గ్రామాలకు స్వర్ణకవచం
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:10 AM
పంచాయతీల్లో పాలనను గాడిలో పెట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సమూల మార్పులు చేస్తోంది. స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయాన్ని, ఖర్చులను సక్రమంగా లెక్కించేందుకు, అక్రమాలు జరక్కుండా చూసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. పంచాయతీకి సంబంధించిన ఆదాయ మార్గాలను స్వర్ణపంచాయతీ యాప్‌లో పొందుపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది.
స్వర్ణపంచాయతీ యాప్ ద్వారా పన్నుల వసూలు
ఇతరత్రా వసూళ్ల వివరాలు కూడా ఆ యాప్‌లోనే..
పన్నుల వసూలులో అక్రమాలకు చెక్ పెట్టేందుకే..
నేరుగా ఆ గ్రామ ట్రెజరీ ఖాతాకు జమ
ఆ నిధులే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగం
వారంలో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : పంచాయతీలకు వివిధ రూపాల్లో సమకూరే ఆదాయం, వసూలుచేసే ఇంటి, ఇతరత్రా పన్నులను ఇకపై ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నేరుగా ట్రెజరీల్లోని పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యేలా, ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్రా పనులకు సంబంధించిన బిల్లులను ట్రెజరీల ద్వారా తిరిగి తీసుకునే వెసులుబాటును టీడీపీ కూటమి ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగానే తీసుకొచ్చిందే ‘స్వర్ణపంచాయతీ’ యాప్.
ఈ యాప్‌లో ఏం చేస్తారు..?
జిల్లాలో 474 పంచాయతీలున్నాయి. వీటిలో ఇంటి, ఆస్తి, ఇతరత్రా పన్నులను పంచాయతీల్లో పనిచేసే బిల్ కలెక్టర్లు లేదా అధికారులు ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది ద్వారా వసూలు చేసేవారు. ఈ సమయంలో పంచాయతీల ద్వారా బిల్లు పత్రాలను ఇచ్చేవారు. కొన్ని పంచాయతీల్లో ఇలా వసూలుచేసిన సొమ్ము పక్కదారి పట్టేది. ఈ తరహా సంఘటనలు వెలుగులోకి వచ్చి, వాటిపై ఫిర్యాదులు అంది, విచారణచేసి, రికవరీ చేసేసరికి ఏడాది నుంచి రెండేళ్లు పట్టేది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు మరింత సమయం పట్టేది. ఈ ఇబ్బందుల నుంచి పంచాయతీలను తప్పించేందుకే స్వర్ణపంచాయతీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అన్ని రకాల ఆదాయాలు..
పంచాయతీల్లోని కాల్వల్లో చేపలవేట నిమిత్తం వలకట్లు వేసుకునేందుకు, చెరువుల్లో వేలంపాటలు నిర్వహించేందుకు, ఆ తరువాత వచ్చే సొమ్మును పంచాయతీలకు జమ చేసేందుకు, కాల్వగట్లపై పచ్చగడ్డి పాటలు, భూమి యాజమాన్యంలో మార్పులు, కుళాయి పన్నులు, వ్యాపార సంస్థలు, వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన రెన్యువల్స్, పశువుల సంతలు, రోజువారీ వ్యాపారుల నుంచి వసూలుచేసే ఆశీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించిన అద్దెలు, డిపాజిట్లు, ఆర్వో ప్లాంట్లు, కబేళాలు, సంతలు, ఫెర్రీలు, ఆస్తివిలువను సూచించే ధ్రువీకరణ పత్రాలు, ఎన్నికల డిపాజిట్లు, వివిధ పనుల టెండర్ డిపాజిట్లు, పంచాయతీలకు వచ్చే విరాళాలు, గ్రావెల్, మట్టి తవ్వకాలకు మైనింగ్ అనుమతులు ఇచ్చే సమయంలో వసూలుచేసే నగదును కూడా ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఈ మేరకు పక్షం రోజుల కిందటే పంచాయతీరాజ్ విభాగం కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియను పూర్తిచేయకుండా అధికశాతం పంచాయతీల్లో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. ఆదాయం వచ్చే మార్గాల వివరాలను నమోదు చేయకుండా కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్వర్ణపంచాయతీ యాప్‌లో పూర్తిస్థాయి వివరాలు నమోదుచేసేందుకు మరో వారం వ్యవధిని ఇచ్చారు. ఈలోగా సక్రమంగా వివరాలు నమోదు చేస్తారో లేక పక్కదారి పట్టిస్తారో చూడాలి.
యాప్‌లో వివరాలిచ్చాకే పన్నుల వసూలు
ఏటా పంటలు చేతికొచ్చే నవంబరు నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి వరకు పంచాయతీల్లో ఇంటిపన్నులతో పాటు వివిధ రకాల పన్నులను వసూలు చేస్తారు. ఈ ఏడాది ఇంకా ఇంటిపన్నులు, ఇతరత్రా వసూలు ప్రారంభం కాలేదు. స్వర్ణపంచాయతీ యాప్‌లో ఆయా పంచాయతీలకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు నమోదు చేశాకే.. అన్నిరకాల పన్నులు వసూలు చేస్తామని పంచాయతీ కార్యదర్శులు, ఈవోలు చెబుతున్నారు.