Share News

భజనచంద్ర పై వేటుకు రంగం సిద్ధం

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:26 AM

వైసీపీకి భజన చేస్తున్న డీపీవో జయచంద్ర గాంధీపై వేటుకు రంగం సిద్ధం అవుతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చినా స్థానిక జిల్లాను వదలకుండా అధికార పార్టీకి కార్యకర్తగా కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నారు. స్థానిక జిల్లాకు చెందిన అధికారులు ఇంకా కదలకుండా ఉండటంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా దృష్టి సారించింది.

భజనచంద్ర పై వేటుకు రంగం సిద్ధం

నిండా మునుగుతానని తెలిసి కూడా చిలుక పలుకులు

చేస్తున్న ఉద్యోగానికి, పెడుతున్న పోస్టులకు సంబంధం లేదట

ముందు పౌరుడట.. ఆ తర్వాతే అధికారట

వైసీపీకి అనుకూలంగా కొనసాగుతున్న పోస్టుల పరంపర

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీకి భజన చేస్తున్న డీపీవో జయచంద్ర గాంధీపై వేటుకు రంగం సిద్ధం అవుతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చినా స్థానిక జిల్లాను వదలకుండా అధికార పార్టీకి కార్యకర్తగా కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నారు. స్థానిక జిల్లాకు చెందిన అధికారులు ఇంకా కదలకుండా ఉండటంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో పనిచేసే అధికారులను బదిలీ చేసే విషయంలో ఉపేక్షించవద్దని కూడా ఎన్నికల సంఘం కలెక్టర్లకు గట్టిగా చెబుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇలాంటి అంశాలను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోమని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు నిర్దేశిస్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా డీపీవో రాజకీయ పార్టీని భుజాన వేసుకుని భజన చేస్తున్న అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై జిల్లా ఎన్నికల యంత్రాంగాన్ని వివరణ కోరే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా ఎన్నికల యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు జరుపుతోంది. ఆయన గురించి లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేకున్నప్పటికీ కోడ్‌ ఉల్లంఘనలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

వైసీపీ అనుకూల ప్రచారంపై డీపీవో సమర్ధన

అధికార పార్టీకి భజన చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా డీపీవో జయచంద్ర గాంధీ వాట్సాప్‌ గ్రూపుల్లో వైసీపీ పట్ల తాను చేస్తున్న ప్రచారాన్ని సమర్థించుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఉద్యోగానికి.. పెడుతున్న పోస్టులకు సంబంధం లేదట. ఒక పౌరుడిగా చట్టబద్ధంగా ఆయన ఏదైనా కామెంట్‌ చేయవచ్చట. ఆయన ముందు పౌరుడట. ఆ తర్వాతే అధికారి అట. ఆయనకు ఊరికే జీతం ఇవ్వటం లేదట. పనిచేస్తున్నందునే జీతం ఇస్తున్నారట. డీపీవో జయచంద్ర గాంధీ తనను ట్రోల్‌ చేస్తున్న వారికి విసురుతున్న సమాధానాలు ఇవి. ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వానికి లాయల్‌గా ఉండాల్సిన పరిస్థితుల్లో డీపీవో గాంధీ తాను భజన చేస్తున్న రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పరిస్థితి ఏమిటో? ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాల పట్ల అంకితభావం చూపవచ్చేమో కానీ, రాజకీయ పార్టీల రంగులను పులుముకోవటం చాలా తప్పు. సీసీఏ రూల్స్‌కు కూడా విరుద్ధం. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

వాట్సాప్‌ గ్రూపులలో ఆగని ప్రచారం

వాట్సాప్‌ గ్రూపులలో అధికార వైసీపీకి భజన కార్యకర్తగా కంటే కూడా ఎక్కువగా భజన చేస్తున్న డీపీవో జయచంద్ర మరికొన్ని చిట్‌చాట్‌లు, వాట్సాప్‌ డీపీలు బయటకు వచ్చాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సామినేని ఉదయభానుకు భారీగా ప్రచారం చేస్తున్నారు. తాను డీపీవోగా ఉద్యోగంలో చేరిన మరుసటి రోజునే తాను ఎన్టీఆర్‌ జిల్లా డీపీవోగా పోస్టింగ్‌ రావటానికి సర్దార్‌ సామినేని ఉదయభాను, పెద్దాయన పుల్లారెడ్డి కారణమని అధికారుల వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు కూడా చేశారు. ఇప్పుడు అదే సామినేని ఉదయభాను ఫొటోను తన స్టేటస్‌లో పెట్టుకుని కాబోయే మంత్రికి వచ్చేనెలలో రాబోయే శ్రీరామనవమిని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పటం గమనార్హం. ఆయన కార్యాలయం ఫొటోను కూడా షేర్‌ చేసుకున్నారు.

జగన్‌ నామస్మరణ పోస్టుల పరంపర

వాట్సాప్‌ గ్రూపులలో జగన్‌ నామస్మరణతో డీపీవో జయచంద్ర పోస్టులను చేస్తున్నారు. జగన్‌కు అనుకూలమైన పోస్టులను పోస్టు చేయటం ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ దారుణమైన పోస్టింగ్‌లు పెట్టడం మరోఎత్తు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై సీరియస్‌గా తీసుకోకపోతే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది.

Updated Date - Mar 24 , 2024 | 01:26 AM