Share News

ఏడాదిలో రూ.2 స్వాహా

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:33 AM

అధికారంలో ఉండగా నాలుగు రూపాయలు వెనకేసుకోవడం ప్రతిఒక్కరికీ మామూలే. అయితే దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం పాలకమండలిలోని ఓ కీలక వ్యక్తి నాలుగు రూపాయలు ఏం ఖర్మ ఏకంగా కోట్లాది రూపాయలే వెనకేసుకుంటున్నారు. అమ్మవారి సొమ్ము అనే భయం లేకుండా అడ్డగోలుగా దోచుకుంటున్నాడు. ఈ ‘బాబు’ దూకుడికి అటు అధికారులు బెంబేలెత్తుతుంటే ఇటు పాలకమండలి సభ్యులు తమ వాటా సొమ్మూ ఆయనే లాగేస్తున్నాడంటూ గగ్గోలుపెడుతున్నారు.

ఏడాదిలో రూ.2 స్వాహా

కాసులుంటేనే దుర్గగుడిలో ఏ పనైనా.. ప్రతి పనికీ ప్యాకేజీ

ఆయన వచ్చారు.. దుర్గగుడిని వ్యాపార కేంద్రంగా మార్చేశారు

ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తానని ఓ ప్యాకేజీ

దసరా, భవానీ దీక్ష విరమణల్లో వ్యాపారులకు మరో ప్యాకేజీ

అధికారంలో ఉండగా నాలుగు రూపాయలు వెనకేసుకోవడం ప్రతిఒక్కరికీ మామూలే. అయితే దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం పాలకమండలిలోని ఓ కీలక వ్యక్తి నాలుగు రూపాయలు ఏం ఖర్మ ఏకంగా కోట్లాది రూపాయలే వెనకేసుకుంటున్నారు. అమ్మవారి సొమ్ము అనే భయం లేకుండా అడ్డగోలుగా దోచుకుంటున్నాడు. ఈ ‘బాబు’ దూకుడికి అటు అధికారులు బెంబేలెత్తుతుంటే ఇటు పాలకమండలి సభ్యులు తమ వాటా సొమ్మూ ఆయనే లాగేస్తున్నాడంటూ గగ్గోలుపెడుతున్నారు.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌) : దుర్గగుడికి ప్రతిరోజూ వస్తూ సేవకుడి మాదిరి క్యూలలో భక్తుల నియంత్రణ చేయడం చూస్తే బాబు ఎంత భక్తుడో అనుకుంటారు. తరచూ పలు విభాగాల్లో తనిఖీలంటూ వెళ్లి హడావిడి చేయడం చూస్తే బాబు ఎంత నిజాయితీపరుడో అని భ్రమపడతాం. బాబు వచ్చి ఏడాది అవుతున్నా ఇన్నిసార్లు తనిఖీలు నిర్వహించినా ఇంతవరకు ఆయా విభాగాల్లో చిన్న తప్పును కూడా బయట పెట్టలేదంటేనే బాబు తనిఖీల్లో మర్మం అర్థమవుతుంది. దేవస్థానం ఉద్యోగులపై వేధించడం, బెదిరించడం, తన మాట వినేలా చేసుకోవడం ఈ బాబు నైజం. పాలకమండలి కొలువుదీరి ఫిబ్రవరి 7వ తేదీకి ఏడాది పూర్తి అయింది. ఏడాది సమయంలోనే దుర్గగుడి ఆదాయం సుమారు రూ.2 కోట్లు పైచిలుకు బాబు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పదవి కోసం సుమారు రూ.అరకోటి వరకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యేకు సమర్పించుకున్న ఈ బాబు అంతకు నాలుగు రెట్లు సంపాదించుకోవాలన్న ఆత్రంలో ఉన్నారు.

దర్శనాల్లో దందా

దర్శనాల పేరుతో తన అనుచరులను పెట్టుకుని దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా కుటుంబాలతో గ్రూపులుగా వచ్చినప్పుడు టికెట్ల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. వాస్తవంగా అంతరాలయ దర్శనానికి ఒక్కొక్కరికి రూ.500, ఆశీర్వచనానికి మరో రూ.500, హారతులు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంది. కానీ టికెట్లు కొనకుండానే మనిషికి రూ.2వేలు వరకు వసూలు చేసి ఆ డబ్బులు జేబులో వేసుకుంటుండటం గమనార్హం. ఫలానా వ్యక్తి చెప్పాడంటూ ఆ వచ్చిన వారిని దర్శనాలకు అనుమతిస్తారు. ఇలా రద్దీ రోజుల్లో బాబుకి భారీగానే ఆదాయం సమకూరుతోంది.

వ్యాపారులు, కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీలు

సరుకుల కాంట్రాక్టర్ల వద్ద నుంచి పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. తనిఖీల్లో నాసిరకం వస్తువులు అని చెబుతూ కాంట్రాక్టర్‌ను బెదిరించి మరీ మాముళ్ల వసూలుకు తెర లేపారు. దసరా, భవానీ దీక్షా విరమణలు సమయంలో భక్తుల రాకపోకలకు ఆటంకం ఉంటుందన్న ఉద్దేశంతో షాపులను తొలగిస్తున్నారు. కానీ ఈయన వచ్చిన తర్వాత భక్తుల రాకపోకలకు ఆటంకాలు ఎదురైనా సరే షాపులను కొనసాగించి వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిచ్చారు. అలా అనుమతి ఇచ్చినందుకు వ్యాపారుల నుంచి భారీగానే సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి ఒక్కో విధంగా వారి వ్యాపారస్థితిని బట్టి డబ్బులు వసూలు చేశారు. కనకదుర్గానగర్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో అక్కడి షాపులను తొలగించడం ఖాయం. కానీ అక్కడ షాపులు వారికి వేరేచోట షాపులు కేటాయిస్తామంటూ వారితో బేరసారాలు సాగిస్తున్నారు. భారీ మొత్తంలో ముడుపులు బాబుకి ఇచ్చేలా ఒప్పందాలు జరిగినట్టు ఆలయ ఉద్యోగులే చెబుతున్నారు.

తాత్కాలిక ఉద్యోగులనూ వదల్లేదు

దుర్గగుడిలో పనిచేసే ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులది ఎడతెగని కథ. వారిని పర్మినెంట్‌ చేయిస్తానని బాబు వారి వద్ద బేరసారాలు సాగిస్తున్నారు. అలాగే గతంలో చెప్పుల స్టాండ్‌ను దుర్గగుడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ సమయంలో రోజువారీ వేతనాలపై 12 మంది తాత్కాలిక ఉద్యోగులను తీసుకున్నారు. ఇటీవల చెప్పుల స్టాండ్‌ను ప్రైవేటు కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ఈ పరిస్థితుల్లో 12 మంది తాత్కాలిక ఉద్యోగులను వెనక్కి పంపేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ల దగ్గర కూడా బాబు బేరసారాలు సాగిస్తున్నారు. మరో 2 నెలల్లో కొత్త ప్రభుత్వం వస్తే తన పదవికి ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో ఈయన ఇటీవల వసూళ్ల దందాలో జోరు పెంచారని ఆలయ ఉద్యోగులు, పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 01:33 AM