Share News

బెదిరించి నా తల్లిని చంపేశారు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:43 AM

బేవరేజెస్‌ గోడౌన్‌ కాంట్రాక్టు విషయంలో తన తల్లి సీతామహాలక్ష్మిని వైసీపీ ప్రభుత్వంలో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరులు బెదిరించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీంతో ఆమె మనస్తాపంతో మృతి చెందారని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ కాంట్రాక్టర్‌ దుగ్గిరాల ప్రభాకర్‌ ఆరోపించారు.

బెదిరించి నా తల్లిని చంపేశారు

  • నిబంధనలు తుంగలో తొక్కి గోడౌన్‌ కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు

  • ఎండీ వాసుదేవరెడ్డి, కొడాలి, అప్పటి జేసీ మాధవీలత రెడ్డి బాధ్యులు

  • పూర్తి ఆధారాలతో సిట్‌కు అందజేశా

  • బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ కాంట్రాక్టర్‌ దుగ్గిరాల ప్రభాకర్‌ వెల్లడి

గుడివాడ : బేవరేజెస్‌ గోడౌన్‌ కాంట్రాక్టు విషయంలో తన తల్లి సీతామహాలక్ష్మిని వైసీపీ ప్రభుత్వంలో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరులు బెదిరించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీంతో ఆమె మనస్తాపంతో మృతి చెందారని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ కాంట్రాక్టర్‌ దుగ్గిరాల ప్రభాకర్‌ ఆరోపించారు. గుడివాడ ఆటోనగర్‌లో గురువారం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడారు. బేవరేజెస్‌ గోడౌన్‌ విషయంలో అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, నాటి జేసీ మాధవిలతారెడ్డి చేసిన అవినీతిపై సిట్‌కు ఫిర్యాదు చేశానన్నారు. బహిరంగ టెండర్‌ ద్వారా చదరపు అడుగు కేవలం రూ.4లకు బేవరేజెస్‌ గోడౌన్‌ కాంట్రాక్టును తన తల్లి దక్కించుకున్నారన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టు కాలపరిమితి కాకుండానే గోడౌన్‌ను అక్రమంగా తరలించారన్నారు. పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వాసుదేవరెడ్డి తన తల్లిని, తనను తీవ్రంగా దుర్భ లాషలాడారన్నారు. అప్పట్లో ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్‌ తనను ఫోన్‌లో బెదిరించారన్నారు. తనను, తన కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసేలా ఎమ్మెల్యే నాని గడ్డం గ్యాంగ్‌తో గోడౌన్‌లోని లిక్కర్‌ కేసులను పగులకొట్టి తగులబెట్టారని ఆరోపించారు. నందిపాటి పద్మారెడ్డికి చెందిన నందివాడ మండలం జొన్నపాడులోని శ్రీవంశీరామ్‌ ఎంటర్‌ప్రైజె్‌సకు గోడౌన్‌ కాంట్రాక్టును దక్కేలా చేశారన్నారు. పద్మారెడ్డికి బేవరేజ్‌స్‌ కార్పొరేషన్‌ ప్రతినెలా రూ.1.20 లక్షలు అదనంగా చెల్లించిందన్నారు. మొత్తం వ్యవహారంలో పద్మారెడ్డితో పాటు అతని అల్లుడు ఐఆర్‌ఎస్‌ కర్రి రామ్‌గోపాల్‌రెడ్డి కూడా భాగస్వామ్యుడని, కార్పొరేషన్‌ సొమ్మును ఇష్టానుసారంగా దోచేశారన్నారు. లక్షలాది రూపాయల కుంభకోణాన్ని పూర్తి ఆధారాలతో సిట్‌కు అందజేశానని దుగ్గిరాల ప్రభాకర్‌ వివరించారు.

Updated Date - Jul 05 , 2024 | 12:43 AM