Share News

ఆదివారం అనూహ్యంగా..

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:00 AM

శుక్రవారం దుర్గమ్మ దర్శనమంటే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రం. కానీ, ఇప్పుడు భక్తుల సెంటిమెంట్‌ ఆదివారానికి కూడా మారింది. ఆదివారం అమ్మను దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈనెల ప్రారంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్‌ పరీక్షలు పూర్తవడం, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ నాయకుల దర్శనాలతో ఆదివారమొస్తే ఇంద్రకీలాద్రి నిత్య కల్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతోంది. ఇక టెన్త్‌, డిగ్రీ పరీక్షలు పూర్తయితే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆదివారం అనూహ్యంగా..

దుర్గమ్మ దర్శనానికి ఆదివారం ఒకటే రద్దీ

ఉచిత దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

ఈ మూడు వారాల్లో భారీగా పెరుగుదల

30 వేల నుంచి 40 వేలకు..

రూ.500, రూ.300, రూ.100 టికెట్లకూ అంతే..

దేవస్థానానికి భారీగా ఆదాయం

లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా కూడా..

సిఫార్సు దర్శనాలు తగ్గితే మరింత ఆదాయం

శుక్రవారం దుర్గమ్మ దర్శనమంటే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రం. కానీ, ఇప్పుడు భక్తుల సెంటిమెంట్‌ ఆదివారానికి కూడా మారింది. ఆదివారం అమ్మను దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈనెల ప్రారంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్‌ పరీక్షలు పూర్తవడం, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ నాయకుల దర్శనాలతో ఆదివారమొస్తే ఇంద్రకీలాద్రి నిత్య కల్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతోంది. ఇక టెన్త్‌, డిగ్రీ పరీక్షలు పూర్తయితే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ప్రతి శుక్రవారం కనిపించే విషయమే. ఇక ఆదివారం కూడా రద్దీ ఓ మోస్తరుగానే ఉంటుంది. కానీ, గత మూడు, నాలుగు వారాలుగా భక్తుల సంఖ్యను పరిశీలిస్తే.. అనూహ్యంగా పెరి గిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఆదివారం భక్తుల రద్దీ ఉంటుందని, కానీ ఈ మధ్య మరింతగా పెరిగిం దని అంటున్నాయి. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు పూర్తవ్వ డంతో విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం విద్యాసంస్థలకు సెలవులిస్తే ఇంద్రకీలాద్రి మరింత రద్దీగా కనిపించడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.

వారంవారం హెచ్చు

ఆలయ గణాంకాల ప్రకారం ఒక ఆదివారానికి తర్వాత వచ్చే ఆదివారానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఈనెల 10వ తేదీన రూ.500 టికెట్‌ ద్వారా 1,157 మంది దర్శనం చేసుకున్నారు. దీనిద్వారా రూ.5లక్షల78వేల500 ఆదాయం వచ్చింది. రూ.300 టికెట్‌ ద్వారా 700 మంది దర్శనం చేసుకోగా, రూ.2లక్షల10వేల ఆదాయం సమకూరింది. రూ.100 టికెట్‌ ద్వారా 3,612 మంది దర్శనం చేసుకున్నారు. దీనిద్వారా రూ.3లక్షల61వేల200 ఆదాయం దేవస్థానానికి సమకూరింది.

ఈనెల 17వ తేదీన రూ.500 టికెట్‌ ద్వారా 2,003 మంది దర్శనం చేసుకోగా, రూ.10లక్షల1500 ఆదాయం లభించింది. రూ.300 టికెట్‌ ద్వారా 1,008 మంది దర్శనం చేసుకున్నారు. ఈ టికెట్ల ద్వారా రూ.3లక్షల26వేల400 ఆదాయం వచ్చింది. ఇక రూ.100 టికెట్‌ ద్వారా 5,018 మంది చేసుకోగా, రూ.5లక్షల1800 ఆదాయం చేకూరింది.

24వ తేదీన రూ.500 టికెట్‌ ద్వారా 2,319 మంది చేసుకోగా, రూ.11లక్షల59వేల500 ఆదాయం వచ్చింది. రూ.300 టికెట్‌ ద్వారా 1,302 మంది దర్శనం చేసుకోగా, రూ.3లక్షల90వేల600 ఆదాయం లభించింది. రూ.100 టికెట్‌ ద్వారా 6,248 మంది దర్శనం చేసుకోగా, రూ.6లక్షల 24వేల800 ఆదాయం చేకూరింది. కేశఖండన టికెట్ల ద్వారా ఈనెల 10వ తేదీన రూ.54,560 ఆదాయం రాగా, 17న రూ.1,17,120, 24న రూ.1,17,120 ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ పెరగడంతో ప్రసాదాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలోనూ పెరుగుదల కనిపిస్తోంది. రాబోయే రోజులన్నీ సెలవులు కావడంతో ఈ ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఉచిత దర్శనానికి భారీ పెరుగుదల

ఆర్జిత టికెట్ల ద్వారానే కాదు.. ఉచిత దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్యలోనూ భారీగా పెరుగుదల కనిపించింది. సాధారణంగా ఆదివారాల్లో 25 వేల నుంచి 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ, ఈ నెల ఆదివారాల్లో రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రతి ఆదివారం సుమారు 35 వేల నుంచి 40 వేల మంది భక్తులు దర్శనానికి వస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 26 , 2024 | 01:00 AM