Share News

మరో ఏడాది..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:34 AM

‘దయచేసి వినండి.. మీకు అత్యవసర ప్రయాణాలుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. ఎందుకంటే మరో ఏడాది పాటు భారీగా రైళ్లు రద్దవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏ రైలు రద్దవుతుందో తెలియని పరిస్థితి. ముందుగా రిజర్వేషన్‌ చేయించుకున్నా సరే.. ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.’ ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌, ట్రాక్‌ మెయింటినెన్స్‌ పనుల పేరిట ఇప్పటికే చాలా రైళ్లను రద్దు చేసిన అధికారులు ఇదే పరిస్థితి మార్చి వరకూ ఉంటుందని చెబుతున్నారు. వందేభారత్‌ రైళ్లకు మాత్రం ఈ రద్దులో మినహాయింపు ఇవ్వడం కొసమెరుపు.

మరో ఏడాది..!

  • విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో పనుల వల్లే..

  • ఇప్పటికే భారీగా రైళ్లను రద్దు చేసిన అధికారులు

  • వచ్చే మార్చి వరకూ తప్పదని వెల్లడి

  • వాస్తవానికి అంత అవసరం లేదు..!

  • అయినా ఇష్టానుసారంగా రద్దు నిర్ణయాలు

  • వందేభారత్‌ రైళ్లకు మాత్రం మినహాయింపు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌, ట్రాక్‌ మెయింటినెన్స్‌ పనులు వచ్చే ఏడాది అంటే.. 2025-మార్చి వరకు జరుగుతాయి. ఇది రైల్వే అధికారుల ప్రాథమిక అంచనా మాత్రమే. ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉందే తప్ప, తగ్గే అవకాశమైతే లేదు. కాబట్టి అత్యవసర ప్రయాణాలు చేసేవారు రైళ్లను నమ్ముకుంటే ఇబ్బందుల్లో పడతారు. విజయవాడ-దువ్వాడ సెక్షన్‌ మొత్తం 330 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌, ట్రాక్‌ మెయింటినెన్స్‌ పనులను రైల్వే అధికారులు ప్రారంభించారు. కానీ, ఈ పనులు చేయడానికి భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ రైళ్ల రద్దులో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

ఏడాది పాటు ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ పనులు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో మనుషులతో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ విధానాన్ని అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. మొత్తం 330 కిలోమీటర్లలో ఆరు నెలలుగా 55 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ పనులు చేపట్టారు. మిగిలిన 275 కిలోమీటర్లలో పనులు చేపట్టాలంటే కనీసం వచ్చే మార్చి వరకూ సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వల్ల ఈ సెక్షన్‌లో మరింత వేగంగా, సమర్థవంతంగా, భారీ సంఖ్యలో రైళ్లను నిరంతరాయంగా నడపవచ్చంటున్నారు.

అసంపూర్తిగా మెయింటినెన్స్‌ పనులు

విజయవాడ-విశాఖపట్నం సెక్షన్‌లో మెయింటినెన్స్‌ పనులు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. పలుచోట్ల అసంపూర్తిగానే ఉన్నాయి. విజయవాడ-నిడదవోలు మధ్య 4.98 కిలోమీటర్లు, నిడదవోలు-సామర్లకోట 4.10 కిలోమీటర్లు, సామర్లకోట-దువ్వాడ 5.52 కిలోమీటర్ల మేర మొత్తం 14.61 కిలోమీటర్ల మేర పూర్తి చేయాల్సి ఉంది. ట్రాక్‌ మెయింటినెన్స్‌ పనుల్లో కొంత పురోగతి ఉంది. నిడదవోలు-సామర్లకోట 39.61 కిలోమీటర్లు, సామర్లకోట-దువ్వాడ 27.40 కిలోమీటర్లు వెరసి 67.02 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. అలాగే, ఇదే సెక్షన్‌లో డీప్‌ స్ర్కీనింగ్‌ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. విజయవాడ-నిడదవోలు 11.05 కిలోమీటర్లు, నిడదవోలు-సామర్లకోట 27.87 కిలోమీటర్లు, సామర్లకోట-దువ్వాడ 42.51 కిలోమీటర్ల మేర మొత్తంగా 81.89 కిలోమీటర్ల మేర చేపట్టాల్సి ఉంది.

విజయవాడ-గూడూరు మూడోలైన్‌ కమిషన్‌ పనులు

విజయవాడ డివిజన్‌ పరిధిలో బెజవాడ-గూడూరు మూడోలైన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 85 కిలోమీటర్ల మేర పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ కారణంగా గూడూరు వైపు వెళ్లే రైళ్లను కూడా రద్దు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టుకు విజయవాడ-రాయనపాడు మధ్య థర్డ్‌లైన్‌ కమిషన్‌ పనులు పూర్తవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:34 AM