తాయిలాలు.. బెదిరింపులు!
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:12 AM
‘‘ఇన్నాళ్లు ప్రభుత్వ పథకాలన్నీ మీ చేతుల మీదుగానే అమలు అయ్యాయి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీకు జీతాలు ఇస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములు మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరంతా పార్టీకి పనిచేయాల్సిందే. పార్టీకి పని చేయని వారిపై కఠిన నిర్ణయాలు ఉంటాయి’’ వారం రోజులుగా సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయాల్లో వినిపిస్తున్న మాటలు ఇవి. అధికార వైసీపీ నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం వలంటీర్లపై గురి పెట్టారు. వలంటీర్లు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశాలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలవాలని, అందుకు అనుగుణంగా మీరు తప్పనిసరిగా పని చేసి తీరాలని ఆదేశిస్తున్నారు. రహస్య సమావేశాలు పెట్టి ఏం చేయాలి? ఓటర్లను ఎలా కలవాలి? అనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. తమకు అనుకూలంగా పనిచేస్తే రూ.5వేలు ఇస్తామని బేరం పెడుతున్నారు. పనిచేయని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు.

వలంటీర్లతో వైసీపీ కార్యాలయాల్లో
నేతల రహస్య సమావేశాలు
ఎన్నికల్లో పార్టీ కోసం
పనిచేయాలని ఆదేశాలు
ఒక్కొక్కరికి రూ.5వేలు ఇస్తాం
ఈ ఏడాది ఇచ్చిన సత్కార బహుమతికి ఇది అదనం
మాట వినకపోతే ఊరుకోం
గెలిచాక మీ సంగతి తేలుస్తాం
రోజుకు గంట సేపైనా ఓటర్లతో మాట్లాడాలి
వలంటీర్లకు వైసీపీ నేతల అల్టిమేటం
ఎన్నికల్లో ఎలా పని చేయాలో దిశానిర్దేశం
‘‘ఇన్నాళ్లు ప్రభుత్వ పథకాలన్నీ మీ చేతుల మీదుగానే అమలు అయ్యాయి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీకు జీతాలు ఇస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములు మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరంతా పార్టీకి పనిచేయాల్సిందే. పార్టీకి పని చేయని వారిపై కఠిన నిర్ణయాలు ఉంటాయి’’
వారం రోజులుగా సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయాల్లో వినిపిస్తున్న మాటలు ఇవి.
అధికార వైసీపీ నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం వలంటీర్లపై గురి పెట్టారు. వలంటీర్లు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశాలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలవాలని, అందుకు అనుగుణంగా మీరు తప్పనిసరిగా పని చేసి తీరాలని ఆదేశిస్తున్నారు. రహస్య సమావేశాలు పెట్టి ఏం చేయాలి? ఓటర్లను ఎలా కలవాలి? అనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. తమకు అనుకూలంగా పనిచేస్తే రూ.5వేలు ఇస్తామని బేరం పెడుతున్నారు. పనిచేయని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు.
అజిత్‌సింగ్‌నగర్, మార్చి 5 : వారం రోజులుగా నియోజకవర్గంలోని వైసీపీ డివిజన్ కార్యాలయాల్లో వలంటీర్లతో రహస్య సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ సెంట్రల్ ఇన్‌చార్జి వెలంపల్లి నియమించుకున్న డివిజన్ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు వలంటీర్లకు బ్రైయిన్ వాష్ చేస్తున్నారు. జగన్ గెలిస్తేనే మీకు భవిష్యత్తు అంటూ ప్రలోభపెట్టి వారిని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రతి డివిజన్‌లో రోజుకు రెండు సచివాలయాల చొప్పున ఎన్నుకుని పార్టీ కార్యాలయాలకు రప్పించుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రూ.5 వేలు ఇస్తామని ఎర
ఎన్నికల్లో పనిచేసినందుకు గాను వలంటీర్లకు రూ.5 వేలు ఇస్తామని రహస్య సమావేశాల్లో చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏడాదీ ఇచ్చే వలంటీర్ల సత్కార కార్యక్రమానికి ఇచ్చే రూ.10 వేలుకు బదులుగా ఈ ఏడాది రూ.15 వేలు ఇచ్చామని మరో రూ.5 వేలు ఇస్తామని ఆశచూపిస్తున్నారు. అయితే రూ.5 వేలుకు తగ్గట్టుగా తమతో ఫలితాలు చూపించాలని వలంటీర్లతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు.
నోటిఫికేషన్ విడుదల తర్వాత ఎలా పని చేయాలో దిశానిర్దేశం
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత వలంటీర్లు విధుల్లో ఉండే పరిస్థితులు లేకపోవడంతో నోటిఫికేషన్ విడుదల తర్వాత వలంటీర్లు ఎలా పనిచేయాల్లో రహస్య సమావేశాల్లో వైసీపీ నేతలు వారికి దిశ నిర్ధేశం చేస్తున్నారు. వలంటీర్లంతా తమ తమ క్లస్టర్ల పరిధిలో ఏదో ఒక వ్యక్తిగత పని కల్పించుకుని వెళ్లాలని, ఓటర్లతో రోజులో కనీసం ఒక గంట గడపాలని సూచిస్తున్నారు. పథకాల్లో లబ్ధిపొందిన వారి జాబితాను సిద్ధం చేసుకుని రోజుకు ఐదు ఆరు కుటుంబాలను కలుస్తూ మాట మంతీ మాట్లాడి నిదానంగా వారిని ఓటు బ్యాంకుగా మార్చాలని వలంటీర్లకు నూరిపోస్తున్నారు.
పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు
ఎన్నికల్లో వలంటీర్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తామని పనిచేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, పనిచేయని వలంటీర్లను గుర్తించి విధుల నుంచి తొలగించడమే కాకుండా వారికి వచ్చే పథకాలను కూడా నిలుపుదల చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నారు.
కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
వైసీపీ నేతల పర్యటనల్లో వలంటీర్లు పాల్గొనకూడదని ఇప్పటికే నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఓ సర్క్యులర్‌ను కూడా జారీ చేశారు. అయినా కమిషనర్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ వైసీపీ నేతలు సచివాలయ సిబ్బంది కుమ్మక్కై వలంటీర్లు వైసీపీ కార్యాలయాలకు వెళ్లి సమావేశాల్లో పాల్గొనేలా చూస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈసారి వీవోఏలకు...
వలంటీర్లను ప్రలోభపెడుతున్న వైసీపీ అభ్యర్థులు
పెనమలూరు, విజయవాడ సెంట్రల్‌లో కుక్కర్ల పంపిణీ
తాజాగా పామర్రులోనూ డ్వాక్రా వీవోఏలకు ప్రలోభాలు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ఎన్నికల వేళ వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఐదేళ్లపాటు అడ్డగోలుగా దోచుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓటమి భయంతో ప్రలోభాలతో గెలుపును సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు, పెనమ లూరు నుంచి బరిలో ఉన్న జోగి రమేశ్ ఇప్పటికే ఈ బాటలో పయనిస్తుండగా తాజాగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్ వారి సరసన చేరారు. వెలంపల్లి డివిజన్ల వారీగా వలంటీర్లతో సమావేశాలు నిర్వ హిస్తూ తాయిలాలు అందజేస్తున్నారు. తన గెలుపు నకు సహకరించాలని వలంటీర్లను వేడుకుంటు న్నారు. పెనమలూరులో జోగి రమేశ్ సైతం వలంటీర్లతో, డ్వాక్రా ఆర్పీలతో సమావేశాలు పెట్టి తాయిలాలు అందజేస్తున్నారు. తాజాగా పామర్రులో ఎమ్మెల్యే అనీల్ డ్వాక్రా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ)లతో సమావేశం నిర్వహించి కుక్కర్లను అందజేశారు. అందరికీ భోజనాలు పెట్టి, తన గెలుపునకు కృషి చేయాలని కోరారు.