ప్రమాదాలకు దారిచూపేలా..
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:49 AM
నగరంలో కార్లు, ద్విచక్రవాహనాలు అనే తేడా లేకుండా ఎల్‌ఈడీ లైట్ల వినియోగం పెరిగిపోతోంది. వాహనాల రీమోడలింగ్‌లో భాగంగా హెడ్ లైట్ల కోసం ఎల్‌ఈడీ బల్బులను వినియోగిస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్ల వినియోగాన్ని అధికారులు నియంత్రించలేకపోవడంతో రీమోడలింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కువ కాంతినిచ్చే ఎల్‌ఈడీ లైట్ల వినియోగంలో నియంత్రణ ఉంది. కానీ అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అధిక సంఖ్యలో వాహనదారులు కంపెనీ అమర్చిన లైట్లు కాకుండా రెండు హెడ్‌లైట్లకు మధ్య ఎక్కువ కాంతినిచ్చే ఎల్‌ఈడీ లైట్లు అమరుస్తున్నారు. ఇలా అమర్చడం మోటార్ వెహికల్ యాక్టు ఉల్లంఘన అవుతుంది.

వాహనాల్లో హైబీమ్ ఎల్‌ఈడీ లైట్ల వినియోగం
లైట్ల నుంచి వస్తున్న కాంతి తీవ్రతకు ఎదురుగా వస్తున్న
వాహనదారులకు మసకబారుతున్న కళ్లు
మోటార్ వెహికల్ యాక్టు ఉల్లంఘిస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
(ఆంధ్రజ్యోతి-ఆటోనగర్): నగరంలో కొందరు వాహనయజమానులు కొత్తగా తీసుకున్న కార్లకు, ద్విచక్ర వాహనాలకు ఇష్టారీతిన రీమోడలింగ్ చేసేస్తున్నారు. బీఎస్-6 వాహనాలకు హెడ్‌లైట్లు మార్చే అవకాశం లేదు. దీంతో కొందరు అదనపు లైట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కంపెనీలు తయారు చేసి ఇచ్చే ఎల్‌ఈడీ లైట్ల వల్ల ఎలాంటి సమస్య ఉండదని, రీమోడలింగ్ పేరుతోనో, లైటింగ్ సరిగా లేదనో మార్చుకునే అధిక కాంతినిచ్చే లైట్ల వల్లేనే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇన్సూరెన్స్ క్లయిమ్‌లో ఇబ్బందులు
ఎల్‌ఈడీ లైట్ల వల్ల ఇన్సూరెన్స్ క్లయిమ్‌లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నా యి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు నియమ నిబంధనలు ప్రకారం క్లయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నాయి. సాధారణ ఎల్‌ఈడీ లైట్ల అమరికలో వాహనదారులు, తయారీ సంస్థలకూ ఎలాంటి ఆంక్షలు లేవు.
ఎల్‌ఈడీల వాడకం పెరగడానికి కారణాలు
ఎల్‌ఈడీ హెడ్‌లైట్లను వినియోగించడం వల్ల దూరంగా ఉన్నవి స్పష్టంగా కనిపిస్తాయని, బ్యాటరీ పవర్ ఆదా అవుతోందని ఎల్‌ఈడీ లైట్ల వోల్ట్స్‌ని బట్టి బ్యాటరీ వినియోగం మారుతుందని వాహనదారులు చెబుతున్నారు. కానీ, ఎక్కువ వోల్ట్స్ పవర్ ఉన్న లైట్లను వినియోగిస్తే బ్యాటరీల మన్నిక తగ్గుతుందని మైకానిక్‌లు చెబుతున్నారు. కొంతమంది తమ వాహనాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ లైటింగ్ సిస్టమ్‌ను వాడుతున్నారు. కార్ల లోపల రీమోడలింగ్ చేయిస్తున్నారు. వాహనంలో గీతాలు వినేటప్పుడు శబ్ధానికి అనుగుణంగా లైట్లు వెలి గేలా మార్పులు చేయిస్తున్నారు. కార్ల కంపెనీలు అందించే ఫాగ్ ఎల్‌ఈడీ ల్యాంపులు సైతం మార్చేస్తున్నారు. తమ వాహనాలు ఆకర్షణీయంగా కనిపించాలని హంగులు ఆర్భాటాలతో ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు.
హైబీమ్ ఎల్‌ఈడీ లైట్లతో ప్రమాదమే..
రాత్రి వేళల్లో సింగిల్ రహదారిలో ఎక్కువ కాంతినిచ్చే ఎల్‌ఈడీ లైట్లున్న వాహనాలు వచ్చినప్పుడు కళ్లు మసకబారి ఎదురుగా వచ్చే డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటారు. వేగంగా వెళ్లేటప్పుడు వాహనాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. దీంతో కొంతమంది వాహనదారులు ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడం, మరికొంత మంది వేగాన్ని నియంత్రిచడానికి రహదారి పక్కకు వెళ్లడం జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనదారులు లోబీమ్ లైట్లను వినియోగిస్తే ప్రమాదాలు నియంత్రించవచ్చని చెబుతున్నారు.
లైటింగ్ సిస్టం బాగున్నా..కావాలనే పెట్టుకుంటున్నారు
కొత్త రకం కార్లకు లైటింగ్ సిస్టం బాగానే ఉంటుంది. కానీ కొంతమంది ఎక్కువ కాంతినిచ్చే లైట్లు కావాలని మార్చుకుంటారు. ఇప్పుడు వస్తున్న వాహనాలకు హెడ్‌లైట్లు మార్చడం కుదరదు. కానీ ఎక్కువ కాంతినిచ్చే లైట్లను విడిగా అమర్చవచ్చు. దీనిపైన మాకు ఎలాంటి నియంత్రణ ఉండదు. ఎల్‌ఈడీ బల్బుల్లో మోడల్, వోల్ట్స్‌ని బట్టి వాటి ధర రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. లగ్జరీ కార్లకు ఇంటీరియల్ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టుకుంటున్నారు.
-సంతోష్, మైకానిక్
ప్రమాదమే.. అయినా వినియోగదారులు పట్టించుకోరు
ఎల్‌ఈడీ బల్బులు కేవలం కాంతి కోసమే వినియోగించడం లేదు. బయట బిగించే లైటింగ్ ఆకర్షణీయంగా ఉండాలని, వాహనం కదిలినప్పుడు ఓ రకం గా, పాటలు వినేటప్పుడు మరో రకంగా వెలిగేలా ఉండాలని, ఇతరులు తమ వాహనం వెళ్తుంటే చూడాలని వినియోగదారుడు కోరుకుంటున్నాడు. అందు కోసమే ఎల్‌ఈడీ బల్బులు పెట్టుకుంటున్నారు. వినియోగదారులను సంతృప్తి పరచడమే మా ప్రాధాన్యం. ఎల్‌ఈడీ లైటింగ్ వల్ల ఇతరుల ప్రాణాలకు ప్రమాదమే. కానీ వినియోగదారులు అది ఆలోచించరు.
-మహేశ్వరరావు, మైకానిక్