Share News

ఆలయాల విశిష్టత తెలిపేదే ఆలయవేదం

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:53 AM

దేవాలయాలకు వెళ్లినప్పుడు వాటి నిర్మాణాలను, శిల్పాలను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలని భువనేశ్వరీ పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామి సూచించారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆరో రోజు మంగళవారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై నిర్వహించిన మొదటి సభలో కందుకూరి వెంకట సత్య బ్రహ్మాచార్య రచించిన ‘ఆలయవేదం’ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఆలయాల విశిష్టత తెలిపేదే ఆలయవేదం
ఆలయవేదం గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న కమలానంద భారతి స్వామి, సత్యబ్రహ్మాచార్య తదితరులు

విజయవాడ కల్చరల్‌, జనవరి 2 : దేవాలయాలకు వెళ్లినప్పుడు వాటి నిర్మాణాలను, శిల్పాలను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలని భువనేశ్వరీ పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామి సూచించారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆరో రోజు మంగళవారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై నిర్వహించిన మొదటి సభలో కందుకూరి వెంకట సత్య బ్రహ్మాచార్య రచించిన ‘ఆలయవేదం’ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో భాగంగా మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం నిర్మించిన ఆలయాలు, చెక్కిన శిల్పాలు సూక్ష్మమైన, సునిశితమైన విశిష్టతలను కలిగి వుంటాయని వివరించారు. దేవాలయాలకు వెళ్లినప్పుడు తొందర తొందరగా దైవదర్శనం చేసుకొని వచ్చేయడం కాకుండా దేవాలయ నిర్మాణ విశేషాలను తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. దేవాలయ శిల్పానికి సంబంధించి వివిధ భాషల్లో వున్న గ్రంథాలను తెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న సత్య బ్రహ్మాచార్యను అభినందించారు. కేబీఎన్‌ కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాసులు మొదటి ప్రతి స్వీకరించారు. ఇదే వేదికపై శైవాగమానికి చెందిన శివధర్మశాస్త్రం తెలుగు అనువాదాన్ని శ్రీశైల దేవస్థానం ఆస్థాన దైవజ్ఞులు బుట్టే వీరభద్ర సిద్ధాంతి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డాక్టర్‌ అంబడిపూడి నాగభూషణం తెలుగులోకి అనువదించి సంపాదకత్వం వహించారు. కె.రామకృష్ణ సభను నిర్వహించారు. ఎ.గోవార్థన శాస్ర్తి, భవిరి రవి ధన్యనుకరణ నిపుణులు సభలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విశ్రాంత ఐఏఎస్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌, పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు

ఆత్మానందమే జీవిత పరమార్థం

ఆత్మానందమే మానవ జీవత పరమార్థమని చిత్రకారుడు, రచయిత, కళావిమర్శకుడు సంజీవ్‌ దేవ్‌ జీవించి నిరూపించారని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ అన్నారు. మంగళవారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై రెండో సభగా కీ.శే. సంజీవదేవ్‌, ఆవంత్స సోమసుందర్‌ల శతజయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, మన చుట్టూ వున్న ప్రకృతిలోను, కళలలోను వున్న సౌందర్యాన్ని ఆస్వాదించడం తద్వారా ఆత్మానందాన్ని అనుభవించవచ్చునని పేర్కొన్నారు. హిమాలయాల సౌందర్యంతో గాఢంగా అనుభూతి చెంది, సౌందర్యాస్వాదనను ఆత్మాన్వేషణగా మార్చుకున్న వ్యక్తి సంజీవదేవ్‌ అని చెప్పారు. దేశంలో ప్రముఖ కళాకారులు కవులతో కలిసి స్నేహపూర్వకంగా జీవించిన వ్యక్తిగా సంజీవ్‌ దేవ్‌ అనేక విషయాల మీద సాధికారికంగా మాట్లాడేవారు, రాయగలిగే వారని చెప్పారు. తెలుగు వచన కవిత్వానికి సోమసుందర్‌ సేవలు మరువలేనివని జీవితాంతం తెలుగులో కవిత్వాన్ని రచించి, ప్రచురించి, ప్రచారం చేసిన కవి ఆవంత్స సోమసుందర్‌ అని సభాధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ వివరించారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆవంత్స సోమసుందర్‌ కవిత్వ శక్తిని తెలుసుకోవాలంటే ఆయన వజ్రాయుధం కవిత్య సంకలనాన్ని చదవాలని జోస్యుల కృష్ణబాబు చెప్పారు. తెలంగాణా సాయుధ పోరాటానికి ఎంతో ఊపు తెచ్చిన ఆ కావ్యాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించడం ఆయన కవిత్వం ప్రజలలో కలిగించిన ఉత్తేజానికి తార్కాణమన్నారు. ఆధునిక సాహిత్యంలో అనేక మలుపులను అందుకుంటూ భావకవిత్వ సౌందర్యాన్ని, అభ్యుదయ కవిత్వ చైతన్యాన్ని మేళవించి ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత సోమసుందర్‌దేనన్నారు. మాక్సీం గోర్కీ అమ్మ నవలను తెలుగులోకి అనువదించారని చెప్పారు.

జీవనస్పర్శ నవలను ఆవిష్కరిస్తున్న వి.కృష్ణయ్య, కె.ఉషారాణి తదితరులు

సమాజానికి సాహిత్యమే దిక్సూచి

సమాజానికి సాహిత్యమే దిక్సూచి అని సమాజంలో జరుగుతున్న మార్పులు రావాలంటే ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత రచయితలకూ సాహిత్యానికి వుందని సీపీఏం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య అన్నారు. కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై గనారా రచించి సాహితీ స్రవంతి ప్రచురించిన ‘జీవన స్పర్శ’ నవలను ఆయన ఆవిష్కరించారు. ఈ నవల గత 30-40 ఏళ్లల్లో వచ్చిన సామాజిక మార్పులను చక్కగా అద్దం పట్టిందన్నారు. అధికారంలో ఉన్న వారు తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు వాస్తవాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం సర్వసాధారణమైన ఈ కాలంలో వాటిని పరోక్షంగానూ, వ్యాఖ్యానపూరితంగానూ అందించాల్సిన బాధ్యత సాహిత్యకారులదేనన్నారు. ప్రజాశక్తి బుక్‌హౌస్‌ సంపాదకురాలు కె.ఉషారాణి పుస్తకాన్ని పరిచయం చేస్తూ ప్రేమకథా నేపధ్యంలో సామాజిక మార్పులను, సంఘర్షణలను చక్కగా చిత్రీకరించారని వివరించారు. 70వ దశాబ్దంలో ఉద్యోగుల జీవితాలలో వచ్చిన మార్పులను, అంతఃసంఘర్షణను ఆద్యంతం ఆసక్తికరంగా చర్చించారని చెప్పారు. ఆధునిక జీవితంలో సాహిత్యానికి స్థానం తగ్గిపోవడం విచారకరమని సభకు అధ్యక్షత వహించిన వరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. సాహిత్య ప్రస్థానం వర్కింగ్‌ ఎడి టర్‌ సత్యాజీ మాట్లాడుతూ, ఒక మనిషి వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగ జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య జరిగే సంఘర్షణను రచయిత హృద్యంగా చిత్రీకరించారన్నారు.

కొసరాజు సినీ సాహిత్య వ్యాసావళి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మద్దుకూరి విజయకుమార్‌ తదితరులు

జానపద గేయాల రచనకు రారాజు కొసరాజు

జానపద గేయ రచనలలో కొసరాజు రారాజు అని, పల్లె ప్రజలలోని అమాయకత్వాన్ని, చైతన్యాన్ని తన గేయాలలో వాళ్ల భాషలోనే ప్రతిఫలింపచేసిన ఘనత కొసరాజు రాఘవయ్య చౌదరికే దక్కుతుందని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌ అన్నారు. కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై మంగళవారం నిర్వహించిన చివరి సభలో మద్దుకూరి విజయ చంద్రహాస్‌ రచించిన ‘కొసరాజు సినీ సాహిత్య వ్యాసావళి’ పుస్తకాన్ని ఆయన తండ్రి మద్దుకూరి విజయకుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ, తన పాటలలో శోకం, హాస్యం మిళాయించడం, సంభాషణాత్మక పాటలు కొసరాజు ప్రత్యేకత అని ఆయన వివరించారు. సినీసాహిత్య స్వర్ణయుగానికి కారణమైన గేయ రచయితల్లో కొసరాజు ప్రముఖులన్నారు. కొసరాజు గేయాల విశిష్టతను, చారిత్రక నేపథ్యాన్ని వివరించడంలో పుస్తక రచయిత చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. హాస్య పాత్రలకు పాటలు రాయడం వల్ల కొసరాజుకు దక్కాల్సిన ంత సాహిత్య గౌరవం దక్కలేదని అభిప్రాయపడ్డారు. సభాధ్యక్షత వహించిన ముత్తేవి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కల్మషం లేని సామాజిక చైతన్యాన్ని, చక్కని చిక్కని తెలుగు పదాలను తన పాటలతో అజరామరం చేసిన ఘనత కొసరాజుదేనన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:53 AM