Share News

మొండిగోడల కాలనీలు!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:14 AM

జగనన్న కాలనీలు మొండిగోడలు దాటలేదు. సెంటు స్థలాల చొప్పున ఇళ్ల పట్టాల పేరుతో, ఇళ్ల నిర్మాణం పేరుతో నగరంలో గూడులేని పేదలను వైసీపీ ప్రభుత్వం వంచించింది. విజయవాడలో లక్ష మంది పేదలకు ఆవాసం కల్పిస్తామని నమ్మబలికి ఊరికి దూరంగా.. నిర్మానుష్య ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేనిచోట కొండ లు, గుట్టల నడుమ ఇళ్ల పట్టాలిచ్చి.. ఇళ్ల నిర్మాణాలు చేస్తామంటూ మోసం చేసింది. ఐదేళ్ల కాలం తిరిగితే ఏమున్నదయ్యా అంటే.. మౌలిక సదుపాయాలు లేని లే అవుట్లలో.. మొండిగోడలతో కూడిన ఇళ్లు ఉన్నాయి. ఇళ్లు అడుగు ముందుక పడక, మొండిగోడలను చూసి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

మొండిగోడల కాలనీలు!

అపహాస్యంగా జగనన్న కాలనీలు

ఊరికి దూరంగా 15 - 20 కిలోమీటర్లలో ఇళ్ల ప్లాట్లు

75 వేలమందికి నున్న, కొండపావులూరు, వణుకూరులలో ప్లాట్లు

25 వేల మందికి అమరావతిలో.. ప్లాట్లను చూపి మభ్యపెట్టారు

పట్టుమని ఐదువేల ఇళ్లు కూడా పూర్తి కాలేదు

అన్నీ మొండిగోడల దశలోనే.. అధికారపార్టీ నేతలే కాంట్రాక్టర్లు

పేదల దగ్గర నుంచి అదనంగా డబ్బులు కట్టించుకుని పరారీ

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 20 వేల ఇళ్లు కూడా నిర్మించలేని దౌర్భాగ్యం

జగనన్న కాలనీలు మొండిగోడలు దాటలేదు. సెంటు స్థలాల చొప్పున ఇళ్ల పట్టాల పేరుతో, ఇళ్ల నిర్మాణం పేరుతో నగరంలో గూడులేని పేదలను వైసీపీ ప్రభుత్వం వంచించింది. విజయవాడలో లక్ష మంది పేదలకు ఆవాసం కల్పిస్తామని నమ్మబలికి ఊరికి దూరంగా.. నిర్మానుష్య ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేనిచోట కొండ లు, గుట్టల నడుమ ఇళ్ల పట్టాలిచ్చి.. ఇళ్ల నిర్మాణాలు చేస్తామంటూ మోసం చేసింది. ఐదేళ్ల కాలం తిరిగితే ఏమున్నదయ్యా అంటే.. మౌలిక సదుపాయాలు లేని లే అవుట్లలో.. మొండిగోడలతో కూడిన ఇళ్లు ఉన్నాయి. ఇళ్లు అడుగు ముందుక పడక, మొండిగోడలను చూసి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : విజయవాడకు చెందిన వారికి నున్న, కొండపావులూరు, వణుకూరు గ్రామాల్లో లే అవుట్లు వేసి 75 వేల మందికి ఇళ్లు కల్పించారు. మరో 25 వేల మందికి అమరావతి రాజధాని నగరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. విజయవాడకు చెందిన 75 వేల మందికి సెంటు పట్టా చొప్పున ఇచ్చిన లే అవుట్లు అసౌకర్యాల నిలయంగా ఉన్నాయి. విజయవాడలో పనిచేసుకునే వారికి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నున్న ప్రాంతాన్ని మోడల్‌ లే అవుట్‌గా ప్రకటించారు. కొండపావులూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎంల దగ్గర కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన భూముల్లో ఇళ్ల పట్టాలు కల్పించారు. వణుకూరులో పంట పొలాలను కొనుగోలు చేసి లే అవుట్‌ వేశారు.

నున్న లే అవుట్‌లో మొండిగోలతో 9వేల ఇళ్లు

నున్న మోడల్‌ లే అవుట్‌లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో.. 10 వేల మందికి ఇళ్లు కల్పించారు. ఇక్కడ పది వేల ఇళ్లలో వెయ్యి ఇళ్లు మాత్రమే లబ్ధిదారులు కాస్తో, కూస్తో ఆర్థికంగా అవకాశం కలిగినవారు బయట అప్పులు తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన 9 వేల ఇళ్లు మొండిగోడలుగా ఉన్నాయి. రాప్తాడు ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టు సంస్థకు ఇళ్ల నిర్మాణ పనులు అప్పగించారు. కాంట్రాక్టు సంస్థ ఇంటిని కట్టిస్తానన్న ధర, కేంద్రం ప్రభుత్వం ఇస్తామన్న రూ.1.80 లక్షలను దాటిపోతుండటంతో.. ఆ ఎక్కువ మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించే పద్ధతిన పనులు చేపట్టేందుకు ఇచ్చారు. తీరా చూస్తే కాంట్రాక్టు సంస్థ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి వెళ్లిపోయింది. పనులైతే మొండిగోడలుగా ఉన్నాయి.

కొండపావులూరులో 10 శాతం ఇళ్లు కూడా పూర్తి చేయలేదు.

వణుకూరులో కొంతమేర పెనమలూరు నియోజకవర్గ పేదలు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. విజయవాడలోని మరో 25 వేల మందికి అమరావతి రాజధానిలో ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అక్కడ పట్టాలు చూపించి షో చేశారు. ఇళ్ల పనులే మొదలు కాలేదు. నగరంలోని పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీల్లో రోడ్లు లేవు. డ్రెయినేజీ పారుదల లేదు. వీధి లైట్లు లేవు.

అట్టహాసంగా ప్రారంభించి అభాసుపాలై..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇళ్ల పట్టాల కోసం 3,09,588 మంది లబ్ధిదారులను గుర్తించారు. మరో 30 వేల వరకు పొజిషన్‌ సర్టిఫికెట్స్‌, టిడ్కో ఇళ్ల మంజూరు పత్రాలు, రెగ్యులైజేషన్‌ పట్టాలు కూడా కలిపి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఈ 30 వేల పత్రాలను పక్కన పెడితే మొత్తం 3,09,588 ఇళ్ల పట్టాల లబ్ధిదారులకుగాను మొదటి విడతలో 1,65,400 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి నిర్ణయించారు. ఆ తర్వాత దశలో 1,44,188 ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు గృహనిర్మాణ శాఖకు బదలాయించారు. గృహనిర్మాణ శాఖ ఇళ్ల నిర్మాణాలకు నిర్ణయించిన లబ్ధిదారుల ఇళ్ల ప్లాట్లను జియో ట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. దీని కంటే ముందు లబ్ధిదారులకు పింపిణీ చేసిన ఇంటి పట్టాల ఆధారంగా ఆయా లే అవుట్లలో రెవెన్యూ యంత్రాంగం లబ్ధిదారులకు ప్లాట్లను చూపించాల్సి ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగం ఇళ్ల ప్లాట్లను క్షేత్ర స్థాయిలో చూపించి ఫొటో తీసిన తర్వాతే.. గృహ నిర్మాణ శాఖ జియోట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇళ్ల నిర్మాణాలకు నిర్ణయించిన జియో ట్యాగింగ్‌ పూర్తి చేశారు. జియో ట్యాగింగ్‌ పూర్తయి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటి వరకు కూడా కేవలం 20 వేల ఇళ్ల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. దాదాపుగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాలు బేస్‌మెంట్‌ దశలోనే మొండిగోడలతో ఉన్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 01:14 AM