గాంధీ బ్యాంకుపై ఆరోపణల్లో నిజం లేదు
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:54 AM
వేలాది మంది ఖాతాదారులతో గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకమండలి చెలగాటమాడుతోంది. పాలకమండలి సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. ఆరోపణలతో బ్యాంకు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
వేలాది మంది ఖాతాదారులతో గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకమండలి చెలగాటమాడుతోంది. పాలకమండలి సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. ఆరోపణలతో బ్యాంకు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చైర్మన్‌పై పాలకమండలి సభ్యులు ఏడుగురు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడంతో పాలకమండలి నడుమ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు (చిన్ని) మొదటిసారి తన వాదన వినిపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. తమపై చేసిన ఫిర్యాదులన్నీ ఫోర్జరీ సంతకాలతో చేసినవని, ఇద్దరు డైరెక్టర్లు తాము సంతకాలు పెట్టలేదని చెబుతున్నారంటూ ఆరోపించారు. బ్యాంకుపై వస్తున్న ఆరోపణలు నిజం కావన్నారు. కొత్త శాఖ ఏర్పాటుకు విశాఖపట్నంలో స్థల పరిశీలన పాలకమండలి ఆమోదం మేరకే జరిగిందని చిన్ని తెలిపారు. అంతా నిబంధనల ప్రకారమే చేశామని చెప్పిన ఆయన.. భవన యజమానికి ఒప్పందానికి ముందే డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందన్న దానిపై స్పందించలేదు. విశాఖపట్నంలో కొత్త శాఖకు పాలకవర్గం ఆమోదం తెలిపిన తీర్మానం కాపీని ఇవ్వడానికీ నిరాకరించారు. కొత్త శాఖ ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతి ఉందా అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. కాగా చైర్మన్‌పై అవిశ్వాసం ప్రతిపాదించిన బ్యాంక్ డైరక్టర్లు తల్లాప్రగడ సుబ్బారావు, కళ్లే నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. బ్యాంకులో జరుగుతున్న అవకతవకలపై చైర్మన్ వక్రభాష్యం చెబుతున్నారన్నారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా కొత్త శాఖ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పాలకమండలి సమావేశంలో కొత్త శాఖ ఏర్పాటుకు సంబంధించిన అజెండా అంశం లేదని, అలాంటప్పుడు దానికి ఆమోదం ఎలా ఉందని చెబుతారని నిలదీశారు. బ్యాంకు అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదులపై కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ విచారణ చేస్తుండగా, ఎటువంటి అవకతవకలు జరగలేదని చైర్మన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు.