Share News

బదిలీ బేరాలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:56 AM

సబ్‌ రిజిస్ర్టార్ల బదిలీల్లో రాజకీయ ప్రమేయం కనిపిస్తోంది. బదిలీల ముసుగులో రూ.కోట్లలో బేరాలు సాగిస్తున్నారు. విజయవాడ నగరం, శివారు ప్రాంతాల పరిధిలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ భారీగానే దండుకుంటున్నారు.

బదిలీ బేరాలు

  • రూ.కోట్లు పలుకుతున్న హాట్‌ సీట్లు

  • పటమటకు రూ.3 కోట్లు, గాంధీనగర్‌, గుణదలకు రూ.4 కోట్ల చొప్పున..

  • విజయవాడ రూరల్‌, ఇబ్రహీంపట్నం, గన్నవరం పోస్టులకు రూ.కోటి చొప్పున..

  • చక్రం తిప్పుతున్న రాజకీయ పెద్దలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని పటమట, గుణదల, గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ర్టార్లను కదిలించేందుకు రంగం సిద్ధం కాగా, గ్రేటర్‌ విలీన జాబితా ప్రతిపాదనలో ఉన్న ప్రాంతాలు, ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్ల అలైన్‌మెంట్‌ పరిధిలోకి వచ్చే సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టులకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు. ఒక్కో పోస్టుకు భారీగా బేరాలు సాగిస్తున్నారు.

గుణదల, గాంధీనగర్‌కు డిమాండ్‌

గుణదల, గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు కూడా విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ కార్యాలయాల్లో పోస్టింగ్‌ కోసం రూ.2 కోట్ల ధర నిర్ణయించినట్టు సమాచారం. ఈ రెండు కార్యాలయాల్లో మొత్తం నలుగురు సబ్‌ రిజిస్ర్టార్లు ఉంటారు. జాయింట్‌-1, 2 సబ్‌ రిజిస్ర్టార్లకు సమంగా చెరి రూ.2 కోట్ల మేర ధర నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఒక్కో కార్యాలయానికి రూ.4 కోట్ల వరకు బేరం నడుస్తున్నట్టుగా సమాచారం. గుణదల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.92.42 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23లో రూ.107.79 కోట్లు, 2023-24లో రూ.138.12 కోట్లు వచ్చింది. దీనిని బట్టి చూస్తే.. రూ.50 కోట్ల మేర ఆదాయం పెరిగింది. లావాదేవీలు కూడా గణనీయంగా జరుగుతున్నాయి. దీంతో గుణదలను కూడా ఈసారి హిట్‌లిస్టులో పెట్టిన ట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే ఒక్క విజయవాడలోని మూడు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలోనే రూ.11 కోట్ల మేర బేరం పెట్టినట్టు సమాచారం.

నున్న, ఇబ్రహీంపట్నం కూడా..

విజయవాడ రూరల్‌ ప్రాంతంలోని నున్న సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టుకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. ఇక్కడి పోస్టుకు రూ.కోటి బేరం పెట్టినట్టు సమాచారం. విజయవాడ మీదుగా బైపాస్‌ వెళ్లడం, రానున్న రోజుల్లో నాగపూర్‌-ముంబయి ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పనులు జరుగుతుండటం, సీఆర్‌డీఏ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకుని నున్నకు డిమాండ్‌ను సృష్టించారు. నున్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.62.59 కోట్ల ఆదాయం వచ్చింది. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టును కూడా ఇన్నర్‌, ఎన్‌హెచ్‌-30, అవుటర్‌ రింగ్‌ తదితరాలను దృష్టిలో ఉంచుకుని భారీగా పెంచారు. ఇబ్రహీంపట్నం పోస్టుకు కూడా రూ.కోటి ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది.

గన్నవరానికి కూడా గిరాకీ

కృష్ణాజిల్లా పరిధిలోని గన్నవరం సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టుకు కూడా బేరం పెట్టడం గమనార్హం. గన్నవరం ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియా పరిధిలో ఉంది. ఇక్కడ విజయవాడ వెస్ట్‌, ఈస్ట్‌ బైపాస్‌లు, సీఆర్‌డీఏ ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు, ఐటీ సెజ్‌లు, ఇండస్ర్టియల్‌ పార్కుల కారణంగా ఈ ప్రాంతం శరవేగంగా విస్తరిస్తోంది. రియాలిటీ రంగం అనూహ్యంగా పురోగమిస్తోంది. ఈ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ ఆదాయం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.53.64 కోట్లు ఉండగా, 2022-23లో రూ.61.96 కోట్లను సాధించింది. 2023-24లో అయితే రూ.81.18 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లకు చేరవచ్చంటున్నారు. దీంతో గన్నవరం సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టుకు కూడా రూ.కోటి ధర నిర్దేశించినట్టుగా తెలుస్తోంది.

పటమటకు రూ.3 కోట్ల బేరం

ఆప్షన్ల పేరుతో సబ్‌ రిజిస్ర్టార్ల దగ్గర నుంచి రిక్వెస్టులు రాగా, పటమట, గుణదల, గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో మొదటి ఆప్షన్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు రూ.3 కోట్ల వరకు ధర పలుకుతోంది. గతంలో రూ.కోటి, ఆ తర్వాత రూ.2 కోట్ల బేరం ఉన్న ఈ పోస్టు తాజాగా రూ.3 కోట్లకు చేరడం విశేషం. ఈ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు 2021-22లో రూ.148.57 కోట్లు, 2022-23లో రూ.214.39 కోట్లు, 2023-24లో రూ.238.02 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు రూ.100 కోట్ల మేర ఆదాయం పెరిగింది. లావాదేవీలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ కారణంతో ఆదాయం కూడా జాస్తిగా ఉంటుందన్న పేరుతో ఇంత భారీ ధరను నిర్దేశించినట్టుగా తెలుస్తోంది.

Updated Date - Aug 24 , 2024 | 12:56 AM