జిల్లా అభివృద్ధి కోసం కలిసికట్టుగా..
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:10 AM
జిల్లా అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాలని జడ్పీ సభ్యులు నిర్ణయించారు. మచిలీపట్నంలో శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగ్గా, ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన సాగునీటిని సక్రమంగా విడుదల చేయాలని, నీటిపారుదల శాఖ అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు.. అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులపైనే గడిచినా అధికారులు మాట వినడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వెలిబుచ్చగా, ఆయా మండలాల్లో సమస్యలను జడ్పీ సభ్యులు ఏకరువు పెట్టారు.

కొందరు అధికారుల తీరు మారాల్సిందే..
కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఎమ్మెల్యేల మాట వినరెందుకు..?
సాగు, తాగునీరు అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లండి
పాఠశాల భవన నిర్మాణాలపై నిర్లక్ష్యమేల..?
తీరప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు ఇస్తాం..
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు
జిల్లా అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాలని జడ్పీ సభ్యులు నిర్ణయించారు. మచిలీపట్నంలో శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగ్గా, ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన సాగునీటిని సక్రమంగా విడుదల చేయాలని, నీటిపారుదల శాఖ అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు.. అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులపైనే గడిచినా అధికారులు మాట వినడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వెలిబుచ్చగా, ఆయా మండలాల్లో సమస్యలను జడ్పీ సభ్యులు ఏకరువు పెట్టారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : తొలుత భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతికి జడ్పీ సమావేశం నివాళులర్పించింది. స్థానిక జడ్పీ కన్వెన్షన్ హాల్లో చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన శనివారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జడ్పీ ఇన్‌చార్జి సీఈవో పాల్గొన్నారు. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.
ప్రజల నమ్మకానికి అనుగుణంగా..
గ్రామస్థాయిలో ఉపాధి హామీ సిబ్బందిని, డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే మహిళా సిబ్బందిని అకారణంగా తొలగిస్తున్నారంటూ ఒకానొక దశలో వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు రచ్చ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఉద్యోగుల తొలగింపునకు అనేక కారణాలు ఉన్నాయని, ఈ అంశాన్ని ఎవరూ రాద్ధాంతం చేయొద్దన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కూటమి అభ్యర్థులను గెలిపించారని, వారి నమ్మకానికి అనుగుణంగా పరిపాలనను కొనసాగించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సహకారంతో మచిలీపట్నంలో రూ.70 వేల కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
పాఠశాలలకు భవనాలు లేకున్నా పట్టించుకోరా..
విద్యాశాఖపై జరిగిన సమీక్షలో పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాఠశాలల దుస్థితిపై గళమెత్తారు. పెదపారుపూడి మండలం కొర్నిపాడు గ్రామంలో పాఠశాల భవనం నిర్మించకుండా ఏడాదిగా జాప్యం చేస్తున్నారని, బంటుమిల్లి మండలం ములపర్రులోని పాఠశాలకు భవనం లేకపోవడంతో చర్చిలో నడుపుతున్నారని, బండ్లగూడెం గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి స్థలం ఇచ్చినా నిర్మాణం చేపట్టలేదని ఆయా మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వివరించారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లిలో పాఠశాల భవనం లేదని కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు తెలిపారు. వత్సవాయి మండలం భీమవరం పాఠశాలలో టాయిలెట్లు లేవని ఎంపీపీ తెలియజేశారు. నందివాడ మండలం పెదలింగాల పాఠశాలకు వెళ్లే రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరిందని, నూతన వంతెన నిర్మించకుండా జాప్యం చేస్తున్నారని నందివాడ ఎంపీపీ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పామర్రు, మొవ్వ, గూడూరు మండలాల్లో బీసీ వసతి గృహాల వార్డెన్లకు ఎక్కడెక్కడో అదనపు బాధ్యతలు కల్పించారని సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ పాఠశాలలకు సంబంధించిన భవనాలను త్వరగా పూర్తిచేస్తామన్నారు. గుడివాడ ఏరియా ఆసుపత్రిలో ఇటీవల ఇద్దరు బాలింతలు చనిపోయినా వైద్యశాఖ అధికారులు పట్టించుకోలేదని, కనీస విచారణ కూడా చేయలేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నిమ్మకూరు పాఠశాలలో లెక్కల మాస్టారును నియమించాలని విద్యాశాఖ అధికారులకు ఏడుసార్లు ఫోన్ చేసినా, మూడు సార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడంలేదని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పేర్కొన్నారు.
సాగునీటి విడుదలపై ముందుచూపు లేకుంటే ఎలా..?
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సాగునీటి విడుదల అస్తవ్యస్తంగా ఉందని, పామర్రు నియోజకవర్గంలో నాట్లు వేసిన, వేయబోయే పొలాలకు సక్రమంగా సాగునీటిని అందించాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పేర్కొన్నారు. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన కిక్కిస, గుర్రపుడెక్క, నాచులను తొలగించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గూడూరు మండలం కంకటావ గ్రామం వద్ద పంటకాల్వపై ఉన్న వంతెన పడిపోయిందని, తూములు ఏర్పాటుచేసినా, అవి పూడుకుపోయి సాగునీరు దిగువకు రావడం లేదని, నూతన వంతెనను నిర్మించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి విడుదల సక్రమంగా లేదని, భారీ వర్షాలు కురిస్తే కాల్వలను కట్టేసి, అనంతరం రోజుల తరబడి నీటిని విడుదల చేయకుండా నిలిపివేయడంతో నాట్లు వేసిన పొలాలకు, వేయబోయే పొలాలకు సాగునీరు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వరినాట్లు, నారుమడులు పోసుకునే పనులు నిలిచిపోతున్నాయని, ఇదేం పద్ధతి అని ఎమ్మెల్యేలు అధికారులను నిలదీశారు. దీంతోపాటు తాగునీటి చెరువులను కూడా సక్రమంగా నింపలేదని, ప్రధాన పంటకాల్వల్లో, డ్రెయిన్లలో పూడికతీత పనులు కూడా సక్రమంగా చేయడం లేదని ఎమ్మెల్యేలు, పలువురు జడ్పీటీసీ సభ్యులు.. సమావేశం దృష్టికి తెచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారులు ముందుచూపుతో వ్యవహరించి జిల్లాలో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ కాల్వల నిర్వహణ పనులకు రూ.50 కోట్ల అంచనాతో నివేదికలు పంపగా, రూ.26 కోట్ల పనులకే ఆమోదం లభించింద న్నారు. అనుమతులు ఇచ్చిన కాల్వల నిర్వహణ పనులను తానే బాధ్యత తీసుకుని చేయిస్తానన్నారు. వీటికి కాంట్రాక్టు పనులను అప్పగించేందుకు ఇంకా పూర్తిస్థాయి ఆమోదం రాలేదని నీటిపారు దల శాఖ అధికారులు తెలిపారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల పరిధిలో జాతీయ రహదారి 216పై ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్నాయని, ఆయా ప్రాంతాల్లో వాహనాల వేగం తగ్గించేందుకు పోలీస్ పెట్రోలింగ్, బారికేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి కొల్లు సూచించారు. తోట్లవల్లూరు నుంచి రొయ్యూరు వరకు కరకట్టకు ఇరువైపులా ముళ్లచెట్లు పెరిగి వాహనాల రాకపోకలకు అంతరాయంగా ఉందని, వాటిని తొలగించాలని తోట్లవల్లూరు జడ్పీటీ సీ సభ్యుడు అధికారులను కోరారు. పలు అభివృద్ధి పనుల నిమిత్తం జడ్పీటీసీ సభ్యులకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయి స్తారని, పలు పనులు చేసి ఎం-బుక్‌లో రికార్డు చేసినా బిల్లులు మం జూరు చేయడంలేదని సభ్యులు జడ్పీ చైర్‌పర్సన్ హారిక దృష్టికి తీసు కొచ్చారు. ఆమె మాట్లాడుతూ బిల్లులు త్వరలో చేయిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో తాగునీటి పథకాల నిమిత్తం జడ్పీ నుంచి ఏడాదికి రూ.39.50 కోట్లను మంజూరు చేస్తున్నా తాగునీటిని సక్ర మంగా అందించకపోవడం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యమేనన్నారు.