Share News

మిల్లర్ల మాయాజాలం

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:19 AM

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఉమ్మడి జిల్లాలో మిల్లర్లు రైతులను నిలువునా ముంచేస్తున్నారు. మద్దతు ధర చెల్లింపులో మాయ చూపిస్తున్నారు. అధికారిక ఆన్‌లైన్‌ గణాంకాల ప్రకారం మద్దతు ధర చెల్లించినట్టుగా కనిపిస్తున్నా.. లోలోపల జరిగే వ్యవహారం మాత్రం వేరుగా ఉంటోంది. ఓవైపు కమీషన్‌ వ్యాపారుల పంట పండించడానికి మిల్లర్లు ప్రయత్నిస్తుంటే, మరోవైపు మిల్లర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కమీషన్‌ వ్యాపారులు కుట్రలు చేస్తుంటే, అంతిమంగా రైతులే నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

మిల్లర్ల మాయాజాలం

రెండు జిల్లాల్లోని రైతులకు చుక్కలు

ధాన్యం బస్తా కొనాల్సింది రూ.1,630కు..

కొంటున్నది మాత్రం రూ.1,300కే..

రైతుల నుంచి రూ.330 అనధికారిక వసూలు

లేదంటే ధాన్యం దిగుమతి చేసుకోరు

కమీషన్‌ వ్యాపారులను ప్రోత్సహించేందుకే..

దిక్కుతోచక కమీషన్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఉమ్మడి జిల్లాలో మిల్లర్లు రైతులను నిలువునా ముంచేస్తున్నారు. మద్దతు ధర చెల్లింపులో మాయ చూపిస్తున్నారు. అధికారిక ఆన్‌లైన్‌ గణాంకాల ప్రకారం మద్దతు ధర చెల్లించినట్టుగా కనిపిస్తున్నా.. లోలోపల జరిగే వ్యవహారం మాత్రం వేరుగా ఉంటోంది. ఓవైపు కమీషన్‌ వ్యాపారుల పంట పండించడానికి మిల్లర్లు ప్రయత్నిస్తుంటే, మరోవైపు మిల్లర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కమీషన్‌ వ్యాపారులు కుట్రలు చేస్తుంటే, అంతిమంగా రైతులే నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో ధాన్యం కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి చూస్తే నిర్దేశిత కస్టమ్‌ మిల్లులకు అనుసంధానం చేసి ధాన్యం తరలించటానికి అనుమతులు ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కసారి రైతులు ధాన్యం లోడును మిల్లులకు తీసుకెళ్లాక మరో రకంగా ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మిల్లర్లు కొనడానికి ససేమిరా అంటున్నారు. దీనికోసం మిల్లర్ల సిండికేట్‌ కొత్త పద్ధతి అవలంబిస్తోంది. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవట్లేదు. దీంతో లారీలు, ట్రాక్టర్లపై ధాన్యం లోడు ఉండిపోతోంది. మిల్లర్లు ఇలా ఉద్దేశపూర్వకంగా చేయటం ద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఆర్‌బీకేలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలో భాగమే మిల్లర్లు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరిగి కమీషన్‌ వ్యాపారుల చేతుల్లోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని తెలుస్తోంది.

మిల్లర్ల ప్లాన్‌ ఇదీ..

రైతులు తెచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవటానికి సిండికేట్‌ అయిన మిల్లర్లు కొత్త షరతు విధిస్తున్నారు. బస్తాకు రూ.1,300 మించి చెల్లించలేమని చెబుతున్నారు. రూ.1,630 లెక్కన రైతులకు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, బస్తాకు రూ.330 ఎదురు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా చెల్లిస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామంటున్నారు. ఆర్‌బీకేలు ఏ మిల్లుకు సూచిస్తే, ఆ మిల్లర్లు ధాన్యాన్ని కచ్చితంగా దిగుమతి చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. దీనివల్ల రైతులు రవాణా చార్జీల రూపేణా నష్టపోవాల్సి వస్తోంది. పది చక్రాల లారీలో 100 బస్తాల ధాన్యం తీసుకెళ్లేందుకు రైతుకు రూ.10 వేల చొప్పున కిరాయి అవుతోంది. మిల్లర్లు ఆ లోడును తీసుకోకపోతే ఆ లారీ అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. మరో రోజు గడిస్తే లారీ కిరాయి రేటు పెరిగిపోతోంది. ప్రభుత్వం రవాణా చార్జీలను చెల్లిస్తామని చెబుతోంది. వాస్తవానికి టన్నుకు రూ.250 మాత్రమే రవాణా చార్జీలు ఇస్తున్నారు. అది కూడా మిల్లుకు తీసుకెళ్లే వరకే. వెయిటింగ్‌తో సంబంధం లేదు. ఇచ్చే చార్జీలే ఏ మూలకూ సరిపోవు. వెయిటింగ్‌ చార్జీలనేవి ప్రభుత్వం ఇవ్వదు. దీంతో వెయిటింగ్‌ వల్ల రైతులకు రవాణా చార్జీలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మిల్లుల దగ్గర లోడు దిగుమతి కాకుండా రోజుల తరబడి ఉండిపోతోంది. దీంతో రైతులు మిల్లర్లకు ఎదురు చెల్లించి ధాన్యాన్ని దించాల్సి వస్తోంది. ఇలా చేయటం ద్వారా రైతులు నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల కంటే కూడా కమీషన్‌ వ్యాపారులకు అమ్ముకోవటమే మేలన్న భావనను మిల్లర్లు తెస్తున్నారు.

కమీషన్‌ వ్యాపారుల కాసుల కక్కుర్తి

కమీషన్‌ వ్యాపారులు బస్తా ధాన్యాన్ని రూ.1,300, రూ.1,400కు అనధికారికంగా రైతుల నుంచి కొంటున్నారు. మిల్లర్లకు పంపుతున్నారు. రైతుకు 11 రోజుల సమయం చెప్పి, ఆలోపు డబ్బు చెల్లిస్తున్నారు. కస్టమ్‌ మిల్లుల వ్యవహారంతో రైతులు కమీషన్‌ వ్యాపారులకు తెగనమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కమీషన్‌ వ్యాపారులు మళ్లీ జూలు విదిలిస్తున్నారు. ఈ రబీ సీజన్‌లో కమీషన్‌ వ్యాపారులు ఆర్‌బీకే కేంద్రాల్లోకి సైతం ప్రవేశించారు. ఉద్యోగులతో చేతులు కలుపుతున్నారు. ఆర్‌బీకేల నుంచి నేరుగా అనధికారికంగా రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఉదంతాలు కూడా ఉంటున్నాయి. కమీషన్‌ వ్యాపారులు ప్రవేశిస్తేనే మిల్లర్లకు లాభాలు పండుతున్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 01:19 AM