Share News

టేకు చెట్టు.. కొల్లగొట్టు..

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:03 AM

ఒక సెంటర్‌లో వాహనాలు ఉంటాయి. సాయంత్రానికి కూలీలతో అడవుల్లోకి వెళ్తాయి. ఎర్రచందనం చెట్లు నరికి లారీల్లో రహస్య గోడౌన్‌కు చేరుస్తారు... పుష్ప చిత్రంలో సీన్‌ ఇది. ఒక సెంటర్‌లో కూలీలంతా గూమిగూడుతారు. ఒక నాయకుడు వచ్చి వారిని అడవుల్లోకి తీసుకెళ్తాడు. దీపాల వెలుగులో టేకుచెట్లను నరికిస్తాడు. ఇలా నరికి కలపను కొండపల్లిలోని టింబర్‌ డిపోకు తరలిస్తారు... జిల్లాలో టేకు ‘పుష్పా’ల స్టైల్‌ ఇది. ..మైలవరం రేంజ్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న టేకు చెట్లను వైసీపీ నేతలు నేలమట్టం చేస్తున్నారు. వీరితో అటవీ శాఖ అధికారులు చేతులు కలిపి సంపదను సర్వనాశనం చేస్తున్నారు.

టేకు చెట్టు.. కొల్లగొట్టు..
మైలవరంలో ఇష్టానుసారంగా నరికిన టేకు చెట్లు

అధికారుల సహకారంతో టేకు చెట్ల నరికివేత

అనుమతి ఒకచోట.. నరికేది మరోచోట..

చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు

కొండపల్లిలోని టింబర్‌ డిపోకు వెళ్తున్న సరుకు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : మైలవరం రేంజ్‌ పరిధిలోని అటవీ భూముల్లో టేకు చెట్లను పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. ఈ తతంగమంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. వారికి అటవీ శాఖ అధికారులు సహకరిస్తున్నారు. వైసీపీ నేతలు ఇచ్చిన ముడుపులు తీసుకుని అటవీ సంపదను మాఫియాకు కట్టబెడుతున్నారు. అధికారం చేతిలో ఉండటంతో తమను అడిగేవారు లేరని వైసీపీ నేతలు కూలీలతో టేకు చెట్లను ఇష్టానుసారంగా నరికిస్తున్నారు.

అనుమతి తీసుకున్నట్టుగా..

అటవీ ప్రాంతం రేంజ్‌, సెక్షన్‌, బీట్‌, కంపార్టుమెంట్లుగా ఉంటుంది. ఒక రేంజ్‌ పరిధిలో రెండు, మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌ పరిధిలో ఉండే ప్రాంతాన్ని బట్టి బీట్లు ఉంటాయి. ఒక్కో బీట్‌ పరిధిలో 2 వేల నుంచి 3 వేల వరకు హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కంపార్టు మెంట్లుగా విభజి స్తారు. ఉదాహ రణకు రెండు గ్రామాల మధ్య అటవీ ప్రాంతం ఉంటే అది ఒక కంపార్ట్‌మెంట్‌ అవుతుంది. ఈ రేంజ్‌ పరిధిలో మొత్తం పది బీట్లు ఉన్నాయి. ఈ బీట్లు, కంపార్ట్‌మెంట్ల పరిధిలో కొన్ని సర్వే నెంబర్లలో గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో వారు కొన్నాళ్ల క్రితం టేకు మొక్కలు నాటారు. ఇప్పుడు అవి భారీగా పెరిగాయి. ఇలా పట్టాలు ఇచ్చిన భూముల్లో కాకుండా అటవీ శాఖకు చెందిన భూముల్లోనూ భారీ టేకు చెట్లు ఉన్నాయి. వీటినే వైసీపీ నేతలు నరికేస్తున్నారు.

కీలక అధికారి సహకారంతో..

రేంజ్‌ పరిధిలో ఉన్న ఒక కీలక అధికారి మాఫియాతో చేతులు కలిపి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరికిన టేకు కలపను రాత్రిపూట రహస్యంగా లారీల్లో కొండపల్లిలో ఉన్న ఓ టింబర్‌ డిపోకు తరలించి ముక్కలు చేయిస్తున్నారని సమాచారం. దీనిపై సంబంఽధిత రేంజ్‌ అధికారులను వివరణ కోరగా, అటువంటిదేం లేదని చెబుతున్నారు. అనుమతి ఇచ్చిన సర్వే నెంబర్లలోనే భూమి యజమానులు టేకు చెట్లను నరుకుతున్నారని తెలిపారు. ఈ టేకు చెట్ల నరికివేత వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని రేంజ్‌ పరిధిలోని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

నిబంధనలకు తిలోదకాలు

అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఒక సర్వే నెంబర్‌లో ఉన్న ఇతర చెట్లను అయినా, టేకు చెట్లను అయినా నరకాలంటే అనుమతి తప్పనిసరి. యజమానులు ముందుగా జిల్లా అటవీశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులు రేంజ్‌ కార్యాలయానికి వెళ్తాయి. రేంజ్‌ అధికారులు వాటిని పరిశీలించి సంబంధిత బీట్‌, సెక్షన్‌ అధికారులకు పంపుతారు. అసలు దరఖాస్తుదారుడి సర్వే నెంబర్‌లో టేకు చెట్లు ఉన్నాయా, లేదా, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంతెంత పరిమాణంలో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుంటారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇస్తారు. దరఖాస్తుదారుడు ఒక్కో చెట్టుకు రూ.100 చొప్పున చలానాను అటవీ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. టేకు మాఫియాతో కలిసి అటవీ శాఖ అధికారులు ఈ నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. ఒకటి, రెండు సర్వే నెంబర్లలో ఉన్న చెట్లను నరుక్కోవడానికి అనుమతులు ఇస్తున్నారు. ఇలా అనుమతులు తీసుకున్న మాఫియా ఆ సర్వే నెంబర్లలో ఉన్న చెట్లను వదిలేసి అటవీ శాఖకు చెందిన సర్వే నెంబర్లలో ఉన్న చెట్లను నరికేస్తున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 01:03 AM