Share News

నేడే నగారా

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:29 AM

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మొదటి అడుగు పడనుంది. కీలక ఘట్టమైన ఎలక్షన్‌ షెడ్యూల్‌ శనివారం విడుదలకానుంది. దీంతో రెండు జిల్లాల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఓవైపు మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో పదింటికి టీడీపీ అభ్యర్థులు ఖరారు కాగా, వైసీపీ 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక రెండు పార్లమెంట్‌ స్థానాలకూ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టే. ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేయడం మొదలు ఎవరి ప్రయత్నాలు వారు చేయడానికి రాజకీయ నాయకులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

నేడే నగారా

రెండు జిల్లాల్లో రాజుకున్న ఎన్నికల వేడి

నేటి షెడ్యూల్‌ కోసం ఎదురుచూపులు

ఇప్పటికే 10 స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు

పెండింగ్‌లో 2 స్థానాలు.. మిత్రపక్షాలకు మరో 2

విజయవాడ పశ్చిమ బీజేపీకే.. అవనిగడ్డ జనసేనకు..

మైలవరం, పెనమలూరులో ఇంకా వీడని సస్పెన్స్‌

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

రెండు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మొదటి అడుగు పడనుంది. కీలక ఘట్టమైన ఎలక్షన్‌ షెడ్యూల్‌ శనివారం విడుదలకానుంది. దీంతో రెండు జిల్లాల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఓవైపు మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో పదింటికి టీడీపీ అభ్యర్థులు ఖరారు కాగా, వైసీపీ 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక రెండు పార్లమెంట్‌ స్థానాలకూ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టే. ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేయడం మొదలు ఎవరి ప్రయత్నాలు వారు చేయడానికి రాజకీయ నాయకులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో రెండు పార్లమెంట్‌, 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి అభ్యర్థులను బరిలో దింపుతుండగా, వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో టీడీపీ ముందంజలో ఉంది. రెండు జిల్లాల్లో 12 స్థానాల నుంచి టీడీపీ పోటీ చేస్తుండగా, రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. విజయవాడ పశ్చిమలో బీజేపీ, అవనిగడ్డలో జనసేన పోటీ చేయనున్నాయి. టీడీపీ పోటీ చేయనున్న పెనమలూరు, మైలవరం స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ, జనసేన అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. మచిలీపట్నం

పార్లమెంట్‌ స్థానం నుంచి జనసేన, విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ బరిలో నిలవనున్నాయి. మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని దాదాపు ఖరారైనట్టే. ఇక వైసీపీ విషయానికొస్తే.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్‌, విజయవాడ ఎంపీగా కేశినేని నాని పేర్లు ఖరారయ్యాయి. అసెంబ్లీ స్థానాలకు వస్తే.. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ, తిరువూరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, గుడివాడ, గన్నవరం, పామర్రు, విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట, నందిగామ స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది.

అన్నదమ్ముల సవాల్‌

విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా కేశినాని నాని వరుసగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు. గత రెండు సార్లు టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన నాని ఈసారి వైసీపీ తరఫున బరిలో దిగుతున్నారు. నానీకి ప్రత్యర్థిగా ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని బరిలో నిలవడంతో విజయవాడ స్థానం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏడాదిగా సేవా కార్యక్రమాలతో విజయవాడ పార్లమెంట్‌ ప్రజలకు చేరువైన చిన్ని నెల రోజులుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక మచిలీపట్నం పార్లమెంట్‌ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి రెండోసారి బరిలో నిలుస్తున్నారు. ఈయన కూడా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపు సాధించగా, ఈసారి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ పోటీలో ఉన్నారు.

ఊపిరి పోసుకుంటున్న కాంగ్రెస్‌

ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, వైసీపీకి నడుమ ఉండనుంది. గత రెండు ఎన్నికల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ ఈసారి కాస్త ఊపిరిపోసుకుంటోంది. వైసీపీ అధినేత జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ పార్టీ కాస్త కోలుకుంది. విజయవాడ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు వల్లూరు అశోక్‌, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు, బొర్రా కిరణ్‌ దరఖాస్తు చేసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నుంచి పోటీ చేసేందుకు చలమలశెట్టి ఆదికిరణ్‌, బొల్లి కృష్ణ దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 01:29 AM