతనాలు చెల్లించలేదు. బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, వేతనాలు పెంచాలని క్లాప్‌ వాహనాల డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం : రత్నావళి, సీహెచ్‌ఎంవో

నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం చర్యలు తీసుకుంటోంది. చెత్తను తరలించేందుకు మూడు సర్కిళ్లకు ఐదు ప్రైవేట్‌ ట్రాక్టర్ల చొప్పున ఏర్పాటు చేశాం. వీఎంసీ టిప్పర్లతో పాటు ట్రాక్టర్లతో చెత్తను తరలిస్తాం. డ్రైవర్లకు జీతాలు అందేలా కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. సీడీఎంఏ అధికారులతో మాట్లాడుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 01:03 AM