Share News

ఎన్నికల నిర్వహణలో అధికారుల కృషి భేష్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:27 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యావాదలు తెలియజేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణలో అధికారుల కృషి భేష్‌

కృష్ణలంక, జూన్‌ 6 : ఎన్టీఆర్‌ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యావాదలు తెలియజేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం నోఖ్వాల్‌ తదితరులతో సమావేశమయ్యారు. సీఈఓ కార్యాలయానికి వివిధ ఫారాలతో అందించాల్సిన నివేదికలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ, మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు వీటి సన్నద్ధతా కార్యకలాపాల్లో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో అంకితభావం, నిబద్ధతతో వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న జిల్లా ఎన్నికల పరిశీలకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన జిల్లా పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

పోలింగ్‌, ఓట్ల లెక్కింపు కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించడంలో సహకరించిన రాజకీయ పక్షాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పన దగ్గరి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలో ఆయా అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారని కలెక్టర్‌ కొనియాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియతో పాటు ఈసీఐ నూతనంగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగస్వాములైన బృందాలకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని విధాల సహకరించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది, జిల్లా అధికారులు, వివిధ విభాగాల నోడల్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్‌లు, సెక్టార్‌ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, పారిశుధ్య సిబ్బంది, జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని శాఖల అధికారులు, ఇతర ఎన్నికల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులకు జిల్లా కలెక్టర్‌ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

కలెక్టర్‌ను సత్కరించిన సర్వోదయ ట్రస్ట్‌ :

అత్యంత పారదర్శకతతో జవాబుదారీతనంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావును సర్వోదయ ట్రస్టు ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఓటర్ల జాబితా రూపకల్పన దగ్గరి నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతి దశలోను కలెక్టర్‌ దిల్లీరావు ప్రశంసాపూర్వక విధులు నిర్వహించినట్టు ఈ సందర్భంగా సర్వోదయ ట్రస్టు సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం ప్రతినిధులు మోత్కూరి వెంకటేశ్వరరావు, వేమూరి బాబురావు పేర్కొన్నారు. సమావేశంలో రిటర్నింగ్‌ అధికారులు బీహెచ్‌ భవానీశంకర్‌, ఎ.రవీంద్రరావు, కె.మాధవి, జి.వెంకటేశ్వర్లు, ఇ.కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 01:27 AM