Share News

చెట్లను చంపేశారు..!

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:16 AM

పచ్చగా కళకళలాడే ప్రాంతమది. భారీ చెట్లు.. కావాల్సినంత నీడ.. మండుటెండల్లో చిరువ్యాపారులతో పాటు వాహనచోదకులను సేదతీర్చే వృక్షరాజాలను కేవలం సీఎం జగన్‌ గంట పర్యటన కోసం ఇలా చంపేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శనివారం నగరానికి రానున్నారు.

చెట్లను చంపేశారు..!

నేడు నగరంలో సీఎం జగన్‌ పర్యటన

అడ్డుగా ఉన్నాయని నీడనిచ్చే వృక్షాల నరికివేత

లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు

ఇదేం పైశాచికమంటున్న స్థానికులు

లబ్బీపేట/అజిత్‌సింగ్‌నగర్‌, ఏప్రిల్‌ 12 : పచ్చగా కళకళలాడే ప్రాంతమది. భారీ చెట్లు.. కావాల్సినంత నీడ.. మండుటెండల్లో చిరువ్యాపారులతో పాటు వాహనచోదకులను సేదతీర్చే వృక్షరాజాలను కేవలం సీఎం జగన్‌ గంట పర్యటన కోసం ఇలా చంపేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శనివారం నగరానికి రానున్నారు. వారధి నుంచి పశువుల ఆసుపత్రి మీదుగా స్టేడియం పక్కన వాటర్‌ ట్యాంక్‌ రోడ్డు నుంచి సెంట్రల్‌ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఇందుకోసం శుక్రవారం స్థానిక వాటర్‌ ట్యాంక్‌ రోడ్డులో చెట్లను నరికేశారు. ఈ రోడ్డు చెట్ల నీడకు ఎంతో ప్రసిద్ధి. ఎంతోమంది చిరువ్యాపారులు వీటి కిందే జీవనోపాధి పొందుతున్నారు. అసలే వేసవి కావడం, ఎండలు మండుతుండటంతో చెట్ల నీడలో ఉపశమనం పొందుతున్నారు. అటువంటి చెట్లను అడ్డగోలుగా నరికేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అడ్డుగా వస్తే రోడ్డుపై వాలిన కొమ్మలను తొలగిస్తే సరిపోయేదని, ఏళ్లుగా నీడనిస్తున్న చెట్లను నరికేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ చెట్లను నరికేస్తున్న సమయంలో స్థానికులు కొందరు ప్రశ్నించగా, వారికి సరైన సమాధానం కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో పర్యటిస్తున్నందున చెట్లను నరికేయాల్సిన అవసరం ఏముందని, ఒక చెట్టు పెరగాలంటే ఏళ్లు పడుతుందని, అటువంటి చెట్లను కేవలం గంట పర్యటన కోసం నరికేయడం దుర్మార్గమని, ఇటువంటి ప్రజావ్యతిరేక కార్యక్రమాలు మానుకుని చల్లటి నీడతో పాటు ఆక్సిజన్‌ను అందించే చెట్లను పెంచితే మంచిదని స్థానికులు హితవు పలుకుతున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 01:16 AM