నాని వెంట నడిచేది లేదు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:44 AM
అరవై శాతం కాదు కదా అరశాతం కూడా నందిగామ నుంచి ఎంపీ కేశినేని నాని వెంట నడిచే పరిస్థితి కనపడటం లేదు. కేశినేని తెలుగుదేశం పార్టీలో ఉండగా నందిగామ నుంచి పలువురు నాయకులు ఆయనతో సన్నిహితంగా ఉండే వారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అరవై శాతం టీడీపీని ఖాళీ చేస్తానని అహంభావంతో ఆయన వ్యాఖ్యానించారు.

నందిగామ, జనవరి 11 : అరవై శాతం కాదు కదా అరశాతం కూడా నందిగామ నుంచి ఎంపీ కేశినేని నాని వెంట నడిచే పరిస్థితి కనపడటం లేదు. కేశినేని తెలుగుదేశం పార్టీలో ఉండగా నందిగామ నుంచి పలువురు నాయకులు ఆయనతో సన్నిహితంగా ఉండే వారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అరవై శాతం టీడీపీని ఖాళీ చేస్తానని అహంభావంతో ఆయన వ్యాఖ్యానించారు. నందిగామ టీడీపీ నుంచి ఆయన వెంట అరశాతం కూడా కదిలే పరిస్థితి కనిపించడడం లేదు. ఎన్టీఆర్ హయాంలో రాష్ట్రంలో చక్రం తిప్పిన వసంత నాగేశ్వరరావు వంటి నేతలు పార్టీ మారిన సమయంలో ఒక్కరు కూడా ఆయన్ను అనుకరించి పార్టీ మారలేదు. కేశినేని పలుమార్లు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, వ్యతిరేక ప్రటనలు చేసిన సమయంలో టీడీపీ కేడర్ భరిస్తూ వచ్చింది. ఏకంగా వైరి పక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆకాశానికి ఎత్తుతూ, స్వపక్ష నేతలను కించపరిచే వ్యాఖ్యలు నాని చేశారు. ఏడు నియోజకవర్గాల్లో ఆయనకు కొంత అనుచరగణం ఉంది. నిత్యం కలుస్తూ విధేయత చాటుకొనే నేతలున్నారు. ఇటీవల నందిగామలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన కేశినేనికి ఆయన అనుచరులు భారీ స్వాగతం పలికారు. పూలపై నడిపించారు. అదంతా తన సొంత బలంగా భావించిన ఆయన నందిగామ ఇన్‌చార్జిని కూడా మార్చాలన్న అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేశారు. కొందరు ఆశావహులను చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. కేశినేని ప్రయత్నాలను తోసిపుచ్చిన చంద్రబాబు ఇన్‌చార్జిగా సౌమ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేశినేని జగన్‌ను కలవడం, ఆపై చంద్రబాబును తక్కువగా మాట్లాడటంతో ఒక్కసారిగా చిత్రం మారిపోయింది. ఆయన వెంట వెళ్లడం మాట అటు ఉంచితే కనీసం ఆయన మొఖం చూడడానికి కూడా పార్టీ శ్రేణులు ఇష్ట పడటం లేదు. చంద్రబాబును దూషించడంతో పాటు అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయనతో పాటు పార్టీ మారే ప్రసక్తి లేదని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఎంపీ వెళ్లిపోవడంతో పార్టీ మొత్తం ఏకతాటిపైకి వచ్చినట్టు చెబుతున్నారు.
టీడీపీలోనే కొనసాగుతాం : నారా లోకేశ్‌తో ఎంఎస్ బేగ్
వన్‌టౌన్ : తెలుగుదేశం పార్టీలోనే తాము కొనసాగుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. గురువారం ఉండవల్లిలో నారా లోకేశ్‌ను ఎంఎస్ బేగ్, నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ, వైసీపీలోకి వెళ్లిన ఎంపీ కేశినేని నానితో తాము వెళ్లడం లేదని టీడీపీలోనే కొనసాగుతామని చెప్పారు.
తిరువూరు సాకు మాత్రమే.. : శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట : ఇష్టం లేకపోతే పార్టీని విడిచి వెళ్లాలే కాని, రెండుసార్లు ఎంపీని చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లపై వ్యాఖ్యలు చేయటం కేసినేని నానీకి తగదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్య అన్నారు. తిరువూరు ఘటన ఒక సాకేనన్నారు. తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ, విజయవాడ పార్లమెంట్ స్థానం సహా అన్ని స్థానాల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. చంద్రబాబు రా.. కదలిరా పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని శ్రీరాం తాతయ్య అన్నారు. శనివారం పెనుగంచిప్రోలులో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తాతయ్య వివరించారు.